American Airlines Pilot: ఒక చిన్న బొమ్మ కోసం ఆ పైలట్ ఎంత పని చేశాడో తెలుసా.. 5880 మైళ్లు ప్రయాణం చేసి..
ABN , First Publish Date - 2023-08-29T21:11:29+05:30 IST
మానవత్వం దాదాపు మంటగలిసిపోయిన ప్రపంచం ఇది. స్వార్థం నిండిన ప్రజలు కేవలం తమ స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తారే తప్ప, ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. కళ్ల ముందే కష్టాల్లో మునిగితేలుతున్నా..
మానవత్వం దాదాపు మంటగలిసిపోయిన ప్రపంచం ఇది. స్వార్థం నిండిన ప్రజలు కేవలం తమ స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తారే తప్ప, ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. కళ్ల ముందే కష్టాల్లో మునిగితేలుతున్నా.. చూసి ఆనందిస్తారే తప్ప, ఆపన్నహస్తం అందించరు. సొంత కుటుంబ సభ్యులే రోడ్డున వదిలేసి వెళ్లే రోజులివి. ఇలాంటి రోజుల్లోనూ.. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని కొందరు చాటిచెప్తుంటారు. తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తుంటారు. ఇప్పుడు ఓ పైలట్ కూడా అదే పని చేశాడు. బొమ్మ కోసం ఎంతో బాధపడుతున్న ఓ చిన్నారి కోసం ఏకంగా 5880 మైళ్లు ప్రయాణం చేసి.. అందరి చేత శభాష్ అంటూ ప్రశంసలు పొందుతున్నాడు. పదండి.. ఆ స్టోరీ ఏంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టెక్సాస్‌కు చెందిన రూడీ డొమింగ్యూజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కొన్ని రోజుల క్రితం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఇతనికి వాలెంటీనా అనే తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. ఈ చిన్నారికి బీట్రైస్ అనే బొమ్మ అంటే ఎంతో ఇష్టం. దీంతో.. ఆ బొమ్మని సైతం చిన్నారి తన వెంట పర్యటనకు తీసుకెళ్లింది. అయితే.. పర్యటన ముగించుకున్న తర్వాత ఆ బొమ్మ కనిపించకుండా పోయింది. టెక్సాస్‌కు తిరిగి వచ్చే సమయంలో టోక్యో విమానాశ్రయంలో ఆగినప్పుడు.. అక్కడ బొమ్మను చివరిసారిగా చూసినట్లు తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. దాంతో.. బొమ్మ పోయిందని వాలెంటీనా దిగులు పెట్టుకుంది. ఎన్ని రోజులు గడిచినా.. ఆమె ఆ బొమ్మని మాత్రం మర్చిపోలేదు. కుమార్తె బాధను చూడలేకపోయిన ఆమె తండ్రి.. ఆ బొమ్మ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఎవరైనా వెతికి పెట్టాలని సహాయం కోరాడు.
ఈ పోస్టును అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేమ్స్ డానెన్ అనే పైలట్ చూశాడు. ఇది చూసి చలించిపోయిన అతగాడు.. ఆ చిన్నారికి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత ఆ పైలట్‌లో ఫోన్‌లో వారిని సంప్రదించాడు. బొమ్మ వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఫైనల్‌గా అది ఎక్కడుందో కనిపెట్టి, టోక్యో నుంచి టెక్సాస్‌కు పయనమయ్యాడు. ఆ చిన్నారి ఉంటున్న ఇంటికి చేరుకొని.. ఆ బొమ్మని ఆమెకు అందించాడు. తప్పిపోయిన బొమ్మ తిరిగి ఇంటికి చేరడంతో.. ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమకు ఈ సహాయం చేసినందుకు గాను ఆ చిన్నారి తల్లిదండ్రులు పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహాయం చేయడమంటే ఎంతో ఇష్టమని, ఇది తన స్వభావమని ఆ పైలట్ చెప్పుకొచ్చాడు.