Pakistan Earthquake: భారీ భూకంపంతో మట్టిలో కలిసిపోనున్న పాకిస్తాన్.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-10-03T18:50:00+05:30 IST

అసలే పాకిస్తాన్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాల మధ్య ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఎంతోమంది ప్రజలు సరైన తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో..

Pakistan Earthquake: భారీ భూకంపంతో మట్టిలో కలిసిపోనున్న పాకిస్తాన్.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక

అసలే పాకిస్తాన్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాల మధ్య ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఎంతోమంది ప్రజలు సరైన తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. ఓ డచ్ శాస్త్రవేత్త పాకిస్తాన్‌పై మరో బాంబ్ పేల్చాడు. పాక్‌లో భారీ భూకంపం రావొచ్చని, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆ శాస్త్రవేత్త పేరు ఫ్రాంక్ హూగర్‌బీట్స్. నెదర్లాండ్స్‌కు చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS)లో ఆయన పని చేస్తారు. ఈ సంస్థ భూకంప అంచనాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడిది పాక్‌లో భారీ భూకంపం రానుందని అంచనా వేసింది.

ఈ అంచనాపై శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్‌బీట్స్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించబడ్డాయని పేర్కొన్నారు. ఇది రాబోయే భారీ భూకంపానికి సంకేతం అయ్యుండొచ్చని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘సెప్టెంబర్ 30వ తేదీన మేము పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వాతావరణ హెచ్చుతగ్గులను గమనించాం. దీన్ని బట్టి చూస్తుంటే.. పాక్‌లో తీవ్రమైన భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. భూకంపం తప్పకుండా వస్తుందని మేము కచ్ఛితంగా చెప్పలేము’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా రాసుకొచ్చారు. అంతకుముందు చేసిన ట్వీట్‌లోనూ.. అక్టోబరో 1-3 మధ్య భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ.. కచ్ఛితంగా వస్తుందని నొక్కి చెప్పలేమన్నారు.


కాగా.. ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఇంతకుముందు కూడా టర్కీ, సిరియాలలో భారీ భూకంపాలు వస్తాయని హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని రోజుల తర్వాత టర్కీ, సిరియాలను భూకంపాలు కుదిపేశాయి. వేల సంఖ్యలో ప్రజలు మరణించగా, భారీ ఆస్తినష్టం కూడా సంభవించింది. గతంలో ఢిల్లీలోనూ భూకంపం వస్తుందని ఆయన హెచ్చరించగా, కొన్ని రోజులయ్యాక ఢిల్లీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయన పాక్‌లో భూకంపం రావొచ్చని ప్రకటించడంతో.. అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే.. పాకిస్తాన్ మాత్రం ఫ్రాంక్ హూగర్‌బీట్స్ చేసిన ప్రకటనను ఖండించింది. ఆయన చెప్పినట్టు సూచికలు ఉండొచ్చేమో కానీ.. భారీ భూకంపం వస్తుందనడానికి సరైన సమాచారం లేదని, ఇవి కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది.

ఈ అంశంపై పాకిస్తాన్ జాతీయ సునామీ కేంద్రం కరాచీ డైరెక్టర్ అమీర్ హైదర్ మాట్లాడుతూ.. ఈ భూకంప ఊహాగానాల్ని తోసిపుచ్చారు. భూకంప కేంద్రం, సమయాన్ని అంచనా వేయలేమని పేర్కొన్నారు. పాకిస్తాన్ గుండా వెళుతున్న రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దు రేఖలో ఏ సమయంలోనైనా భూకంపం సంభవించవచ్చని, కానీ అది ఊహించడం అసాధ్యమని చెప్పారు. అటు.. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) సైతం భారత్, పాకిస్తాన్‌లలో భూకంపాల గురించి శాస్త్రీయ అంచనాలను తిరస్కరించింది.

Updated Date - 2023-10-03T18:50:00+05:30 IST