Greece : వలసదారులతో క్రిక్కిరిసిన పడవ.. గ్రీస్ సముద్రంలో మునక.. 79 మంది మృతి, వందలాది మంది గల్లంతు..
ABN , First Publish Date - 2023-06-15T10:54:02+05:30 IST
గ్రీస్ సముద్రంలో బుధవారం దారుణం జరిగింది. పొట్ట చేత పట్టుకుని యూరోప్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మెడిటెర్రేనియన్ సముద్రంలో బోల్తాపడింది. దీంతో 79 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది సముద్రంలో గల్లంతయ్యారు. కోస్ట్‌గార్డ్, నావికా దళం, మర్చంట్ నౌకలు, విమానాల ద్వారా సహాయక, గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
కలమట (గ్రీస్) : గ్రీస్ సముద్రంలో బుధవారం దారుణం జరిగింది. పొట్ట చేత పట్టుకుని యూరోప్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మెడిటెర్రేనియన్ సముద్రంలో బోల్తాపడింది. దీంతో 79 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది సముద్రంలో గల్లంతయ్యారు. కోస్ట్‌గార్డ్, నావికా దళం, మర్చంట్ నౌకలు, విమానాల ద్వారా సహాయక, గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
నీలం రంగులో ఉన్న పడవలో కనీసం ఓ అంగుళం అయినా ఖాళీ లేకుండా ప్రయాణికులు ఉన్నట్లు గగనతలం నుంచి తీసిన ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఫొటోను గ్రీక్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. ఈ ప్రమాదంలో మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా గ్రీస్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి ఐయన్నిస్ సర్మస్ ప్రకటించారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు.
కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి నికోస్ అలెక్సియో మాట్లాడుతూ, ఈ పడవలో ప్రయాణికుల సంఖ్యను స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదన్నారు. ప్రయాణికులు ఓ వైపునకు అకస్మాత్తుగా చేరుకోవడం వల్ల ఈ పడవ మునిగిపోయినట్లు తెలుస్తోందన్నారు. ఔటర్ డెక్ ప్రయాణికులతో నిండిపోయిందని, లోపల కూడా ప్రయాణికులు క్రిక్కిరిసిపోయి ఉండవచ్చునని తెలిపారు. కలమట నగర ఉప మేయర్ ఐయన్నిస్ జఫిరోపౌలోస్ మాట్లాడుతూ, ఈ పడవలో 500 మందికిపైగా ప్రయాణించి ఉండవచ్చునని తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 104 మందిని కాపాడారు. 16 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసుగల 25 మందిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. కలమట నౌకాశ్రయం వద్ద 70 మందికి చికిత్స అందిస్తున్నారు. మెడిటెర్రేనియన్ సముద్రంలో 17000 అడుగుల లోతు ఉన్న ప్రాంతంలో ఈ సంఘటన జరిగినందు వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం