G20 Summit: జీ20 సమ్మిట్‌పై ఎట్టకేలకు మౌనం వీడిన చైనా.. ఢిల్లీ డిక్లరేషన్‌పై ఊహించని స్పందన

ABN , First Publish Date - 2023-09-11T22:37:46+05:30 IST

ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు విజయవంతంగా జీ20 సమావేశాలను నిర్వహించడం, ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాల ఏకాభిప్రాయం సాధించడం పట్ల.. భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా..

G20 Summit: జీ20 సమ్మిట్‌పై ఎట్టకేలకు మౌనం వీడిన చైనా.. ఢిల్లీ డిక్లరేషన్‌పై ఊహించని స్పందన

ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు విజయవంతంగా జీ20 సమావేశాలను నిర్వహించడం, ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాల ఏకాభిప్రాయం సాధించడం పట్ల.. భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా.. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భారత్ అతిపెద్ద విజయం సాధించిందని కొనియాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా డ్రాగన్ కంట్రీ చైనా సైతం ఈ అంశంపై తొలిసారి స్పందించింది. జీ20 సమ్మిట్‌లో సభ్యదేశాలు ఆమోదం తెలిపిన ఢిల్లీ డిక్లరేషన్.. సవాళ్లను ఎదుర్కోవడానికి, ఆర్థిక పునరుద్ధరణకు ప్రోత్సాహించడానికి ప్రపంచ దేశాలు కలిసి పని చేసేందుకు సానుకూల సంకేతాన్ని పంపిందని పేర్కొంది.


చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘సభ్య దేశాలు ఆమోదం తెలిపిన ఢిల్లీ డిక్లరేషన్ చైనా ప్రతిపాదనని ప్రతిబింబించేలా ఉంది. ఈ డిక్లరేషన్ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు, ప్రపంచ అభివృద్ధిని ప్రోత్సహించడానికి G20 సభ్య దేశాలు కలిసి పనిచేయడానికి సానుకూల సంకేతాలను పంపింది’’ అని అన్నారు. ఈ ఢిల్లీ డిక్లరేషన్‌ను సిద్ధం చేసే ప్రక్రియలో కూడా చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాముఖ్యతనిస్తూ.. మంచి ఫలితాలను అందుకునేందుకు గాను ఇటువంటి సదస్సులకు తమ దేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. అలాగే.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చైనా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు.

జీ20 డిక్లరేషన్ నాయకుల ఏకాభిప్రాయం, ఉమ్మడి అవగాహనను ప్రతిబింబిస్తుందని మావో నింగ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ఒక ప్రధాన వేదిక అని.. భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యలని కూడా ఈ వేదిక ద్వారా పరిష్కరించవచ్చని ఢిల్లీ సమ్మిట్ పునరుద్ఘాటించిందని ఆమె కొనియాడారు. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం చర్చల చర్చల ద్వారా సాధ్యమవుతుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. శాంతి చర్చలను ప్రోత్సహించేందుకు, ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి అంతర్జాతీయ కమ్యూనిటీతో కలిసి పని చేసేందుకు చైనా కట్టుబడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-11T22:37:46+05:30 IST