Yoga: ఛాతీలో మంట వేధిస్తుందా? అయితే ఇలా చేయండి!
ABN , First Publish Date - 2023-10-10T16:51:18+05:30 IST
ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి. అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు ఉన్నాయి. అవేంటంటే....
ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి. అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు ఉన్నాయి. అవేంటంటే....
మార్జారియాసనం
వెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపించే ఆసనమిది. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణను పెంచి, జీర్ణసంబంధ అవయవాలకు ఈ ఆసనంతో వ్యాయామం దక్కుతుంది. సున్నితమైన మర్దన జరిగి జీర్ణవ్యవస్థ క్రమబద్ధమై, అసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ ఆసనం ఎలా వేయాలంటే.....
చేతులు, మోకాళ్ల మీద బల్ల ఆకారంలో నేల మీద కూర్చోవాలి.
ఈ భంగిమలో మోకాళ్లు అరడుగు దూరంలో, చేతులు నిటారుగా నేల మీద ఆనించి ఉంచాలి.
ఊపిరి పీల్చుతూ, తలను నెమ్మదిగా పైకి లేపి వెనక్కి వాల్చాలి.
ఇలా చేస్తూ వీపును పైకి లేపి విల్లు ఆకారంలో వంగాలి.
ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, నెమ్మదిగా వెన్ను వంచుతూ, ఊపిరి వదులుతూ పూర్వ స్థితికి రావాలి.
అధోముఖశవాసనం
ఆ ఆసనంలో శరీర బరువు చేతులు, కాళ్లపై పడుతుంది. ఈ ఆసనంతో పొత్తికడుపులోకి ప్రాణవాయువు వెళ్లి అసిడిటీ అదుపులోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం కూడా సులువే! దీన్ని ఎలా వేయాలంటే....
చేతులు, కాళ్ల ఆసరాతో శరీరాన్ని బల్ల ఆకారంలో వంచాలి.
ఊపిరి వదులుతూ నడుమును పైకి లేపి, చేతులు, కాళ్లు నిటారుగా ఉంచాలి.
చేతులు, భుజాలకు, కాళ్లు, తుంటికి సమాంతరంగా ఉండాలి. కాలి బొటనవేళ్లు ముందుకు ఉండాలి.
ఇప్పుడు చేతులు నేల మీద బలంగా తాకిస్తూ, తలను వంచాలి. ఈ భంగిమలో చెవులు చేతులను తాకాలి.
ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, మోకాళ్లను వంచి, శరీరాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలి.
బాలాసనం
ఈ ఆసనం శరీరానికి స్వాంతన కలిగించి, జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని అందిస్తుంది. ఫలితంగా అసిడిటీ తగ్గుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు జీర్ణసంబంధ అవయవాలకు మర్దన జరిగి, బలపడతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....
మెకాళ్ల మీద, రెండు పాదాల బొటనవేళ్లు ఒకదానికొకటి తగిలేలా కాళ్లను వెనక్కి వాల్చి కూర్చోవాలి.
నడుము పైభాగాన్ని ముందుకు వంచి, పడుకోవాలి.
చేతులు రెండూ ముందుకు చాపి, మోకాళ్లకు సమాంతరంగా నేల మీద ఆనించాలి.
భుజాలు రెండూ కిందకు వాల్చాలి.
ఈ భంగిమలో 30 సెకన్లపాటు ఉండి, నెమ్మదిగా పైకి లేవాలి.