pain: ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా..!
ABN , First Publish Date - 2023-06-06T11:41:32+05:30 IST
కొద్ది దూరాల నడకకే పిక్కలు, పాదాల్లో నొప్పి మొదలవుతోందా? రాత్రి వేళ కాళ్ల నొప్పితో నిద్ర కరువవుతోందా? అయితే
కొద్ది దూరాల నడకకే పిక్కలు, పాదాల్లో నొప్పి మొదలవుతోందా? రాత్రి వేళ కాళ్ల నొప్పితో నిద్ర కరువవుతోందా? అయితే ఆ సమస్య ‘పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్’ కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించి, పూడుకుపోయిన రక్తనాళాలను సరిచేసు కోవాలంటున్నారు వైద్యులు.
గుండె రక్తనాళాలు ఇరుకుగా మారినట్టే కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలు ఇరుకుగా మారతాయి. కానీ గుండె సమస్యను పరిగణించినంత తీవ్రంగా కాళ్లూ, చేతుల్లోని సమస్యలను పరిగణించడం. నొప్పిని నిర్లక్ష్యం చేస్తాం. సొంత వైద్యం చేస్తాం. ఎంతకూ నొప్పి అదుపులోకి రాక, దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే వైద్యులను కలుస్తూ ఉంటాం. అయితే ఈ నొప్పులకు పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ కారణమైతే చికిత్స ఆలస్యం చేయడం వల్ల, ఇన్‌ఫెక్షన్లు, గాయాలు మానకపోవడం లాంటి సమస్యలకు దారితీయడంతో పాటు కొన్ని సందర్భాల్లో అవయవాన్ని తొలగించవలసిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాబట్టి కాళ్లు, చేతుల్లో పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ తాలూకు లక్షణాలను మొదట్లోనే పసిగట్టాలి.
పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ అంటే?
గుండె రక్తనాళాలు అవరోధాలతో ఇరుకుగా మారినట్టే కాళ్లూ, చేతుల్లోని రక్తనాళాల్లో కూడా అవరోధాలు ఏర్పడి ఇరుకుగా మారి కాళ్లూ, చేతులకు రక్తసరఫరా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోతాయి. పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్‌లో జరిగేది ఇదే! దాంతో సమస్య ఉన్న అవయవాల్లో నొప్పులు, మొద్దుబారడం, బలహీనతలూ ఏర్పడతాయి.
లక్షణాలు ఇలా...
50 ఏళ్లు పైబడిన వాళ్లు కనీసం ఒక కిలోమీటరు దూరం పాటు ఆగకుండా నడవగలగాలి. కానీ ఈ సమస్య ఉన్నవాల్లు నడక మొదలు పెట్టినప్పటి నుంచీ, పిక్కల్లో, తొడల్లో నొప్పి మొదలవుతుంది. దాంతో నొప్పి తగ్గేవరకూ కొద్దిసేపు నడకను ఆపి, తిరిగి నడవడం మొదలుపెడుతూ ఉంటారు. అలాగే కొందరు కనీసం వంద మీటర్లు కూడా నడవలేకపోతూ ఉంటారు. ఇవి ప్రారంభ లక్షణాలు. తర్వాత రాత్రి నిద్ర పట్టనంత నొప్పి పాదాల్లో వేధిస్తుంది. కాళ్లలో గాయాలు మానకపోవడం లేదా గాంగ్రీన్‌గా మారడం లాంటి సమస్యలు వేధిస్తాయి. ఈ సమస్యలు కాళ్లతో పాటు చేతుల్లో కూడా తలెత్తవచ్చు. అయితే నొప్పి పెరిగిపోతూ, రోజువారీ పనులను సైతం చేసుకోలేని పరిస్థితికి చేరుకున్నప్పుడే రోగులు వైద్యులను కలుస్తూ ఉంటారు. కానీ సమస్యను ప్రారంభంలో గుర్తిస్తే మందులతో, జీవనశైలి మార్పులతో సరిదిద్దే వీలుంటుంది.
ఈ అలవాట్లతో అదుపు చేయవచ్చు...
పిఎడి సమస్యను అదుపులోకి తీసుకురాగలిగే మార్గాలున్నాయి. మరీ ముఖ్యంగా జీవనశైలి మార్పులతో రక్తప్రసరణను మెరుగు పరిచి, లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అలవాట్లను అలవరుచుకోవాలి. కొన్ని దురలవాట్లను మానుకోవాలి.
ధూమపానం మానేయాలి: ధూమపానం పిఎడి ముప్పును పెంచుతుంది. అలాగే సమస్య తీవ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ధూమపానం మానడం వల్ల రక్తనాళాలు మరింత పాడవకుండా ఉండడంతో పాటు, గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారశైలి: పిఎడి నివారణకు గుండె ఆరోగ్యానికి దోహదపడే ఆహారశైలిని అనుసరించాలి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, లీన్ ప్రొటీన్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, సోడియం ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల బరువుతో పాటు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి.
వ్యాయామం: కార్డియో వ్యాస్క్యులర్ హెల్త్ బలపడాలన్నా, రక్తసరఫరా మెరుగు పడాలన్నా క్రమం త్పపక వ్యాయామం చేయాలి. కాబట్టి వైద్యులను కలిసి ఆరోగ్య సమస్యలు, అవసరాలకు తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. నడక, సైక్లింగ్, ఈత, తక్కువ ప్రభావం కలిగి ఉండే ఏరోబిక్ వ్యాయామాలు చేయవచ్చు.
బరువు తగ్గాలి: పిఎడిని అదుపులో ఉంచుకోడానికి శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవడం అవసరం. అధిక బరువు వల్ల రక్తసరఫరా వ్యవస్థ అదనపు ఒత్తిడికి లోనై లక్షణాలు తీవ్రమవుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్: పిఎడి ఉన్నవాళ్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్లు పెరగకుండా అవసరమైన మందులు వాడుకోవాలి. జీవనశైలి మార్పులు చేసుకోవాలి.
మధుమేహం: పిఎడితో పాటు మధుమేహం కూడా ఉంటే, వైద్యుల పర్యవేక్షణలో మధుమేహాన్ని అదుపులో ఉంచే మందులను వాడుకోవాలి. క్రమం తప్పకుండా చక్కెర మోతాదులను సరి చూసుకుంటూ, అందుకు తగిన మందులను వాడుకుంటూ ఉండాలి. అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి.
ఒత్తిడి వద్దు: తీవ్రమైన ఒత్తిడి రక్తనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రాణాయామం, ధ్యానం, యోగా చేయాలి లేదా ఒత్తిడిని తగ్గించి స్వాంతనను అందించే కార్యక్రమాల్లో పాల్గొనాలి.
చికిత్స ఇలా....
వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు, సమస్య తీవ్రత ఆధారంగా వైద్యులు చికిత్సను ఎంచుకుంటారు.
ప్రారంభ దశలో: పిఎడి ప్రారంభ దశలో ధూమపానం మానుకుని, ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలిని అనుసరిస్తూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తే పిఎడి అదుపులోకి వస్తుంది.
మందులు ఉన్నాయి: పిఎడి లక్షణాలను అదుపు చేసి, సమస్య తీవ్రంగా కాకుండా నియంత్రించే మందులున్నాయి. యాంటీప్లేట్‌లెట్ మందులతో రక్తం గడ్డకట్టే సమస్య తొలగిపోయి, గుండెపోటు ముప్పు తప్పుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులతో రక్తనాళాల్లో ప్లేక్ పేరుకోకుండా ఉంటుంది. ఎసిఇ ఇన్హిబిటర్లు, బీటా బ్లాకర్లు, అధిక రక్తపోటును తగ్గించే ఇతర మందులతో హైపర్‌టెన్షన్ అదుపులోకి వచ్చి, రక్తసరఫరా మెరుగుపడుతుంది.
యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్: రక్తనాళాలు బాగా ఇరుకుగా మారినప్పుడు, అవరోధాలు ఎక్కువగా ఉన్నప్పుడు, మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసిజర్ అయిన యాంజియోప్లాస్టీని వైద్యులు ఎంచుకుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా క్యాథెటర్‌ను ఉపయోగించి, బెలూన్ సహాయంతో ఇరుగ్గా మారిన రక్తనాళాన్ని వెడల్పు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్టెంట్‌ను అమర్చి రక్తసరఫరాను పునరుద్ధరించడం జరుగుతుంది.
బైపాస్ సర్జరీ: తీవ్రమైన పిఎడి కేసుల్లో యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్‌తో సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో బైపాస్ సర్జరీ అవసరమవుతుంది. రక్తనాళ గ్రాఫ్ట్ ద్వారా ఇరుకుగా మారిన లేదా పూడుకుపోయిన నాళం చుట్టూ బైపా్‌సను సృష్టిస్తారు. దాంతో సమస్య తొలగిపోయి, అవయవానికి రక్తసరఫరా మెరుగు పడుతుంది.
గాయం పట్ల జాగ్రత్తలు: పిఎడి కారణంగా పుండ్లు ఏర్పడినవాళ్లు ఇన్‌ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, హైపర్‌బేరిక్ ఆక్సిజన్‌థెరపీ, బయోఇంజనీర్‌డ్ స్కిన్ సబ్‌స్టిట్యూట్స్ అవసరమవుతాయి.
ఎవరిలో ఎక్కువ?
50 ఏళ్లు పైబడిన వాళ్లు, ధూమపానం చేసేవాళ్లు, పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్లు, చక్కెర అదుపు తప్పిన వాళ్లు, అధిక బరువు ఉన్న వాళ్లు, ఎక్కువ సమయాల పాటు కూర్చుని పని చేసేవాళ్లు
-డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు,
సీనియర్ వ్యాస్క్యులర్ అండ్ ఎండో వ్యాస్క్యులర్ సర్జన్;
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ,హైదరాబాద్.