China Sky Survey: చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమైన చైనా.. రంగంలోకి అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-09-05T21:14:44+05:30 IST

చైనా ఒక శక్తివంతమైన దేశమే కాదు.. భారీ ప్రాజెక్టులు చేపట్టడంలోనూ దిట్ట. ప్రపంచ దేశాలకు భిన్నంగా ఈ చైనా దేశం ముందుకు దూసుకుపోతుంటుంది. తనకు తానే సాటి అన్నట్టు.. కనీవినీ ఎరుగని ప్రయోగాలను...

China Sky Survey: చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమైన చైనా.. రంగంలోకి అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్.. ఎందుకో తెలుసా?

చైనా ఒక శక్తివంతమైన దేశమే కాదు.. భారీ ప్రాజెక్టులు చేపట్టడంలోనూ దిట్ట. ప్రపంచ దేశాలకు భిన్నంగా ఈ చైనా దేశం ముందుకు దూసుకుపోతుంటుంది. తనకు తానే సాటి అన్నట్టు.. కనీవినీ ఎరుగని ప్రయోగాలను చేపడుతూ ఉంటోంది. ఇప్పుడు స్కై సర్వే నిర్వహించేందుకు ఉత్తరార్ధ గోళంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని పేరు ‘వైట్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్’ (WFST). అంతరిక్షంలో చోటు చేసుకునే ఖగోళ సంఘటనల్ని పరిశీలించి, వాటిపై పరిశోధనలు చేయడం కోసం చైనా దీనిని తయారు చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే.. ఈ నెలలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చైనా అధికారిక మీడియా జిన్హువా మంగళవారం నాడు వెల్లడించింది.


ఈ భారీ టెలిస్కోప్‌ను యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని పర్పుల్ మౌంటైన్ అబ్జర్వేటరీ సంయుక్తంగా రూపొందించాయి. దాదాపు 2.5 మీటర్ల వ్యాసంతో దీనిని తయారు చేశారు. ఈ టెలిస్కోప్ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. పాలపుంత వెలుపల ఉన్న సుదూర గెలాక్సీలతోపాటు వివిధ గెలాక్సీ సమూహాలపై పరిశోధనలు సాగించేందుకు వీలు పడుతుందని పర్పుల్‌ మౌంటైన్‌ అబ్జర్వేటరీకి చెందిన చీఫ్‌ ఇంజినీర్‌ లౌ జంగ్ తెలిపారు. అంతేకాదు.. ఖగోళ సంకేతాలను గుర్తించేందుకు సైతం ఈ టెలిస్కోప్‌ని వినియోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్ చీఫ్ డిజైనర్ కాంగ్ జు మాట్లాడుతూ.. ఇది భూ ఉత్తరార్ధ గోళంలోనే శక్తిమంతమైన టెలిస్కోప్‌గా అవతరిస్తుందని, ఇది అందుబాటులోకి వస్తే చైనా భూభాగానికి సమీపంలో ఉన్న ఖగోళ వస్తువులు, ముందస్తు ప్రమాద హెచ్చరికలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు.

ఇదిలావుండగా.. 2019 జులై నుంచి ఈ టెలిస్కోప్ నిర్మాణం లంఘె పట్టణంలో ప్రారంభమైంది. 4000 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతం ఉపరితలం రెడ్ ప్లానెట్‌ని పోలి ఉండటంతో.. దీనికి ‘చైనా మార్స్‌ క్యాంప్‌’ అనే పేరు పెట్టారు. ఈ పట్టణం ‘పీఠభూమి ప్రాంతం’లో ఉండటం వల్ల స్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో పాటు రాత్రి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పరిశోధనలకు చేయడానికి వీలుగా ఉండటం వల్ల.. ఇక్కడే టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్ట్ పెట్టుబడి అక్షరాల 370 మిలియన్ డాలర్లు.

Updated Date - 2023-09-05T21:14:44+05:30 IST