Smoking: ధూమపానాన్ని మానకపోతే మాత్రం..!
ABN , First Publish Date - 2023-05-30T12:31:21+05:30 IST
లంగ్ కేన్సర్‌కు ధూమపానమే కారణమనే విషయం అందరికీ తెలిసిందే! అయినా ఈ అలవాటు నుంచి బయటపడలేని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే
లంగ్ కేన్సర్‌కు ధూమపానమే కారణమనే విషయం అందరికీ తెలిసిందే! అయినా ఈ అలవాటు నుంచి బయటపడలేని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆరోగ్యాన్ని అస్తవ్యస్థం చేసే ధూమపానాన్ని ధూరం పెట్టగలిగే చిట్కాలు, చికిత్సలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం!
ధూమపానం ద్వారా 5 వేల రకాల ప్రమాదకర రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తులతతో పాటు మన శరీరం మొత్తంలోకీ ప్రవేశిస్తూ ఉంటాయి. అలాగే ఈ రసాయనాలు మన కణాల్లోని డిఎన్‌ఎను నాశనం చేస్తాయి. పైగా కణాలు వాటంతట అవి తమలో నాశనమైన డిఎన్‌ఎను మరమ్మత్తు చేసుకోవడంలో, ఈ రసాయనాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇలా కణాల్లో డిఎన్‌ఎ డ్యామేజీ నిరంతరంగా కొనసాగుతూ ఉండడం మూలంగా, కణాలు కేన్సర్‌కు గురవుతాయి.
ఫిల్టర్ సిగరెట్లు సురక్షితమేనా?
నాన్ ఫిల్టర్ సిగరెట్లతో పోల్చుకుంటే, ఫిల్టర్‌తో కూడిన సిగరెట్లు ఏమాత్రం సురక్షితం కాదు. నిజానికి ఫిల్టర్ సిగరెట్లు ప్రమాదకరమైన రసాయనాలను అడ్డుకోకపోవడమే కాకుండా, నాన్ ఫిల్టర్ సిగరెట్ల కంటే మరింత ప్రమాదకరంగా మారతాయి. సిగరెట్‌లోని ఫిల్టర్ వేలకొద్దీ సన్నని ఫైబర్లతో తయారవుతుంది. పొగ పీల్చేటప్పుడు ఈ ఫైబర్లు నోటి నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుకునే ప్రమాదం ఉంటుంది. ఫిల్టర్లు కేవలం పెద్ద టార్ పార్టికల్స్‌ను మాత్రమే అడ్డుకోగలుగుతాయి. అంతే తప్ప ఊపిరితిత్తుల్లోకి చేరుకునే చిన్న పార్టికల్స్‌ను అడ్డుకోలేవు.
ప్యాసివ్ స్మోకింగ్
ధూమ పానం అలవాటు లేకపోయినా, ఇతరులు వదిలే పొగను పీల్చేవాళ్లకు (సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) కొరొనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, లంగ్ కేన్సర్‌లతో పాటు మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు, తక్కువ బరువుతో పిల్లలను కనడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
విత్‌డ్రాయల్ లక్షణాలు
సిగరెట్లు మానేసిన తర్వాత, విత్‌డ్రాయల్ లక్షణాలను తట్టుకోలేక తిరిగి స్మోకింగ్ మొదలు పెట్టే వాళ్లు ఎక్కువ. కానీ ఈ లక్షణాను కొన్ని చిట్కాలతో అధిగమించవచ్చు. అవేంటంటే...
● నికొటిన్ రీప్లేస్‌మెంట్ ఉత్పత్తులను ప్రయత్నించాలి.
● సిగరెట్ తాగాలనే కోరిక తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి.
● పొగాకు ఉత్పత్తుల వాడకంతో ముడిపడి ఉండే పనులను మానుకోవాలి.
● సిగరెట్లు తాగడానికి బదులుగా, క్యారెట్లు తినడం, పచ్చళ్లు, యాపిల్స్, షుగర్‌లెస్ గమ్, చాక్లెట్లు లాంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా నోటిని బిజీగా ఉంచుకోగలిగితే సిగరెట్ తాగాలనే కోరిక తగ్గుతుంది.
ఈ అలవాటు శాశ్వతంగా మానేయవచ్చా?
తప్పకుండా మానేయవచ్చు. ధూమపానం అలవాటు మానుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదు. నికొటిన్ లేకుండా జీవించగలిగేలా మెదడు అలవాటు పడాలి. స్మోకింగ్‌తో సంబంధం లేని పనులను కల్పించుకోవాలి.
చికిత్స ఉంది
● బ్యుప్రోపియాన్: ఈ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ ధూమపానం అలవాటు మానుకోవడానికి కూడా ఉపయోగపడుతోంది. ఈ మందును వైద్యులు సూచిస్తారు.
● వెరెనిక్లైన్: నికొటిన్ క్రేవింగ్‌ను తగ్గించడంతో పాటు, స్మోకింగ్‌తో పొందే సంతృప్తి ప్రభావాన్ని అడ్డుకుంటుంది.
స్మోకింగ్‌తో ఇతర సమస్యలు
● కేన్సర్‌తో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం, ఆస్తమా, సిఒపిడి సమస్యలు వేధిస్తాయి.
● మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఫెర్టిలిటీ సమస్యలు, ప్రిమెచ్యూర్ బర్త్, లేదా తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
● అంధత్వం, క్యాటరాక్ట్, వయసుతో కూడిన మస్క్యులర్ డీజనరేషన్ సమస్యలు తలెత్తుతాయి.
● లంగ్ కేన్సర్‌తో పాటు పెద్ద పేగు కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్, కాలేయ కేన్సర్, పొట్ట కేన్సర్, ఈసోఫీగల్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, మూత్రాశయ కేన్సర్, లుకేమియా లాంటి కేన్సర్లు కూడా బాధిస్తాయి.
-డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ
డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్, రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్.