Summer: ఇలా ప్లాన్ చేసుకుంటే వేసవిని సైతం హాయిగా..!

ABN , First Publish Date - 2023-02-28T11:26:16+05:30 IST

ఎండ (Summer)లోకి వెళ్లాలంటే చర్మం నలుపెక్కుతుందనే భయం మనందర్నీ వేధిస్తుంది. నిజమే! అలాగని ఇంటిపట్టునే ఉండిపోలేం కదా! కాబట్టి అవసరమైన చర్మ (skin) సంరక్షణను అనుసరిస్తే, వేసవిని

Summer: ఇలా ప్లాన్ చేసుకుంటే వేసవిని సైతం హాయిగా..!
వేసవిని సైతం హాయిగా..!

ఎండ (Summer)లోకి వెళ్లాలంటే చర్మం నలుపెక్కుతుందనే భయం మనందర్నీ వేధిస్తుంది. నిజమే! అలాగని ఇంటిపట్టునే ఉండిపోలేం కదా! కాబట్టి అవసరమైన చర్మ (skin) సంరక్షణను అనుసరిస్తే, వేసవిని సైతం హాయిగా ఆస్వాదించవచ్చు.

వేసవిలో గొడుగులు, స్కార్ఫ్‌లు వాడి ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాం. కానీ వేసవిలో ఇంతకుమించిన జాగ్రత్తలు పాటించినప్పుడే వేసవి వెతల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చర్మ తత్వానికి తగ్గట్టు, వాతావరణంలో తేమకు తగ్గట్టు సన్‌స్ర్కీన్‌ (Sunscreen), మాయిశ్చరైజర్లు ఈ కాలంలో తప్పనిసరిగా వాడుకోవాలి.

2.jpg

చర్మ తత్వాన్ని బట్టి...

వేసవిలోకి అడుగు పెట్టాం కాబట్టి చర్మాన్ని పొడిబార్చే లెమన్‌ బేస్‌డ్‌, ఘాటైన సువాసనలు కలిగి ఉండే బాడీ వాష్‌లు, సబ్బులు వాడకూడదు. ఉదయం వేళల్లో కూడా చర్మం పొడిబారినట్టు అనిపిస్తే, మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుని, దాని పైన సన్‌స్ర్కీన్‌ వాడుకోవాలి. ఎండలు పెరిగేకొద్దీ మాయిశ్చరైజర్‌ వాడకం తగ్గించి సన్‌స్ర్కీన్‌ ఒక్కటీ అప్లై చేసుకోవడం మొదలుపెట్టాలి. యాంటీ ఏజింగ్‌ క్రీమ్స్‌, మొటిమలు తగ్గడం కోసం పింపుల్‌ క్రీమ్స్‌ వాడేవాళ్లు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. ఈ కోవకు చెందినవాళ్లు క్రీమ్స్‌ వాడే సమయాన్ని తగ్గించుకోవాలి. వీటిని ముఖానికి పూసుకునే ముందు పైపూతగా మొదట మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. కొలెస్ట్రాల్‌ తగ్గించే మాత్రలు వాడేవారి చర్మం తేలికగా పొడిబారుతుంది. కాబట్టి వీరికి అదనపు మాయిశ్చరైజర్లు అవసరం. అలాగే అలర్జీతో కూడిన అటోపిక్‌ డెర్మటైటిస్‌ ఉన్నవారు కూడా వైద్యులు సూచించే మాయిశ్చరైజర్లనే ఈ కాలంలో వాడుకోవాలి.

3.jpg

సన్‌స్ర్కీన్స్‌ వాడకం ఇలా....

20 ఏళ్ల మొదలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సన్‌స్ర్కీన్స్‌ వాడాలి. ఈ వయసు వాళ్లు 30 నుంచి 50 ఎస్‌పిఎఫ్‌ కలిగిన సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవాలి. పిగ్మెంటేషన్‌ సమస్య కలిగినవాళ్లు ఫౌండేషన్‌ బేస్‌డ్‌ సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవాలి. విపరీతమైన పొడిచర్మం కలిగినవాళ్లు మాయిశ్చరైజర్‌ కలిసిన సన్‌స్ర్కీన్‌ ఎంచుకోవాలి. జిడ్డు చర్మం కలిగినవాళ్లు జెల్‌ బేస్‌డ్‌ లేదా మ్యాట్‌ ఫిని్‌షడ్‌ సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవచ్చు. అలాగే ఎండలోకి వెళ్లే పావు గంట ముందు సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి. రోజు పొడవునా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సన్‌స్ర్కీన్‌ అప్లై చేస్తూనే ఉండాలి. అప్పుడే సన్‌ట్యాన్‌ నుంచి రక్షణ దక్కుతుంది. లిక్విడ్‌ బేస్‌డ్‌ సన్‌స్ర్కీన్‌ అయితే ఒక టీస్పూన్‌ పరిమాణంలో ముఖం మొత్తం పరుచుకునేలా అప్లై చేసుకోవాలి. క్రీమ్‌ బేస్‌డ్‌ అయితే బొటనవేలి మీద సరిపడేటంత వాడుకోవాలి.

పిల్లలకూ సన్‌స్ర్కీన్స్‌

ఈ కాలంలో పిల్లలు ఆరుబయట ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఎండ ప్రభావానికి గురవకుండా కెమికల్‌ కాంపొనెంట్లకు బదులుగా ఫిజికల్‌ కాంపొనెంట్లతో తయారైన ప్రత్యేకమైన సన్‌స్ర్కీన్స్‌ పిల్లల కోసం తయారవుతున్నాయి. వీటిని పిల్లలకు వాడాలి. ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఈ సన్‌స్ర్కీన్స్‌ను పిల్లల ముఖం, మెడ, చేతులు... ఇలా ఎండ సోకే ప్రదేశాల్లో అప్లై చేయాలి.

స్కిన్‌ ఫుడ్‌ తినాలి

చర్మం నుంచి ఆవిరయ్యే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయగలిగితేనే చర్మం మృదువుగా, తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెరిగే వేడి వాతావరణానికి తగ్గట్టు చర్మాన్ని ఆహారంతో సిద్ధం చేయాలి. ఇందుకోసం పగటివేళ నీరు ఎక్కువగా ఉండే పుచ్చ, బత్తాయి, తర్బూజా లాంటి పళ్లు తినాలి. రాత్రివేళ ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ లాంటి కూరగాయలు ఎక్కువగా తినాలి. క్యారెట్‌ ప్రతి రోజూ వంటల్లో లేదా జ్యూస్‌ రూపంలో తీసుకుంటూ ఉండాలి. చర్మానికి సరిపడా పోషకాలు అందడం కోసం మొలకలు తింటూ ఉండాలి. దానిమ్మ, పైనాపిల్‌ రసాలు చర్మానికి మేలు చేస్తాయి. అయితే ఇతర పళ్ల రసాలు కూడా తాగవచ్చు. అయితే తాజాగా తయారుచేసిన పళ్లరసాలతో ప్రయోజనం ఉంటుంది.

చక్కెరతో చర్మానికి చేటు

చక్కెరతో శరీరంలో అడ్వాన్స్‌డ్‌ గ్లైకొలేషన్‌ ప్రొడక్ట్స్‌ తయారవుతాయి. వీటి ప్రభావంతో చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ తేలికగా విరిగిపోయి, చర్మం మీద ముడతలు త్వరగా, తేలికగా ఏర్పడతాయి. దాంతో చిన్న వయసు నుంచే చర్మపు ఏజింగ్‌ ప్రక్రియ పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే చక్కెరతో తయారైన పదార్థాలు, శీతల పానీయాలను వీలైనంత పరిమితంగా తీసుకోవాలి. చక్కెర రహస్యంగా దాగి ఉండే ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌లకూ దూరంగా ఉండాలి. సహజసిద్ధ తేనె, బెల్లం, ఆర్టిఫిషియల్‌ షుగర్స్‌తో కూడా అంతే సమానమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా పరిమితంగానే తీసుకోవాలి.

గ్లిజరిన్, సెరమైడ్, ఆలొవేరా, హైడ్రోలిక్ యాసిడ్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కలిగి ఉండే సన్‌స్కీన్స్, మాయశ్చరైజర్లు ఈకాలంలో ఉత్తమమైనవి.

4.jpg

మేకప్‌ ఇలా...

హైల్యురోనిక్‌ యాసిడ్‌ బేస్‌డ్‌, సెరమైడ్‌ బేస్‌డ్‌ సీరమ్స్‌, క్రీమ్స్‌ ముఖ చర్మం మీద అప్లై చేసిన తర్వాత మాత్రమే సౌందర్య సాధనాలు వాడుకోవాలి. ఇలా చేయడం ద్వారా మేకప్‌ ప్రొడక్ట్స్‌తో చర్మానికి హాని కలగకుండా చూసుకోవచ్చు. అలాగే పగలంతా మేక్‌పతో గడిపేవారు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేక్‌పను తొలగించుకున్న తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. మేకప్‌ తొలగించడానికి మన్నికైన క్లీన్సింగ్‌ మిల్క్‌ ఎంచుకోవాలి. ఐ మేకప్‌ తొలగించడానికి అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన క్రీమ్స్‌ ఉపయోగించాలి. మేకప్‌ ఆనవాళ్లు ముఖ చర్మం మీద మిగిలిపోతే మొటిమలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. సెరమైడ్‌, ఆలొవేరా, హైడ్రోలిక్‌ యాసిడ్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌ కలిగిఉండే సన్‌స్కీన్స్‌, మాయిశ్చరైజర్లు ఈ కాలంలో ఉత్తమమైనవి.

5.jpg

సమ్మర్‌ ప్యాక్స్‌

వేసవిలో చర్మానికి అదనపు చికిత్సలు అవసరమవుతాయి. అలాగని వాటి కోసం బ్యూటీపార్లర్లకు వెళ్ల వలసిన అవసరం లేదు. ఇంట్లోనే సురక్షితమైన, ప్రయోజనకరమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారు చేసుకుని వాడుకోవచ్చు.

ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌:

రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టిలో కొన్ని టీ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి, ముఖానికీ, మెడకూ అప్లై చేసుకుని, 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌తో ముఖం మీది జిడ్డు, మురికీ వదులుతాయి.

బేసన్‌, పసుపు, దోస రసం:

ఒక టీస్పూను సెనగపిండికి, చిటికెడు పసుపు కలుపుకోవాలి. కీర దోసను కోరుకుని, రసం పిండుకోవాలి. ఈ మూడింటిని మెత్తని ముద్దగా కలిపి, ముఖం, మెడ మీద పూసుకుని, 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌తో సన్‌ట్యాన్‌ వదులుతుంది.

బియ్యం పిండి, పెరుగు:

రెండు టీస్పూన్ల బియ్యం పిండికి, ఒక టీస్పూను పెరుగు జోడించాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 తర్వాత కడిగేసుకోవాలి. ఒకవేళ మృతకణాలను వదిలించాలి అనుకుంటే, కొద్దిగా నీళ్లు చల్లి వేళ్లతో వలయాకారంలో రుద్దుకుని కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌తో చర్మం కాంతివంతంగా మారుతుంది.

పసుపు, తేనె:

రెండు టీస్పూన్ల పసుపుకు, ఒక టీస్పూను తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మృదువైన తాజా చర్మం సొంతమవుతుంది.

గంధం పొడి, పాలు:

రెండు టీస్పూన్ల గంధం పొడికి, రెండు టీస్పూన్ల పాలను చేర్చి, ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

Updated Date - 2023-02-28T11:26:16+05:30 IST