Share News

USA:హమాస్ దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన అమెరికా ఏజెన్సీ!

ABN , First Publish Date - 2023-10-14T18:00:50+05:30 IST

ఇజ్రాయెల్ పై హమాస్(Hamas) మిలిటెంట్ల దాడులను ముందే పసిగట్టారా? అంటే అవుననే సమాధానమిస్తోంది అమెరికా. అమెరికా(America)కు చెందిన గూఢచార సంస్థ రెండు రిపోర్టులు తయారు చేసింది. వాటి సారాంశం మాత్రం ఒక్కటే.. ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు జరగబోతున్నాయని. ఇందుకు సంబంధించిన వివరాలను అగ్రరాజ్యం తాజాగా బయటపెట్టింది.

USA:హమాస్ దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన అమెరికా ఏజెన్సీ!

జెరూసలెం: ఇజ్రాయెల్ పై హమాస్(Hamas) మిలిటెంట్ల దాడులను ముందే పసిగట్టారా? అంటే అవుననే సమాధానమిస్తోంది అమెరికా. అమెరికా(America)కు చెందిన గూఢచార సంస్థ రెండు రిపోర్టులు తయారు చేసింది. వాటి సారాంశం మాత్రం ఒక్కటే.. ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు జరగబోతున్నాయని. ఇందుకు సంబంధించిన వివరాలను అగ్రరాజ్యం తాజాగా బయటపెట్టింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల భారీ దాడికి కొన్ని వారాల ముందు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) అధికారులకు హమాస్ దాడుల సమాచారం అందింది.


ఇందుకు సంబంధించి రెండు రిపోర్టులు రెడీ చేసిన దర్యాప్తు సంస్థ సెప్టెంబర్ 28న రాకెట్లతో దాడి జరగొచ్చని హెచ్చరించింది. రెండో రిపోర్ట్ లో హమాస్, పాలస్తీనా తీవ్రవాదం గురించి ఉంది. ఇజ్రాయెల్ పై పాలస్తీనా వైమానిక దాడులకు దిగే ముందు రోజే హమాస్ మిలిటెంట్ల కదలికలపై ఆ నివేదిక హెచ్చరించింది. అయితే ఇందులోని వివరాలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కు తెలియదని వైట్ హౌస్ అధికారులు అంటున్నారు. ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్ లు హాట్ స్పాట్ల జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తమ మిత్రదేశంపై దాడి జరగబోతోందని యూఎస్‌కు తెలిసి ఉంటే, ముందే అప్రమత్తం చేసేవారిమని రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. అయితే రిపోర్టులు వచ్చినా ఇజ్రాయెల్ ని అప్రమత్తం చేయడంలో విఫలమయ్యామని భావిస్తున్న అమెరికా పలువురు అధికారులపై గుర్రుగా ఉంది. అదే టైంలో ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel - Palastine) యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్‌ పాలనలో ఉన్న గాజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించి అనేక భవనాలను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం దాడిని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తోంది.


ఈ మేరకు ఉత్తర గాజాలోని దాదాపు 11 లక్షల మంది పాలస్తీనీయులను 24 గంటల్లోగా ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లిపోవాలని శుక్రవారం ఆదేశించింది. హమాస్‌ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయటానికి వీలుగా భూతల యుద్ధానికి దిగటం కోసమే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. అంతమంది ఒక్కసారిగా తరలివెళ్లటం అసాధ్యమని, మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇప్పటికే నెలకొన్న విషాదాన్ని పెను విపత్తుగా మార్చవద్దని, ఆ ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. మరోవైపు, మానసిక యుద్ధంలో భాగంగానే ఇజ్రాయెల్‌ ఇటువంటి హెచ్చరికలకు పాల్పడుతున్నదని, ఎవరూ ఉత్తర గాజాను వదిలివెళ్లవద్దని పౌరులకు హమాస్‌ పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకం మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీసంఖ్యలో వెళ్లిపోతున్నారు.

Updated Date - 2023-10-14T18:00:50+05:30 IST