New Zealand PM: జసిందా స్థానంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్
ABN , First Publish Date - 2023-01-21T08:16:52+05:30 IST
న్యూజిలాండ్ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎంపికయ్యారు....
న్యూజిలాండ్ : న్యూజిలాండ్ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎంపికయ్యారు.(New Zealand PM)న్యూజిలాండ్ లేబర్ పార్టీ ఎంపీ, విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్‌కిన్స్(Chris Hipkins)పార్టీ నాయకత్వానికి ఏకైక నామినీగా మారిన తర్వాత న్యూజిలాండ్ తదుపరి ప్రధానమంత్రి కాబోతున్నారు.(Next Prime Minister) క్రిస్ హిప్‌కిన్స్ కొవిడ్-19 మహమ్మారి నిరోధంలో కీలకపాత్ర పోషించారు. లేబర్ పార్టీకి చెందిన 64 మంది సభ్యులు ఆదివారం జరగనున్న సమావేశంలో క్రిస్ హిప్‌కిన్స్ కొత్త నాయకుడిగా ఎంపికవుతారని వార్తసంస్థలు వెల్లడించాయి.
‘‘మేం ఐక్యంగా నిబద్ధతతో న్యూజిలాండ్ ప్రజలకు సేవ చేస్తాం..అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’అని క్రిస్ హిప్‌కిన్స్ చెప్పారు. జసిందా ఆర్డెర్న్ ఐదున్నర సంవత్సరాల పాటు న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2017వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జసిందా కొవిడ్ మహమ్మారిని నిరోధించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
44 ఏళ్ల క్రిస్ హిప్‌కిన్స్ ప్రస్తుతం పోలీసు, విద్య, ప్రజా సేవల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇతను మొదటిసారిగా 2008లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. క్రిస్ హిప్‌కిన్స్ 2020వ సంవత్సరం నవంబర్ నెలలో కొవిడ్-19 నిరోధకశాఖ మంత్రిగా పనిచేశారు.అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున క్రిస్ హిప్‌కిన్స్ ఎంతకాలం పదవిలో ఉంటారు అనేది తెలియాల్సి ఉంది.15 సంవత్సరాలుగా చట్టసభ సభ్యుడిగా ఉన్న హిప్‌కిన్స్ రాజకీయ ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ధి చెందారు.