Health: నడి వయసులో కూడా జీవితాన్ని ఇలా ఆస్వాదించవచ్చు
ABN , First Publish Date - 2023-08-15T11:55:02+05:30 IST
సగం నిండిన గ్లాసును చూస్తే కొందరికి గ్లాసు సగం నిండుగా ఉందని భరోసా కలిగితే, ఇంకొందరికి గ్లాసు సగం ఖాళీ అయిందనే నిరాశ కలుగుతుంది. ఈ దృక్పథాన్ని జీవితానికీ వర్తించుకోవచ్చు. నడి వయసుకు చేరుకోగానే పెద్దరికాన్ని మీదేసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చిన్నా చితకా రుగ్మతలు మొదలైనా వాటిని అదుపులో ఉంచుకుంటూ, యవ్వనవంతుల్లా జీవించవచ్చు. మిగతా అర్థ జీవితాన్ని సానుకూల ధృక్పథంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.
సగం నిండిన గ్లాసును చూస్తే కొందరికి గ్లాసు సగం నిండుగా ఉందని భరోసా కలిగితే, ఇంకొందరికి గ్లాసు సగం ఖాళీ అయిందనే నిరాశ కలుగుతుంది. ఈ దృక్పథాన్ని జీవితానికీ వర్తించుకోవచ్చు. నడి వయసుకు చేరుకోగానే పెద్దరికాన్ని మీదేసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చిన్నా చితకా రుగ్మతలు మొదలైనా వాటిని అదుపులో ఉంచుకుంటూ, యవ్వనవంతుల్లా జీవించవచ్చు. మిగతా అర్థ జీవితాన్ని సానుకూల ధృక్పథంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.
నిజానికి యాభై తర్వాతి వయసు చీకూ చింతలూ లేకుండా కులాసాగా గడిపే వీలున్న వయసు. పిల్లలు ఉద్యోగాల్లో సెటిలైపోయి ఉంటారు. చేతి నిండా కావలసినంత ఖాళీ సమయం ఉంటుంది. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపానికి కూడా కొదవ ఉండదు. అయినా పెద్దల్లో అర్థం లేని నిరాసక్తత, కుంగుబాటు, ఏదో కోల్పోయామనే నిర్లిప్తతతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ సమయాల పాటు తమ గదులకే పరిమితమైపోవడం, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ అదే ప్రపంచంలో కూరుకుపోవడం, రోజులను నిస్సారంగా గడుపుతూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఇందుకు మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు లాంటి రుగ్మతలు కొంత వరకూ కారణమే! అయినా వీటిని నియంత్రణలో ఉంచుకుంటూ, హుషారుగా, సరదాగా, అన్నిటికంటే ముఖ్యంగా యవ్వనవంతంగా జీవితాన్ని కొనసాగించే వీలుంది.
మెనోపాజ్‌తో వయసు పైబడదు
నడి వయసులో ఉన్న మహిళలకు టక్కున పెద్దరికాన్ని గుర్తు చేసే అంశం.. మెనోపాజ్. ఇది మహిళలకు ఒక శరాఘాతమే! మహిళలు ఈ అంశాన్ని ఎంతో వ్యక్తిగతంగా తీసుకుంటారు. వయసు పైబడిందనడానికి మెనోపాజ్‌ను సంకేతంగా భావించే మహిళల్లో మునుపటి హుషారు, చలాకీతనం లోపిస్తుంది. మానసిక కుంగుబాటు వేధిస్తుంది. కానీ మెనోపాజ్‌తోనే జీవితం ఆగిపోదు అనే విషయాన్ని మహిళలు గ్రహించాలి. కొన్ని జాగ్రత్తలతో, స్వల్ప చికిత్సలతో భౌతికంగా, మానసికంగా మునుపటి లాగే చురుకైన జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముందు బరువును అదుపులో పెట్టుకోవాలి. శరీరంలోని హార్మోన్ల స్రావాల్లో హెచ్చుతగ్గుల వల్ల 50 ఏళ్ల వయసులో మహిళలు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడంతో ఎముకలు గుల్ల బారే సమస్య ఈ వయసు నుంచే మొదలవుతుంది. కాబట్టి అధిక బరువుతో కీళ్ల సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అలాగే అధిక బరువుతో ముడిపడి ఉండే మఽధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు వేధించకుండా ఉండాలన్నా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అందుకోసం డైట్‌ను నియంత్రణలో ఉంచుకుంటూ, వ్యాయామాలు కూడా చేయాలి.
మెనోపాజ్‌కు ముందు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మహిళలకు గుండె జబ్బుల నుంచి రక్షణ దక్కుతూ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత, మహిళలు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు పురుషులతో సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం సహజసిద్ధమైన రక్షణను అందించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా తీసుకోవాలి. ఇందుకోసం కాలానుగుణ పండ్లతో పాటు, సిట్రస్ పండ్లు ఎక్కువగా తినాలి. ప్రతి భోజనంతో పండ్లు తినేలా చూసుకోవాలి. ఫైబర్ కోసం సలాడ్లు తినాలి. ఈ అలవాట్లతో చర్మం మీద ముడతలు తగ్గుతాయి. వయసు పైబడే వేగం నెమ్మదిస్తుంది.
మధుమేహంతో ప్రి మెచ్యూర్ ఏజింగ్
45 ఏళ్లు దాటిన పురుషుల్లో కార్డియోవ్యాస్క్యులర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒబేసిటీ, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వాళ్లు మద్యపానం, ధూమపానం చేసే వాళ్లకు గుండె జబ్బుల రిస్క్ చాలా ఎక్కువ. కాబట్టి ఆరోగ్య సమస్యలకు క్రమం తప్పక వైద్యులను కలుస్తూ, డైట్‌ను కచ్చితంగా పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఉండాలి. గంట పాటు వ్యాయామం చేస్తే, ఆయుష్షు మూడు గంటలు పెరుగుతుందనే ఒక నానుడి ఉంది. కాబట్టి వారంలో కనీసం ఐదు రోజుల పాటు, గంట చొప్పున వ్యాయామం చేయాలి. నియంత్రణ తప్పిన మధుమేహంతో భౌతికంగా, మానసికంగా ప్రిమెచ్యూర్ ఏజింగ్ మొదలవుతుంది. వయసు పైబడిన వాళ్లలా కనిపించడంతో పాటు, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. వీళ్లకు డిమెన్షియా ఎంతో ముందుగానే మొదలవుతుంది. వీటికి అడ్డుకట్ట వేయడం కోసం చక్కెరను అదుపులో ఉంచుకోవాలి.
వార్షిక పరీక్షలు తప్పనిసరి
రిస్క్ ఉన్న వాళ్లు, రిస్క్ లేని వాళ్లుగా విభజిస్తే, రిస్క్ ఉన్న 50 ఏళ్లు దాటిన మహిళలూ, పురుషులూ... కంప్లీట్ బ్లడ్ కౌంట్, కార్డియాక్, రీనల్ ఫంక్షన్ పరీక్షలతో పాటు, యూరిన్ ఎగ్జామినేషన్, కొలెస్ట్రాల్, గుండె పరీక్షలు ఏడాదికోసారి తప్పనిసరిగా చేయించుకోవాలి. వీటితో పాటు ఈ నియమాలు పాటించాలి...
రోజుకు మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి
మూడు భారీ భోజనాలకు బదులుగా తక్కువ పరిమాణంలో ఐదు సార్లు తినాలి
రాత్రి భోజనం వీలైనంత తేలికగా ఉండేలా చూసుకోవాలి
పీచు, పండ్లు, పెరుగు తప్పనసరిగా తినాలి
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి
ఆల్కహాల్, నొకొటిన్ మానేయాలి
నూనెలు... ఇలా
నూనెల్లోని వేర్వేరు పోషకాలను పొందడం కోసం వాటిని తరచూ మారుస్తూ ఉండాలి. ఒక ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడితే, తర్వాత వేరు సెనగ నూనె వాడాలి. ఇంకోసారి నువ్వుల నూనె వాడుకోవాలి. డీప్ ఫ్రైల కోసం స్వచ్ఛమైన పొద్దు తిరుగుడు నూనె వాడుకోవచ్చు. మిగతా నూనెలను కూడా డీప్ ఫ్రైలకు ఉపయోగించుకోవచ్చు. కానీ వీటిని ఒకసారి డీప్ ఫ్రైకి వాడిన తర్వాత, చల్లార్చి సీసాలో పోసి, మూత పెట్టి ఉంచుకుని, కూరలకు, తాలింపులకు వాడుకోవచ్చు. అంతే తప్ప రెండోసారి డీప్ ఫ్రైలకు ఉపయోగించ కూడదు. ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను పెంచి ఇన్‌ఫ్లమేషన్‌ను కలిగిస్తాయి. కాబట్టి పదే పదే ఒకే నూనెలో వేయించే డీప్ ఫ్రైడ్ పదార్థాలు (బజార్లో దొరికే చిప్స్, పూరీలు, వడలు, బజ్జీలు, పకోడీలు), ప్రాసె్‌సడ్ ఫుడ్స్‌లో రంగులు, నిల్వ పదార్థాలు వాడతారు. ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల మరీ ముఖ్యంగా మహిళల్లో అంతఃస్రావ గ్రంథుల పనితీరు అస్తవ్యస్థమై పిసిఒడి, థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి.
-డాక్టర్ శశి కిరణ్
సీనియర్ జనరల్ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.
ముందస్తు పరీక్షలు అత్యవసరం
నడి వయసు మెనోపాజ్‌తో వేధించే ఇబ్బందులను అధిగమించాలంటే, వాటి పట్ల అవగాహనతో మెలగుతూ, వీలైనంత బిజీగా జీవితాన్ని గడపాలి. లక్షణాల నుంచి దృష్టి మరల్చి, ఆహ్లాదం కలిగించే పనుల మీద మనసు పెట్టాలి. ఇది ఉద్యోగినులకు సాధ్యపడుతుంది. అలాగే గృహిణులు కూడా నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకోవాలి. ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్ లాంటి మొదలు పెట్టవచ్చు. ఇలా కాలక్షేపానికి కొదవ లేకుండా చూసుకోవాలి. మనసును ఖాళీగా ఉండకుండా చూసుకుంటే చిన్నపాటి నొప్పులు, డిప్రెషన్, ఆందోళనలను పట్టించుకునే సమయం ఉండదు. అలా ఉండబట్టే ఉద్యోగినులు చురుగ్గా, ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే సామాజిక అనుబంధాలు పెంచుకున్నప్పుడు, స్నేహితులు, సన్నిహితులతో అన్ని విషయాలనూ పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ల నుంచి అందే మోరల్ సపోర్ట్, కౌన్సెలింగ్‌లతో మనసు కూడా తేలిక పడుతుంది. కబుర్లతో, నవ్వు తెప్పించే మాటలతో మనసు, శరీరం హుషారుగా మారతాయి. కాబట్టి నడి వయసుకు చేరుకున్న మహిళలు మరీ ముఖ్యంగా మెనోపాజ్ మీద దృష్టి పెట్టకుండా, మునుపటిలా జీవితాన్ని కొనసాగించే పనుల మీద దృష్టి పెట్టాలి.
ముదరకుండా...
50ల ముందున్న శక్తి 50 తర్వాత ఉండకపోవచ్చు. అయితే అదనపు జాగ్రత్తలు, అవగాహనలతో ఈ అంతరాన్ని తగ్గించుకోవచ్చు. అందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలి. సమతులాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పక వ్యాయామం చేయాలి. వ్యాయామాలు అలవాటున్న వాళ్లు అదే తీవ్రతను కొనసాగించవచ్చు. కొత్తగా మొదలు పెట్టినవాళ్లు నడకను ఎంచుకోవచ్చు. శరీరంలోని కండరాలన్నీ స్ట్రెచ్ అవడం కోసం యోగా కూడా ఎంచుకోవచ్చు. అలాగే రోజుకు పది నిమిషాల ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. వీటితో ఒత్తిడిని తేలికగా హ్యాండిల్ చేయగలుగుతాం! అలాగే నడి వయసుకు చేరుకున్న మహిళలు కొన్ని పరీక్షలను క్రమం తప్పక చేయించుకుంటూ ఉండాలి. దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ఏ లక్షణాన్నీ ఈ వయసులో నిర్లక్ష్యం చేయకూడదు. అవి భౌతికమైనవీ కావచ్చు, మానసికమైనవీ కావచ్చు. ఎలాంటి లక్షణాలూ లేకపోయినా, పైబడే వయసులో కొన్ని రుగ్మతలు మొదలయ్యే అవకాశాలుంటాయి కాబట్టి వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ఏ రుగ్మతైనా ప్రారంభంలో కనిపెట్టగలుగుతాం. ముఖ్యంగా పెరిగే వయసుతో ఎముకల సాంద్రత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎముకలు తేలికగా విరిగే అవకాశాలు పెరుగుతాయి. వార్షిక పరీక్షల్లో బోన్ డెన్సిటీని పరీక్షించుకుని, అవసరాన్ని బట్టి క్యాల్షియం, విటమిన్ డిలను పెంచే ఇంజక్షన్లను తీసుకోవచ్చు. పెద్దవాళ్లలో బాత్రూములో జారి పడి తుంటి విరిగే అవకాశాలను ఇలా ముందుగానే నియంత్రించుకోవచ్చు. అలాగే అలా్ట్రసౌండ్ అబ్డామిన్, అలా్ట్రసౌండ్ బ్రెస్ట్, సోనో మామోగ్రామ్, పాప్‌స్మియర్ పరీక్షలు కూడా తప్పనిసరి. వీటిలో రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లను ప్రారంభ దశల్లోనే కనిపెట్టవచ్చు. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి మామోగ్రామ్, పాప్‌స్మియర్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నెలకోసారి రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకుని, ఏ స్వల్ప మార్పునైనా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. మధుమేహం, కేన్సర్‌ల లాంటివి వంశపారంపర్యమైనవి కాబట్టి కుటుంబంలో ఈ రుగ్మతలు ఉన్నప్పుడు వాటిని ముందుగానే పసిగట్టే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా అమ్మ, పిన్ని, అత్త ఇలా దగ్గరి సంబంధీకులకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చి ఉంటే, ఆ కుటుంబంలోని మహిళలు తప్పనిసరిగా బ్రాకా జీన్ టెస్ట్ చేయించుకోవాలి.
ఆ సమస్యను అపొచ్చు
తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ కావడం, వాష్‌రూమ్‌కు వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవడం పెద్దల్లో సహజం. మహిళల్లో సాధారణ ప్రసవాలవల్ల స్ప్లింటర్లు వదులై, నడి వయసులో ఈ సమస్య మొదలు కావచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెద్దదై మూత్రాశయం మీద ఒత్తిడి పెరగడంవల్ల ఇలా జరుగవచ్చు. ఈ సమస్యలకు సమర్థమైన చికిత్సలున్నాయి. మహిళలు ప్రారంభంలో కెగెల్ వ్యాయామాలు చేయాలి. ఫలితం లేకపోతే, మందులు వాడుకోవాలి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చిన్నపాటి సర్జరీ చేయించుకోవచ్చు. పురుషులకు మందులతోనే ఈ సమస్య పరిష్కారమవ్వచ్చు. అరుదుగా ప్రోస్టేట్ సర్జరీ అవసరం పడవచ్చు.
డాక్టర్ హిమబిందు వీర్ల
కన్సల్టెంట్ అబ్‌స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.
ఆహారం ఆచి తూచి...
ప్రెగ్నెన్సీలో తినే ఆహారం మీద ఎంతటి శ్రద్ధ కనబరుస్తామో మెనోపాజ్‌లో కూడా అంతే శ్రద్ధ కనబరచాలి. మెనోపాజ్‌లో హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల నడి వయసు మహిళలు మధుమేహం, ఆర్థ్రయిటిస్, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఈ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవాలి. అలాగే బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆర్థ్రయిటిస్ సమస్య ముదరకుండా ఉండడం కోసం ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. హార్మోన్ అవకతవకల వల్ల ఈ వయసులో అజీర్తి, కడుప ఉబ్బరం, అసిడిటీ కూడా వేధిస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే....
ఫైబర్‌తో కూడిన ప్రొటీన్ పదార్థాలైన రాజ్మా, సెనగలు, బొబ్బర్లు తరచూ తింటూ ఉండాలి
నాన్ వెజ్ తినేవాళ్లు ఇంట్లో వండిన చికెన్, ఫిష్ తినాలి
రోజూ తప్పనిసరిగా ఏదో ఒక పండు తినడం అలవాటు చేసుకోవాలి
లంచ్‌లో ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి
సాయంత్రం సమయాల్లో టీ, కాఫీలు తగ్గించి డ్రై ఫ్రూట్స్ తినాలి
కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం మొదలైన ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి
ఎర్లీ బ్రేక్‌ఫాస్ట్, ఎర్లీ డిన్నర్ తినాలి. లంచ్ కూడా సమయానికి చేస్తూ ఉండాలి.
క్యాల్షియం, బి12 దొరికే చికెన్, గుడ్లు, బొబ్బర్లు, అలసందలు, బీన్స్ తరచూ తింటూ ఉండాలి
అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ తింటూ ఉండాలి
ఒమేగా3 ఉన్న బాదం, పిస్తా, వాల్‌నట్స్, నువ్వులు, గుమ్మడి, పుచ్చ విత్తనాలు, రైస్ బ్రాన్, ఆలివ్ ఆయిల్స్ పెంచాలి.
ఒమేగా6 ఉండే సన్‌ఫ్లవర్, కాటన్ సీడ్, పామాయిల్ వాడకం తగ్గించాలి.
ఆ దూరం వద్దు
నడి వయసులో ఆర్థిక ఆసరా కంటే మానసిక ఆసరా అవసరం ఎక్కువ. కాబట్టి నడి వయసు దంపతులు ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, మానసిక ఆలంబనను, ఆప్యాయతలను పంచుకోవాలి. వయసు పైబడుతున్నంత మాత్రాన లైంగిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేయవలసిన అవసరం లేదు. చిన్నతనంగా కూడా భావించకూడదు. మునుపటిలా చురుగ్గా ఉండగలిగితే, హ్యాపీ హార్మోన్లు విడుదలై వయసు పైబడే ప్రక్రియ నెమ్మదిస్తుంది. మనసు ఆహ్లాదంగా, శరీరం చలాకీగా మారతాయి. మెనోపాజ్‌తో పాటు వేధించే వెజైనల్ డ్రైనెస్, ఒంటి నుంచి వేడి ఆవిర్లు, లైంగికాసక్తి లోపించడం, మూడ్ స్వింగ్స్ లాంటి లక్షణాలకు ఐసోఫ్లేవిన్లతో కూడిన సురక్షితమైన మందులున్నాయి. అలాగే ఈస్ట్రోజన్ వెజైనల్ క్రీమ్స్ కూడా వాడుకోవచ్చు. వీటితో ఫలితం కనిపించకపోతే, కొద్ది కాలం పాటు ఈస్ర్టోజన్ టాబ్లెట్స్ వాడుకోవచ్చు.
డాక్టర్ సుజాత స్టీఫెన్
చీఫ్ న్యూట్రిషనిస్ట్,
యశోద హాస్పిటల్స్,
మలక్ పేట,
హైదరాబాద్.