Stress: ఒత్తిడిని జయించే మార్గాలు ఇవే..!
ABN , First Publish Date - 2023-06-06T13:00:52+05:30 IST
ఒత్తిడిని జయించడం అసాధ్యమేమీ కాదు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఒత్తిడిని అదుపులో ఉంచుకునే మార్గాలు అనేకం
ఒత్తిడిని జయించడం అసాధ్యమేమీ కాదు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఒత్తిడిని అదుపులో ఉంచుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. అవేంటంటే....
టైమ్ మేనేజ్‌మెంట్: ప్రాధామ్యాలను క్రమానుగుణంగా ఏర్పరుచుకోవడంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఏ పని ముందు చేయాలి? ఏ పనిని వాయిదా వేయవచ్చు? ఏ పని ముఖ్యం? అనే విశ్లేషణ కొరవడి, కంగారు పడిపోతూ ఉంటాం. ఈ కంగారులో ప్రాముఖ్యత లేని పనుల కోసం సమయం వృథా చేస్తాం. ఫలితంగా ముఖ్యమైన పనులకు సమయం కేటాయించలేక ఒత్తిడకి లోనవుతాం. ఇలా అనవసర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే పనులను ప్రాఽధాన్యతాక్రమంలో పూర్తి చేసే అలవాటు అలవరుచుకోవాలి.
ధ్యానం: మానసిక ప్రశాంతతతో ఒత్తిడిని జయించవచ్చు. ఇందుకోసం ధ్యానం, బ్రీదింగ్ ఎక్సర్‌సైజులు చేయవచ్చు. ఒత్తిడి వల్ల మనం ఊపిరి తీసుకునే తీరు మారుతుంది. త్వరత్వరంగా ఊపిరి పీల్చడం, వదలడం చేస్తాం. గాలిని కూడా శక్తి మేరకు లోపలికి పీల్చం. ఫలితంగా సరిపడా ఆక్సిజన్ రక్తంలో కలవదు. దాంతో మెదడు పనితీరు తగ్గుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఊపిరి మీద దృష్టి పెట్టాలి. రోజులో వీలైనన్నిసార్లు గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉండాలి. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు కొన్ని క్షణాలు బిగించి ఉంచి, వదలడం సాధన చేయాలి.
చిన్న చిన్న ఆనందాలు: అదే పనిగా గంటల తరబడి పనిలో మునిగి తేలడం సరి కాదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలపాటు బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్‌లో నచ్చిన వ్యక్తులతో కలిసి ఆహ్లాదంగా నవ్వుకోవాలి. నవ్వు తెప్పించే పుస్తకం తిరగేయాలి. అవేవీ వీలు కాకపోతే కొన్ని నిమిషాలు నడవాలి.
సంగీతం వినాలి: ఒత్తిడిని తొలగించే సాధనాల్లో సంగీతం ఒకటి. కాబట్టి నచ్చిన పాటలతో ప్లే లిస్ట్ తయారు చేసుకుని తీరిక వేళల్లో వినాలి. ఉదయం ఆఫీసుకు రెడీ అయ్యే సమయంలో, భోజనం చేస్తున్నప్పుడు, కుటుంబంతో గడిపేటప్పుడు ఈ పాటలు ప్లే చేసుకోవాలి. ఇలా ఆహ్లాదం కలిగించే పాటలు వినడం వల్ల మనసు తేలిక అవుతుంది. ఫలితంగా ఒత్తిడి వదులుతుంది.