Israel vs Hamas War: దేశం కోసం భార్యను వదిలి సైన్యంలో చేరిన జర్నలిస్ట్.. కొడుకుకు ప్రమాణం చేసి కదన రంగంలోకి తండ్రి

ABN , First Publish Date - 2023-10-10T14:06:42+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపుల నుంచి బాంబులు, తుపాకుల మోతతో ఇజ్రాయెల్- పాలస్తీనా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ యుధ్దంలో రెండు వైపుల నుంచి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు.

Israel vs Hamas War: దేశం కోసం భార్యను వదిలి సైన్యంలో చేరిన జర్నలిస్ట్.. కొడుకుకు ప్రమాణం చేసి కదన రంగంలోకి తండ్రి

ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపుల నుంచి బాంబులు, తుపాకుల మోతతో ఇజ్రాయెల్- పాలస్తీనా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ యుధ్దంలో రెండు వైపుల నుంచి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు. వేలలో క్షతగాత్రులయ్యారు. అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు హమాస్‌తో యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అదనంగా 3 లక్షల మందిని సైన్యంలో చేర్చుకోవాలని నిర్ణయించింది. వెంటనే నియామక ప్రక్రియ కూడా చేపట్టింది. సైన్యంలో చేరేందుకు 18 ఏళ్ల నిండిన యువతీ యువకులను అర్హులుగా ప్రకటించింది. సైన్యంలో చేరిన వారు కనీసం 24 నెలల నుంచి 32 నెలలు దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది. ఒక వైపు యుద్ధం కొనసాగుతుండడంతో వీలైనంత ఎక్కువ మందిని సైన్యంలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం పలు సడలింపులు కూడా ఇచ్చింది.


ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లోని ప్రముఖ జర్నలిస్ట్ హనన్య నఫ్తాలీ కూడా సైన్యంలో చేరారు. తన భార్య నఫాలీ ఇండియాను వదిలి దేశం కోసం పోరాడేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన హనన్య నఫ్తాలీ తన భార్యను వీడుతున్న ఫోటోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘నా దేశం ఇజ్రాయెల్‌కు సేవ చేయడానికి నేను సైన్యంలో చేరాను. భగవంతుని ఆశీస్సులు, రక్షణతో నన్ను పంపిన నా భార్య ఇండియా నఫ్తాలీకి నేను గుడ్‌బై చెప్పి యుద్ధంలో అడుగుపెట్టాను. ఇక నుంచి నా ఖాతాను ఆమెనే నిర్వహిస్తుంది.’’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సైన్యంలో చేరడానికి వెళ్తూ తన భార్యను కౌగిలించుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను భార్య ఇండియా షేర్ చేసి, తన భర్త యుద్ధంలో పోరాడేందుకు వెళ్లినందున ఆయన కోసం ప్రార్థించమని కోరారు. మరోవైపు యుద్ధానికి వెళ్తున్న ఓ తండ్రి తాను త్వరలో తిరిగి వస్తానంటూ తన కుమారుడికి ప్రమాణం చేస్తున ఫోటోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. కాగా హనన్య నఫ్తాలీ భార్య ఇండియా నఫ్తాలీ కూడా జర్నలిస్టే. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడుల గురించి భార్యభర్తలిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్కడి పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారు. మరోవైపు రెండు వైపుల దాడుల్లో ఇప్పటివరకు 1,600కు పైగా చనిపోయారు.

Updated Date - 2023-10-10T14:08:10+05:30 IST