China Plan: వరుస పెట్టి శాటిలైట్లు ప్రయోగిస్తున్న చైనా.. అసలు ప్లాన్ ఇదేనా??
ABN , First Publish Date - 2023-04-03T17:01:28+05:30 IST
డ్రాగన్ దేశం చైనా(China) ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోందా? అంతరిక్షంపై గుత్తాధిపత్యం(Monopoly in Space Sector)తోపాటు
డ్రాగన్ దేశం చైనా(China) ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోందా? అంతరిక్షంపై గుత్తాధిపత్యం(Monopoly in Space Sector)తోపాటు.. అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘా(Surveillance)ను ముమ్మరం చేస్తోందా? ప్రపంచ అంతరిక్ష రంగ నిపుణులు(Space Sector Experts), రక్షణ రంగ(Defence Sector) పరిశోధకులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. గడిచిన ఆర్నెల్లుగా చైనా వరుసపెట్టి ప్రయోగిస్తున్న ఉపగ్రహాలే ఇందుకు నిదర్శనమంటున్నారు.
అక్టోబరు నుంచి వేగం పెంచి..
గత ఏడాది అక్టోబరు నుంచి చైనా తన శాటిలైట్ల ప్రయోగాలను వేగవంతం చేసింది. ఈ ఆర్నెల్లలో(మార్చి చివరికల్లా) ఏకంగా 35 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇవన్నీ లో ఆర్బిట్ శాటిలైట్లే..! భూమికి సమీపంలో ఉండే కక్ష్యలోనే తిరుగుతుంటాయి. అంటే.. ఏ దేశంపైనైనా అత్యంత సమీపం నుంచి నిఘాను కొనసాగిస్తున్నట్లే..! ఈ శాటిలైట్లన్నీ హైరిజల్యూషన్ చిత్రాలను చైనాకు చేరవేస్తాయి. ఇలా ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన 400కు పైగా లో ఆర్బిట్ ఉపగ్రహాలు ప్రపంచ దేశాలపై నిఘాను పెట్టాయి.
అగ్ర దేశాల ఆందోళన అదే..!
చైనా లో ఆర్బిట్ ఉపగ్రహాలను వరుసపెట్టి ప్రయోగిస్తుండడం పట్ల అగ్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయ పరిశోధనలు, ఇంటర్నెట్ సేవల కోసమే ఈ ప్రయోగాలని చైనా చెబుతున్నా.. రక్షణ రంగ నిపుణులు మాత్రం, చైనా పరమార్థం వేరే ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుక్కారణం.. 400కు పైగా లో ఆర్భిట్ ఉపగ్రహాల్లో 347 చైనా సైన్యం పరిధిలో ఉన్నాయి. ఉపగ్రహాలపై సైన్యం అజమాయిషీ ఉందంటే.. కచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్నవేనని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారత్, అమెరికా సహా.. పలు దేశాల్లో చైనా నిఘా బెలూన్ల ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు.. యుద్ధాలంటూ వస్తే, ఒకప్పటిలా సైనిక బలం ఉన్నవారిదే విజయం అని చెప్పలేమని, ఇప్పుడు స్పేస్‌పై పట్టున్న దేశాలదే విజయం అని చెబుతున్నారు. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. రష్యా తొలుత ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసి, వాటిని ధ్వంసం చేసిందని వివరిస్తున్నారు. లో ఆర్బిట్ ఉపగ్రహాలు అణు యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని, ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నారు.
2027 కల్లా.. చైనాదే గుత్తాధిపత్యం
చైనా ఇప్పుడు అంతరిక్షంపై గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. అర్ధ దశాబ్దం(2027 కల్లా) 13,500 లో ఆర్బిట్ ఉపగ్రహాల ప్రయోగమే చైనా లక్ష్యంగా గుర్తించినట్లు చెబుతున్నాయి. అదేగనక జరిగితే.. యావత్ భూమండలం చైనా నిఘా పరిధిలోకి వస్తుందని, ఏ దేశాన్నైనా శాసించే స్థితికి చైనా చేరే ప్రమాదముందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా లోఆర్బిట్ శాటిలైట్ల సాయంతో ఉక్రెయిన్ పక్కగా రష్యా సైనికుల జాడను తెలుసుకుని, దాడులు జరుపుతోందని గుర్తుచేశారు. అందుకే.. రష్యా వైపు ఎక్కువగా సైనిక నష్టం ఉందని చెబుతున్నారు.
పెంటగాన్ నివేదికలో ఆందోళన..!
అంతరిక్షరంగంలో అమెరికాను అధిగమించేలా చైనా ప్రణాళికలు చేస్తోందని స్వయంగా పెంటగాన్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. చైనాతో అమెరికా పోటీపడాల్సి వస్తోందని పెంటగాన్‌కు చెందిన ‘స్టేట్ ఆఫ్ ద స్పేస్ ఇండస్ట్రియల్-బేస్ రిపోర్ట్-2022’ స్పష్టం చేసింది. లేకుంటే.. అమెరికా గగనతలానికి ‘చైనా గ్రహణం’ పడుతుందని హెచ్చరికలు చేసింది. 2045కల్లా చైనా అంతరిక్ష రంగాన్ని శాసిస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది.