Hamas-Israel: హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల మొదటి వీడియో విడుదల.. పాపం ఆ మహిళ..
ABN , First Publish Date - 2023-10-17T11:20:02+05:30 IST
హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న ఓ ఇజ్రాయెల్ మహిళకు సంబంధించిన వీడియో తాజాగా బయటికొచ్చింది. హమాస్ సైనిక విభాగం ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను విడుదల చేసింది.
హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న ఓ ఇజ్రాయెల్ మహిళకు సంబంధించిన వీడియో తాజాగా బయటికొచ్చింది. హమాస్ సైనిక విభాగం ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బంధించిన తర్వాత విడుదల చేసిన మొదటి వీడియో ఇదే కావడం గమనార్హం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 200 మందిని అపహరించి బందీలుగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బయటికొచ్చిన వీడియోలో ఉన్నది 21 ఏళ్ల మియా స్కెమ్‌గా గుర్తించారు. వీడియోలో మహిళ చేతికి తీవ్రమైన గాయమైనట్టు కనిపించింది. నిమిషం ఒక సెకన్ నిడివి గల ఆ వీడియోలో మహిళ చేతికి తీవ్ర గాయం కావడంతో సర్జరీ కూడా జరిగినట్లు అర్థం అవుతోంది. దీంతో మరో వ్యక్తి మహిళ చేతికి కట్టు కడుతోంది. వీడియోలో బాధిత మహిళ మాట్లాడింది. తాను గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న చిన్న ఇజ్రాయెల్ నగరమైన స్డెరోట్ నుంచి వచ్చినట్లు చెప్పింది. దాడులు జరిగిన రోజున, ఆమె కిబ్బట్జ్ రీమ్‌లోని సూపర్‌నోవా సుక్కోట్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైనట్టు పేర్కొంది. ఆ సమయంలో మ్యూజిట్ ఫెష్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో కనీసం 260 మంది మరణించారు. మియాతో సహా 200 మందిని బందీలుగా తీసుకెళ్లారు. తన చేతికి అయిన గాయానికి 3 గంటలపాటు శస్త్ర చికిత్స జరిగినట్లు వీడియోలో సదరు మహిళ చెప్పింది. అయితే తనకు గాయం ఎలా అయిందనే విషయం గురించి మాత్రం ఆమె చెప్పకపోవడం గమనార్హం.
"వాళ్ల నన్ను బాగానే చూసుకుంటున్నారు. నాకు చికిత్స చేస్తున్నారు. మందులు ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నాను. నన్ను వీలైనంత త్వరంగా ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లండి. మా అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లండి. దయచేసి వీలైనంత త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి." అని మియా వేడుకుంది. మరోవైపు మియా గత వారం అపహరణకు గురైనట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించాయి. అధికారులు మియా కుటుంబానికి సమాచారం అందించి వారితో మాట్లాడారని, వారితో టచ్‌లో ఉన్నారని అధికారులు చెప్పారు. హమాస్ విడుదల చేసిన వీడియోలో వారు తమను తాము మానవీయత ఉన్న మనుషులుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఐడీఎఫ్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ ట్వీట్ చేసింది. అయినప్పటికీ వారు శిశువులు, పిల్లలు, పురుషులు, మహిళలు, వృద్ధుల హత్య, అపహరణకు బాధ్యత వహించే భయంకరమైన ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. కాగా మియాతో సహా బందీలుగా ఉన్న వారందరినీ తిరిగి తీసుకురావడానికి తాము అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్ పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మియా కుటుంబం ఈ వీడియోపై స్పందించింది. ఆమె సురక్షితంగా ఉన్నందుకు ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా మియా ఇజ్రాయెల్-ఫ్రెంచ్ ద్వంద్వ పౌరురాలు. తమ బంధువులను విడిపించేందుకు సహాయం చేయాలని గత వారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు విజ్ఞప్తి చేసిన ఫ్రెంచ్ కుటుంబాలలో ఆమె కుటుంబం కూడా ఉందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.