Immunity: ఇమ్యూనిటీ కోసం ఇలా చేయండి!

ABN , First Publish Date - 2023-08-09T11:45:52+05:30 IST

ఏ సీజన్‌లో అయినా మనిషికి కావాల్సింది ఇమ్యూనిటీ. ముఖ్యంగా వాతావరణం పొడిగా లేని ఈ రోజుల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి శరీర నిరోధకశక్తి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే...

Immunity: ఇమ్యూనిటీ కోసం ఇలా చేయండి!

ఏ సీజన్‌లో అయినా మనిషికి కావాల్సింది ఇమ్యూనిటీ. ముఖ్యంగా వాతావరణం పొడిగా లేని ఈ రోజుల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి శరీర నిరోధకశక్తి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే...

  • వాతావరణం తడిగా ఉండే ఈ రోజుల్లో చర్మ, కంటి ఇన్‌ఫెక్షన్లు, ఇతర ఫ్లూలు వస్తుంటాయి. అయితే ఇలాంటి వైరల్‌, బ్యాక్టీరియా, శిలీంధ్రాల ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా శరీరం స్ర్టాంగ్‌గా తయారవ్వాలంటే పోషకాహారం తీసుకోవాలి. పొట్టలోకి వేసిన ప్రతి ఆహారపదార్థం అద్భుతమని అనుకోవద్దు. రుచి బాగున్నంత మాత్రాన మంచి ఆహారమని మాత్రం భ్రమపడొద్దు.

  • విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ బి6, బి12 లాంటివి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తాజా ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవటంతో పాటు శరీరానికి కావాలసిన ప్రొటీన్‌ ఫుడ్‌ తింటేనే శరీరంలో ఎనర్జీ వస్తుంది. తద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంటే మనం తినే ఆహారమే... మన శరీరానికి అసలైన ఇమ్యూనిటీ బూస్టర్‌ అనమాట!

  • ప్రొటీన్లు, విటమిన్స్‌తో పాటు మినరల్స్‌ శరీరానికి అవసరమే. చేపలు, నట్స్‌, కోడిగుడ్లు, పాలు, చికెన్‌, తాజా పండ్లు తినడం వల్ల కాల్షియం, పాస్ఫరస్‌, సెలీనియం, జింక్‌, ఐరన్‌ లాంటి మినరల్స్‌ లభ్యమవుతాయి. వీటి వల్ల కణాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు, ఎముకల్లో దృఢత్వం కలుగుతుంది. మొత్తానికి మినరల్స్‌ వల్ల శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.

  • ఎన్ని మాటలు చెప్పినా కంటికి నిద్ర అవసరం. గాఢమైన నిద్ర ఎంతో హాయిని ఇస్తుంది. అలాగని పది గంటల పాటు నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఆరేడు గంటల్లో ఉండే డీప్‌స్లీప్‌ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకు తెలియకుండా వ్యాధినిరోధక శక్తి పెంచటానికి నిద్ర ఉపయోగపడుతుంది.

  • ఆహారం ఎంత తిన్నా.. నీళ్లు కచ్చితంగా తాగాలి. కొందరు రోజుకు ఆరు గ్లాసులు తాగాలి.. మూడు లీటర్లు తాగాలి అని చెబుతుంటారు. అలా కాకుండా దప్పిక అయినపుడు కావాల్సినన్ని మంచి నీళ్లు తాగటమే.. మంచి ఆరోగ్యానికి

  • అసలైన టెక్నిక్‌. శరీరంలో మంచి నీళ్లు ఉంటేనే లోపలకు తీసుకున్న ఆహారానికి అదనపు శక్తి వస్తుందనే విషయం మర్చిపోకూడదు.

  • కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడగాలి. వాటిమీద ఉండే రసాయన పదార్థాలు పోగొట్టాలి. ఇకపోతే శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

  • ఇవన్నీ పాటించి కేవలం ఇంట్లో కూర్చుని ఉంటే సరిపోదు. కచ్చితంగా వ్యాయామం చేయాలి. రన్నింగ్‌, గేమ్స్‌ ఆడటం, వర్కవుట్స్‌.. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు శరీరం మీద దృష్టి ఉంచాలి. ఇవేమి చేయలేకపోతే కనీసం నడవాలి. లేదా ఇంట్లోనే యోగా చేయాలి. దీని వల్ల శారీరకబలం కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ఉల్లాసం లభిస్తుంది. బాగా నిద్రపడుతుంది. ఒంట్లో ఒత్తిడి తగ్గిపోతుంది. వీటివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Updated Date - 2023-08-09T11:45:52+05:30 IST