Period: న్యాప్కిన్లతో ఆ పరిస్థితి ఎదురవుతుందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

ABN , First Publish Date - 2023-06-17T13:57:16+05:30 IST

న్యాప్కిన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల వల్లే ఈ సమస్యలకు కారణం. అలాంటప్పుడు టాంపూన్లు లేదా న్యాప్కిన్లు వాడే సమయంలో

Period: న్యాప్కిన్లతో ఆ పరిస్థితి ఎదురవుతుందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

సున్నితమైన చర్మం కలిగిన వాళ్లకు నెలసరి సమయంలో న్యాప్కిన్ల వాడకం వల్ల అసౌకర్యం కలగడంతో పాటు, చర్మం కందిపోవడం, దురద లాంటి ఇబ్బందులు కూడా వేధిస్తాయి. న్యాప్కిన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల వల్లే ఈ సమస్యలకు కారణం. అలాంటప్పుడు టాంపూన్లు లేదా న్యాప్కిన్లు వాడే సమయంలో ఇవిగో ఈ జాగ్రత్తలు పాటించాలి.

మంచి ప్యాడ్‌:

మహిళలది ఉరుకుల పరుగుల జీవితమే! ఇంటి పనులు, వంట పనులు చక్కబెట్టి, ఉద్యోనికి పరుగులు పెట్టే క్రమంలో ప్యాడ్స్‌ చర్మానికి ఒరుసుకుపోతూ ఉంటాయి. దాంతో ప్యాడ్‌ ర్యాష్‌ మొదలవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మృదువుగా, తేలికగా ఉండే మన్నికైన ప్యాడ్స్‌ను ఎంచుకోవాలి.

మారుస్తూ ఉండాలి:

దీర్ఘ సమయాల పాటు ఒకే ప్యాడ్‌ను వాడడం మంచి అలవాటు కాదు. ఉద్యోగినులు, విద్యార్థినులు ఇంటికి వెళ్లే వరకూ ప్యాడ్‌ మార్చుకోకుండా ఉండిపోకూడదు. హ్యాండ్‌ బ్యాగ్స్‌లో అదనపు ప్యాడ్స్‌ను ఉంచుకుని, ప్రతి నాలుగు గంటలకోసారీ మార్చుకుంటూ ఉంటే, ర్యాష్‌లు, ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా ఉంటాయి.

శుభ్రత ముఖ్యం:

గోరు వెచ్చని నీళ్లతో ఆ ప్రదేశాన్ని ప్రతి రోజూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల సూక్ష్మక్రిములతో ర్యాష్‌, ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉండదు. వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తులు, పరిమళాలను ఆ ప్రదేశంలో వాడకపోవడమే మేలు.

పైపూత మందులు:

ర్యాష్‌ల్లో ఎన్నో రకాలుంటాయి. కాబట్టి వైద్యులు సూచించిన పైపూత మందులనే వాడుకోవాలి. శానిటరీ ప్యాడ్స్‌తో తలెత్తే ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌కు యాంటీ ఫంగల్‌ క్రీమ్‌నూ, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌కు యాంటీసెప్టిక్‌ క్రీమ్‌నూ వాడుకోవాలి.

పౌడర్‌:

క్యాండిడ్‌ లాంటి పౌడర్లను ఆ ప్రదేశం శుభ్రం చేసుకుని, పొడిగా తుడుచుకున్న తర్వాత, ప్యాంటీ ధరించే సమయంలో వాడుకోవాలి.

ఇవి కూడదు:

సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన లోదుస్తులు ధరించడం తగ్గించాలి. బిగుతైన దుస్తుల వాడకం కూడా తగ్గించాలి. ప్యాడ్‌కు బదులుగా ట్యాంపూన్‌, మెన్‌సు్ట్రవల్‌ కప్‌ లేదా సేంద్రీయ ప్యాడ్‌లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలి.

Updated Date - 2023-06-17T13:57:16+05:30 IST