Pain: కీళ్ల నొప్పిని కొని తెచ్చుకుంటున్నామా? డాక్టర్ల వాదనలో నిజమెంత?

ABN , First Publish Date - 2023-08-08T11:27:00+05:30 IST

పుణ్యం, పురుషార్థాలన్నీ అందనంత ఎత్తులోనే ఉంటాయి. కష్టపడి మెట్లెక్కి భగవంతుడిని దర్శించుకుంటే ఏదో సాధించేశామనే సంతృప్తి. ఒంటి చేత్తో ఇంటి పనులన్నీ చక్కబెడితే బాధ్యతలన్నీ నెరవేర్చామనే సంతృప్తి. అయితే ఈ పనులన్నీ ఒకనాటికి కీళ్ల మీద ప్రభావం చూపిస్తే

Pain: కీళ్ల నొప్పిని కొని తెచ్చుకుంటున్నామా? డాక్టర్ల వాదనలో నిజమెంత?

పుణ్యం, పురుషార్థాలన్నీ అందనంత ఎత్తులోనే ఉంటాయి. కష్టపడి మెట్లెక్కి భగవంతుడిని దర్శించుకుంటే ఏదో సాధించేశామనే సంతృప్తి. ఒంటి చేత్తో ఇంటి పనులన్నీ చక్కబెడితే బాధ్యతలన్నీ నెరవేర్చామనే సంతృప్తి. అయితే ఈ పనులన్నీ ఒకనాటికి కీళ్ల మీద ప్రభావం చూపిస్తే ఆ సంతృప్తి కాస్తా విరక్తిగా మారుతుంది. కాబట్టి మొదట కీళ్లను కాపాడుకోవాలి. అయినా అవి అరిగితే సర్జరీకి బదులుగా ప్లాస్మా థెరపీనే ఎంచుకోవాలంటున్నారు వైద్యులు.

మోకాళ్ల నొప్పులు అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా మారింది. వయసైపోయిందని అనుకుంటారేమోననే భయంతో నొప్పిని భరిస్తూనే పనులన్నీ చక్కబెట్టుకోవడం మరీ ముఖ్యంగా మహిళలకు అలవాటై పోయింది. కీళ్లు అరిగిపోయాయి అని అనుకుంటాం కానీ నిజానికి అరిగేది కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి మాత్రమే! అది కూడా అరిగితే ఎముకలు రాసుకుని, వేసే ప్రతి అడుగులో నరకం కనిపిస్తుంది. అవసరానికి మించి శరీరాన్ని శ్రమకు గురి చేయడం, ప్రమాదాల్లో తగిలే గాయాలు, క్రీడల గాయాలు, వయసు పైబడడం.. ఇలా కీళ్లు అరగడానికి లెక్కలేనన్ని కారణాలు. మోకీళ్లతో పాటు భుజం, వెన్ను, తుంటి.. ఇలా వేర్వేరు కీళ్లలో నొప్పి, అరుగుదల మొదలవవచ్చు. కానీ ప్రారంభంలో ఏ ఒక్కరూ నొప్పిని పెద్దగా పట్టించుకోరు. భరించలేని పరిస్థితి వచ్చేవరకూ ఆగి, అప్పుడు ఎముకల వైద్యులను కలుస్తూ ఉంటారు. ఇంతలా అరిగాక మోకాలి మార్పిడి ఒక్కటే మార్గం అని వైద్యులు సూచిస్తే, మరో ఆలోచన లేకుండా సర్జరీకి సిద్ధపడిపోతూ ఉంటారు. కానీ మృదులాస్థి అరిగినంత మాత్రాన కృత్రిమ కీళ్లనే ఆశ్రయించాలా? ఉన్న కీలును సరిదిద్దుకునే చికిత్సలే లేవా? ఎందుకు లేవూ, భేషుగ్గా ఉన్నాయి. అలాంటిదే ‘ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ’.. పిఆర్‌పి.

సర్జరీతో నష్టాలున్నాయి

సహజమైన కీలును సర్జరీతో సరిదిద్దితే, కచ్చితంగా దాని జీవిత కాలం తగ్గిపోతుంది. సర్జరీలో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆ ప్రదేశాల్లో ఫైబ్రోసిస్‌ తయారవుతుంది. కీలు, లిగమెంట్లు, టెండాన్లకు సర్జరీలు చేయించుకుంటే, అప్పటికి సమస్య పరిష్కారమైందని అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో సమస్య మళ్లీ మొదటికి రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? రెండోసారి సర్జరీని తట్టుకునే శక్తి ఎముకకు కూడా ఉండాలి కదా? అందుకే కీళ్ల నొప్పులకు అంతిమ పరిష్కారం సర్జరీ ఒక్కటే అనే నమ్మకం నుంచి బయటకు రావాలి అంటున్నారు డాక్టర్‌ సుధీర్‌ దారా. అసలు అన్నిటికంటే ముందు కీళ్లు అరిగే పరిస్థితికే చేరుకోకూడదు అంటున్నారాయన. ఇది డీజనరేటివ్‌ కండిషన్‌ కాబట్టి అనవసరంగా కీళ్లను అవసరానికి మించి వాడడం తగ్గించుకోవాలి. వ్యాయామం ఆరోగ్యానికి మంచిది అని అవసరానికి మించి జిమ్‌లో వ్యాయామాలు చేసేసి, నొప్పులతో వైద్యులను కలిసే వాళ్లు ఉన్నారు. 45, 50 ఏళ్లు దాటిన వాళ్లు వారానికి ఆరు రోజులు 45 నిమిషాల పాటు నడిస్తే సరిపోతుంది. చిన్నపాటి స్ట్రెచింగ్‌ వ్యాయామాలు సరిపోతాయి. కానీ కండపుష్ఠితో కనిపించడం కోసం అవసరానికి మించి వెయిట్‌ ట్రైనింగ్‌ చేసేస్తూ ఉంటారు. అందుకోసం వ్యాయామాలు చేయడాన్ని హీరోయిజంగా భావిస్తూ శరీరాన్ని డీజనరేట్‌ చేసుకుంటూ ఉంటారు. గృహిణులు పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ అహరహం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంటి పనంతా ఒక్కదాన్నే చక్కబెతున్నాను అని గర్వపడుతూ ఉంటారు. భగవంతుడి మీద భక్తితో గుళ్లూ గోపురాలూ తిరుగుతూ, శ్రమ పడి గుడి మెట్లెక్కుతూ ఉంటారు. దాంతో మెనోపాజ్‌ దశకు చేరుకునే సరికి కీళ్లన్నీ అరగడం మొదలుపెడతాయి. కానీ నిజానికి ఎముకలు, కీళ్లను అరగకుండా కాపాడుకుంటే, వైద్యులను సంప్రతించే పని తప్పుతుందనే విషయాన్ని మొదట అందరూ గ్రహించాలి.

కొవిడ్‌ తర్వాత తుంటి నొప్పి

కొవిడ్‌లో ఉపయోగించిన అధిక మోతాదుల్లోని స్టిరాయిడ్ల వాడకం వల్ల ఎవిఎన్‌ అనే అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ ఆఫ్‌ ది హిప్‌ సమస్య పెరిగింది. ఈ సమస్యలో తుంటి ఎముక తల పూర్తిగా అరిగిపోయి, దానికి రక్త సరఫరా జరగక హిప్‌ జాయింట్‌ కొలాప్స్‌ అయిపోతోంది. మరీ ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వయసులో తుంటి సర్జరీ చేయించుకుంటే, ఇంప్లాంట్‌ జీవిత కాలం తక్కువ కాబట్టి, మళ్లీ రెండో సర్జరీ అవసరం పడవచ్చు. కానీ అప్పటికి తుంటి ఎముక సహకరించకపోవచ్చు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అలాగే వెన్ను నొప్పి, సయాటికా, డిస్క్‌ సమస్యలు ఉన్న వాళ్లలో సర్జరీ అవసరమయ్యే వాళ్లు కేవలం 5 శాతం మందే అంటున్నారు డాక్టర్‌ సుధీర్‌ దారా. మిగతా 95 శాతం మందికి రీజనరేటివ్‌ చికిత్సతో సమస్యను నయం చేయవచ్చనీ, ఎముక ఫ్రాక్చర్‌ అయినప్పుడు మినహా మణికట్టు, చీలమండలం, భుజం, మోచేయి, మోకాలు.. ఇలా ఎలాంటి కీలు సమస్యకూ సర్జరీనే ఆశ్రయించవలసిన అవసరం లేదని కూడా అంటున్నారాయన.

dk.jpg

సురక్షితం, సమర్థం

ఒకవేళ మోకీలులో ఎసిఎల్‌ లేదా పిసిఎల్‌ టేర్‌, లేదా మెనిస్కస్‌ ఇంజురీ ఉంటే, వాటికి సర్జరీ చేసి, కుట్లు వేయకుండా సహజసిద్ధంగా, రోగి రక్తంతోనే ఆ గాయాలను మాన్పుకోవచ్చు. ఇందుకు రోగి రక్తంలోని ప్లేట్‌లెట్లలోని గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌ను సేకరించి, సమస్య ఉన్న ప్రాంతంలోకి ఇంజెక్ట్‌ చేసే ప్లాస్మా థెరపీ ఉపకరిస్తుంది. మోకాలి మార్పిడి సర్జరీతో పోలిస్తే, ప్లాస్మా చికిత్స ఎంతో సురక్షితమైనది, సమర్థమైనది. కోత, రక్తస్రావం లేని ఈ చికిత్స నిమిషాల వ్యవధిలోనే ముగిసిపోతుంది. దీంతో ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. కీలు అరుగుదల ఏ దశలో ఉన్నా ప్లాస్మా చికిత్సను ఎంచుకోవచ్చు. రోగి సమస్య తీవ్రత ఆధారంగా ఎన్ని సెషన్లు అవసరమవుతాయో వైద్యులే నిర్ణయిస్తారు. చికిత్స తదనంతరం కీళ్లు ఒత్తిడికి గురి కాని, జీవనశైలిని కొనసాగించాలి. ప్లాస్మా చికిత్స ద్వారా టెన్నిస్‌ ఎల్బో, జంపర్స్‌ నీ లాంటి క్రీడా గాయాలకు కూడా చికిత్స చేయవచ్చు.

జిమ్‌తో జోకులు వద్దు

సైక్లింగ్‌, మారథాన్‌లు, జిమ్‌ వ్యాయామాలు, క్రీడలు.. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే! కానీ మన జీవనశైలికి అవి ఎంతవరకూ సూటవుతాయో తెలుసుకోవాలి. వ్యాయామాల మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలి. అప్పటివరకూ అలవాటు లేని క్రీడనూ లేదా వ్యాయామాన్ని ఏకధాటిగా కొనసాగించడం సరి కాదు. ఏ వ్యాయామాన్నైనా శరీరానికి నెమ్మదిగా అలవాటు చేయాలి. కొందరు మధ్య వయస్కులైన మగవాళ్లు ఆఫీసు నుంచి ఇంటికెళ్లిన తర్వాత, క్రికెట్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోయి క్రికెట్‌ ఆడేస్తూ ఉంటారు. ఇంకొందరు బ్యాడ్మింటన్‌ లేదా సైక్లింగ్‌ చేసేస్తూ ఉంటారు. అయితే వీటితో ఎముకలు, కీళ్లు శ్రమకు గురువుతున్నాయేమో గమనించుకోవాలి. సెలబ్రిటీలు, సినిమా నటులు, క్రీడాకారులు... వీళ్లు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం జిమ్‌ వ్యాయామాలు చేయడం అవసరమే! కానీ ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు జిమ్‌లో కండలు పెంచవలసిన అవసరం ఏముంది? ఫిట్‌గా ఉంటే సరిపోతుంది. అందుకోసం తగిన వ్యాయామాలున్నాయి. కాబట్టి వాటిని ఎంచుకుంటే సరిపోతుంది కదా? అంటున్నారు సుధీర్‌ దారా. అలాగే యోగా కూడా! యోగాసనాలు వేస్తున్నా, నడుము పట్టేసింది, ఇలా జరగకూడదు కదా? అని వైద్యుల్ని కలిసి గొప్పగా చెప్పుకునే వాళ్లుంటారు. యోగాసనాల వల్లే నడుము పట్టేసిందేమో అనే కోణంలో కూడా ఆలోచించాలి.

శాశ్వత పరిష్కారం కోసం ఏం చేయాలంటే...

మన జీవనశైలి, అలవాట్లను తరచి చూసుకుని, కీళ్లలో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి. ఏవి అవసరమో, ఏవి అవసరం కాదో ఎవరికి వారు గ్రహించాలి. శక్తికి మించిన పనులకు స్వస్థి చెప్పాలి. ఇవన్నీ పాటిస్తున్నప్పటికీ, ఏ కీలులోనైనా నొప్పి మొదలైతే, సరైన డయాగ్నొసిస్‌ చేయించుకోవాలి. ఉదాహరణకు వెన్నులో సమస్య ఉంటే ఎమ్మారై చేసి, వెన్నుకు చేయవలసిన మూడు సర్జరీలో ఏదో ఒక సర్జరీ చేసేస్తూ ఉంటారు. డిస్క్‌ సరిచేయడం, ఫిక్సేషన్‌, బోన్‌ ఫ్రాక్చర్‌ను సరిచేయడం ... ఇలా వెన్నుకు మూడు ప్రధాన సర్జరీలే చేస్తూ ఉంటారు. కానీ నొప్పిని కలుగజేసే నిర్మాణాలు వెన్నులో 90 వరకూ ఉంటాయి. వాటిలో సమస్య ఉన్నప్పుడు, ఎమ్మారై ఆధారంగా సర్జరీ చేయించుకుంటే నొప్పి తగ్గకపోగా, ఇతరత్రా సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్లమవుతాం. రీజనరేటివ్‌ థెరపీలో డయాగ్నొసి్‌సలో భాగంగా చేసే స్కాన్‌ ద్వారా, కీలులో ఏ భాగం అరగడం వల్ల నొప్పి వస్తుందో కచ్చితంగా కనిపెట్టడం జరుగుతుంది. అలాగే డ్యామేజీని కొలిచి, దాని ఆధారంగా తీవ్రత గురించి వైద్యులు అంచనాకు వస్తారు. మోకాళ్లలో మృదులాస్థి రెండు మిల్లీమీటర్ల మందం కలిగి ఉండాలి. స్కాన్‌ ద్వారా మృదులాస్థి ఎంతమేరకు తగ్గిందో గుర్తించి, తగ్గిన మృదులాస్థిని తిరిగి పూర్వ స్థితికి పెంచడం కోసం ఎన్ని సిట్టింగ్స్‌ అవసరమో వైద్యులు లెక్కిస్తారు. అలాగే ప్రతి సిట్టింగ్‌ తర్వాత, మళ్లీ స్కాన్‌ చేసి పరిస్థితిని పరిశీలించి, పరిస్థితిలో వృద్ధిని అంచనా వేసి ఒక చికిత్సా ప్రొటోకాల్‌ను తయారు చేసుకుని దాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ చికిత్స తీసుకోవడంతో పాటు, కీళ్ల అరుగుదలకు కారణమైన పూర్వపు అలవాట్లను తగ్గించుకుని, వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే సమస్య మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుంది.

ss.jpg

-డాక్టర్‌ సుధీర్‌ దారా,

ఫౌండర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎపి వన్‌,

సెంటర్‌ ఫర్‌ పెయిన్‌ రిలీఫ్‌ అండ్‌ బియాండ్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-08-08T11:27:52+05:30 IST