Asteroid: గమ్యం లేని భారీ గ్రహశకలం.. భూమి వైపుకు దూసుకొస్తోందన్న నాసా.. కానీ!!
ABN , First Publish Date - 2023-10-03T18:07:28+05:30 IST
అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే.. అవి తమదైన ఒక గమ్యస్థానంలో, పరిమిత వేగంగా ప్రయాణం చేస్తుంటాయి. కానీ.. వీటికి భిన్నంగా ఒక విశాలమైన గ్రహశకలం లక్ష్యం లేకుండా చక్కర్లు కొడుతోందని..
అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే.. అవి తమదైన ఒక గమ్యస్థానంలో, పరిమిత వేగంగా ప్రయాణం చేస్తుంటాయి. కానీ.. వీటికి భిన్నంగా ఒక విశాలమైన గ్రహశకలం లక్ష్యం లేకుండా చక్కర్లు కొడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా డేటా ప్రకారం.. ఓ విమానం పరిమాణంలో ఉన్న ఈ శకలం, గంటకు 30,564 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నాసా పేర్కొంది. బుధవారం నాడు ఇది 4.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమిని దాటుతుందని సైంటిస్టులు వెల్లడించారు. అంటే.. ఇది భూగ్రహానికి సమీపం వచ్చినా, దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. ఇది భూమికి సమీపంలో ఉన్న ‘అపోలో’ అనే గ్రహశకలాల సమూహానికి చెందింది.
ఇదిలావుండగా.. స్థిరమైన మార్గం, గమ్యం లేకుండా అంతరిక్షంలో ప్రయాణించే శకలాలను ‘కాస్మిక్ నోమాడ్’ అని పిలుస్తారు. ఇవి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఖగోళ వస్తువులు, గ్రహాల దగ్గరకు వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల భూగ్రహానికి ఎప్పుడైనా విపత్తు సంభవించే ప్రమాదం ఉందని గ్రహించి.. నాసా వంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ ‘కాస్మిక్ నోమాడ్’లపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా కొన్ని ప్రోగ్సామ్స్‌ని అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలోనే నాసా భూమికి అత్యంత దగ్గరగా వెళ్లే గ్రహశకలాలను జాబితాను సిద్ధం చేసింది. ఆ లిస్ట్‌లో ఒకటైన 2023 ఎస్ఎన్6 అనే గ్రహశకలం.. మన భూగ్రహంవైపు దూసుకొస్తోంది. అయితే.. ఇదేమీ ప్రమాదకరమైన వస్తువు కాదని స్పేస్ ఏజెన్సీస్ సెంటర్ ఫర్ నియన్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ (CNWOS) స్పష్టం చేసింది.
మరోవైపు.. 2022లో భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలాన్ని గుర్తించిన నాసా, దాని దారి మళ్లించేందుకు గాను ఒక ప్రత్యేకమైన మిషన్‌ని ప్రారంభించింది. ఈ మిషన్‌కు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ (డార్ట్) అనే పేరు పెట్టింది. మొదటి దశలో భాగంగా.. 2022 సెప్టెంబర్ 26వ తేదీన నాసా శాస్త్రవేత్తలు పంపించిన అంతరిక్ష నౌక ఆ గ్రహశకలం డైమోర్ఫోస్‌ని ఢీకొంది. క్యూబ్ ఆకారంలో వెండింగ్ మెషీన్ పరిమాణంలో ఉన్న ఈ వ్యోమనౌక.. భూమి నుంచి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుట్‌బాల్ స్టేడియం పరిమాణం గల ఆ గ్రహశకలంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ మిషన్ విజయవంతమై, మన భూగ్రహం క్షేమంగా బయటపడింది.