Israel: ఇజ్రాయెల్‌లో ఓ హిస్టరీ టీచర్ అరెస్ట్.. కారణం ఏమిటంటే?
ABN , First Publish Date - 2023-11-13T13:30:43+05:30 IST
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో కొనసాగించిన భీకర నరమేధాన్ని సమర్థించిన ఓ హిస్టరీ టీచర్ అరెస్టయ్యాడు. ఓ స్కూల్లో హిస్టరీ, సివిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న సదరు టీచర్.. హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు వత్తాసు పలికాడు. ఇజ్రాయెల్‌పై పోరాటంలో ఎలాంటి చర్యకైనా పాల్పడే హక్కు హమాస్‌కు ఉందని వ్యాఖ్యానించాడు.
టెల్ అవివ్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో కొనసాగించిన భీకర నరమేధాన్ని సమర్థించిన ఓ హిస్టరీ టీచర్ అరెస్టయ్యాడు. ఓ స్కూల్లో హిస్టరీ, సివిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న సదరు టీచర్.. హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు వత్తాసు పలికాడు. ఇజ్రాయెల్‌పై పోరాటంలో ఎలాంటి చర్యకైనా పాల్పడే హక్కు హమాస్‌కు ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తోటి ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్న వాట్సప్ గ్రూపులో నిందిత టీచర్ మెసేజులు పెట్టాడు. ‘‘ పాలస్తీనియన్ మహిళలపై ఇజ్రాయెల్ సైనికులు అత్యాచారాలు చేయడం లేదా?. 1948 నుంచి చేస్తూనే ఉన్నారు కదా. ఈ విషయాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టలేదు. ఆక్రమణకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలస్తీనాకు ఏదైనా చేసే హక్కు ఉంది’’ అని టీచర్ పేర్కొన్నట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ ఒక కథనాన్ని పేర్కొంది. కాగా నిందిత టీచర్‌పై తొలగింపు వేటు పడిందని, ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నందున అతడిపై కేసు నమోదయ్యిందని ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ కథనం పేర్కొంది.
ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, బడిలో పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్ చరిత్రను వక్రీకరిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు వివరించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన సైనికులను హంతకులుగా పేర్కొనడం, శత్రుదేశం చేసే పనులను సమర్థించడం, యుద్ధ సమయంలో శత్రుదేశాలకు వత్తాసు పలుకుతూ మాట్లాడడాన్ని తప్పుబట్టడంపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా నిందిత ఉపాధ్యాయుడు గతంలో కూడా పోలీసులు, సైనికుల పట్ల అనుచితమైన వైఖరిని ప్రదర్శించాడు. ఇజ్రాయెల్ సైనికులు పిల్లల హంతకులని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. ఇక అంతకుముందు ఒకసారి సైనికులు, పోలీసు అధికారులపై దాడులను ప్రోత్సహించేలా మాట్లాడాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా నిందిత టీచర్‌ని నవంబర్ 10న అదుపులోకి తీసుకోగా సోమవారం కోర్టు కస్టడీ విధించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.