India vs Canada: భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం సైనిక సంబంధాలపై ప్రభావం చూపదు.. కెనడా ఆర్మీ అధికారి క్లారిటీ

ABN , First Publish Date - 2023-09-26T18:46:08+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఈ దౌత్య వివాదం తమ ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై...

India vs Canada: భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం సైనిక సంబంధాలపై ప్రభావం చూపదు.. కెనడా ఆర్మీ అధికారి క్లారిటీ

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఈ దౌత్య వివాదం తమ ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ దౌత్య వివాదాన్ని రాజకీయ స్థాయిలోనే పరిష్కరించాలని, ఆర్మీతో దానికి సంబంధం లేదని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్ (IPACC)లో ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి 30కి పైగా దేశాల నుంచి సైనిక ప్రతినిధులు హాజరవుతుండగా.. కెనడియన్ ప్రతినిధి బృందానికి స్కాట్ నాయకత్వం వహిస్తున్నారు.


ఈ కాన్ఫరెన్స్‌లో పీటర్ స్కాట్ మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసినంత వరకు ఈ సమయంలో దౌత్య వివాదం అనేది ఇరు దేశాల మధ్య ఉన్న సైనిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ దౌత్య సమస్యని మేము రాజకీయ స్థాయికి వదిలేస్తాం’’ అని అన్నారు. ఈ దౌత్య వివాదం గురించి తాను సోమవారం (25-09-23) రాత్రి భారత ఆర్మీ కమాండర్ మనోజ్ పాండేతో మాట్లాడానని అన్నారు. ఇది రాజకీయ సమస్య అని.. సైనిక పరంగా ఎటువంటి సంబంధం లేదని తామిద్దరం ఒక అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ఇతర 30 దేశాల్లో.. మనం కలిసి శిక్షణలు, కార్యకలాపాలు నిర్వహించ గల ప్రాంతాలను కనుగొనేందుకు అవకాశాల కోసం చూస్తున్నామన్నారు. తద్వారా శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అందరం సహకరించుకోగలమని అన్నారు.

ఇండో-పసిఫిక్ దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆలోచనలు పంచుకోవడం, పరిష్కార మార్గాల్ని కనుగొనడం కోసం.. ఇలాంటి గొప్ప ఫోరమ్‌లలో తాము పాలుపంచుకోవడం ఆనందాన్ని ఇస్తోందని పీటర్ స్కాట్ చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నిర్ధారించడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు భారత సైన్యం ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్‌ల రెండు రోజుల సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. కాన్ఫరెన్స్‌లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ పాండే ప్రసంగిస్తూ.. ఇండో-పసిఫిక్ కోసం భారతదేశపు దృక్పథం అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుందని అన్నారు.

Updated Date - 2023-09-26T18:46:17+05:30 IST