Buzz Aldrin: చంద్రుడిపై నడిచిన వ్యోమగామికి 93వ పుట్టిన రోజున మళ్లీ పెళ్లి

ABN , First Publish Date - 2023-01-21T19:04:12+05:30 IST

చంద్రుడిపై కాలుపెట్టిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించిన అమెరికా వ్యోమగామి బజ్ ఆల్‌డ్రిన్ మరోసారి పెళ్లి చేసుకున్నారు.

Buzz Aldrin: చంద్రుడిపై నడిచిన వ్యోమగామికి 93వ పుట్టిన రోజున మళ్లీ పెళ్లి

ఇంటర్నెట్ డెస్క్: చంద్రుడిపై కాలుపెట్టిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించిన అమెరికా వ్యోమగామి బజ్ ఆల్‌డ్రిన్(Buzz Aldrin) మరో సారి పెళ్లి చేసుకున్నారు. తన 93వ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 20న బజ్ ఆల్‌డ్రిన్ లాస్ ఏంజిలిస్‌లో(Los Angeles) తన చిరకాల ప్రేయసి డా. ఆంకా ఫౌర్‌ను(63) పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తాలూకు చిత్రాలు ఆయన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘టీనేజ్ ప్రేమికుల్లా ఎగ్జైటింగ్‌‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు. బజ్ ఆల్డ్రిన్‌కు ఇది నాలుగో వివాహం. ఆల్డ్రిన్‌కు చెందిన బజ్ ఆల్డ్రిన్‌ వెంచర్స్‌కు డా. ఆంకా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

అమెరికా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర అపోలో 11లో భాగంగా 1969 ఆయన చంద్రుడిపై కాలు పెట్టారు. ప్రముఖ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలిడిన 19 నిమిషాలకు బజ్ ఆల్డ్రిన్ చందమామపై కాలు మోపారు. 1971లో నాసా నుంచి పదవీవిరమణ పొందిన ఆయన 1998లో షేర్ స్పేస్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించే దిశగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక.. చారిత్రిక అపోలో 11 మిషన్‌లో పాలుపంచుకున్న ముగ్గురు వ్యోమగాముల్లో బజ్ ఆల్డ్రిన్ ఒక్కరే జీవించి ఉన్నారు.

Updated Date - 2023-01-21T19:04:14+05:30 IST