America : దశాబ్దంలో అతి పెద్ద ఇంటెలిజెన్స్ లీక్.. 21 ఏళ్ళ యువకుడి అరెస్ట్..
ABN , First Publish Date - 2023-04-14T13:29:53+05:30 IST
అమెరికా జాతీయ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా బయటపెట్టిన ఓ చిరుద్యోగిని ఫెడరల్ బ్యూరో
వాషింగ్టన్ : అమెరికా జాతీయ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా బయటపెట్టిన ఓ చిరుద్యోగిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గురువారం అరెస్ట్ చేసింది. నిందితునిపై ఆరోపణలను శుక్రవారం నమోదు చేస్తామని తెలిపింది. దీంతో జో బైడెన్ (Joe Biden) అడ్మినిస్ట్రేషన్ తీవ్ర ఆందోళనకు గురైంది. రహస్య సమాచారం సునాయాసంగా వెల్లడికావడానికి కారణాలను వివరించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
మసాచుసెట్స్‌లోని దిఘ్టన్‌కు చెందిన జాక్ టెయ్‌క్సెయ్‌రా (Jack Teixeira) (21)ని ఎఫ్‌బీఐ గురువారం అరెస్ట్ చేసింది. ఆయన అత్యంత రహస్యమైన అమెరికన్ నేషనల్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ అనధికారిక తొలగింపు, రిటెన్షన్, ట్రాన్స్‌మిషన్‌కు పాల్పడినట్లు అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ (Merrick Garland) చెప్పారు.
జాక్ టెయ్‌క్సెయ్‌రా సైబర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ జర్నీమేన్‌గా పని చేస్తున్నారు. ఈ ఉద్యోగం పొందాలంటే హైస్కూల్ డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్, 18 నెలలపాటు శిక్షణ అవసరం. పెంటగాన్‌లో ఆయన చాలా జూనియర్ స్థాయి ఉద్యోగి. కమ్యూనికేషన్స్ సిస్టమ్స్‌ను సురక్షితంగా ఉంచడం, సక్రమంగా పని చేసేలా చేయడం, సంస్థ విజయంలో ముఖ్య భూమిక పోషించడం ఈ ఉద్యోగాన్ని నిర్వహించేవారి విధులు. ఆయన ఎయిర్ నేషనల్ గార్డ్‌లో 2019లో చేరారు.
ఇటువంటి క్రింది స్థాయి ఉద్యోగికి అత్యంత రహస్య సమాచారం అందుబాటులో ఉంటే, ఇంక ఆ సమాచారం అందుబాటులో లేనిది ఎవరికి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రెసిడెంట్స్ డైలీ బ్రీఫ్ మాజీ సీనియర్ ఎడిటర్ డెన్నిస్ వైల్డర్ మాట్లాడుతూ, ఇది పెంటగాన్‌కు నిజమైన సమస్య అని చెప్పారు. ప్రాముఖ్యత లేనటువంటి నేషనల్ గార్డ్ యూనిట్‌కు ఇలాంటి పత్రాలను అందుబాటులో ఉంచడం తీవ్ర ఆందోళనకరమని చెప్పారు.
ఇదిలావుండగా, ఈ లీక్ తీవ్రతను తక్కువ చేసి చూపించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (President Joe Biden) ప్రయత్నిస్తున్నారు. అయితే నిపుణులు, మాజీ అధికారుల అభిప్రాయం మరోలా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రతి క్షణం ఏ విధంగా మదింపు జరుగుతోందో బయటపడిందని, ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా ఏ విధంగా సేకరిస్తుందనే విషయం వెల్లడైందని చెప్తున్నారు.
రహస్య సమాచారం బయటకు వచ్చిందని గురువారం రాత్రి వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించిన వెంటనే టెలిఫోన్లు మోగడం ప్రారంభమైందని అమెరికా మిత్ర దేశానికి చెందిన ఓ అధికారి చెప్పారు. ఈ రహస్య పత్రాలను నిందితుడు తన ఆన్‌లైన్ స్నేహితులకు షేర్ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఐసొలేషన్‌ను తప్పించుకోవడం కోసం ప్రయత్నించిన టీనేజర్లు కూడా ఈ సమాచారాన్ని పొందినట్లు తెలిపారు.
నిఘా వైఫల్యాలు అమెరికాను తరచూ చికాకు పెడుతున్నాయి. రహస్యాన్ని కాపాడుకోగలిగే సామర్థ్యం ఆ దేశానికి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ఆందోళనల నేపథ్యంలో డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం స్పందిస్తూ, భవిష్యత్తులో ఈ విధంగా మరోసారి లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పెంటగాన్ ఇంటెలిజెన్స్ యాక్సెస్, జవాబుదారీతనం, నియంత్రణ విధానాలను సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు.
అమెరికా రహస్యాలను తెలుసుకోగలిగే అవకాశం చాలా ఎక్కువ మందికి ఉండటం సమస్యాత్మకంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, రహస్య పత్రాలను పరిశీలించే అవకాశంగలవారి సంఖ్య 2019 అక్టోబరునాటికి దాదాపు 30 లక్షలు. ఇంత ఎక్కువ మందికి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్ల, అది మరింత ఎక్కువ మందికి చేరడానికి వీలవుతోంది. సెప్టెంబరు 11 దాడుల తర్వాత ఎక్కువ మందికి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తున్నారు. భవిష్యత్తులో దాడులను నిరోధించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మందికి నిఘా సమాచారాన్ని పంపిస్తున్నారు.
జాక్ టెయ్‌క్సెయ్‌రా పని చేస్తున్న 102వ ఇంటెలిజెన్స్ వింగ్‌కు అత్యంత రహస్య సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందుబాటులో ఉంటుంది. శిక్షణ పొందిన, ఎక్స్‌పీరియెన్స్‌డ్ ఎయిర్‌మెన్ ఈ విభాగంలో ఉంటారు. ఇక్కడ జాక్ డ్యూటీ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఆయన గత ఏడాది సెప్టెంబరులో ఈ డ్యూటీలో చేరారు. నెట్‌వర్క్ డిఫెన్స్ ఆయన విధి. టాప్ సీక్రెట్, సెన్సిటివ్ కంపార్ట్‌మెంటెడ్ ఇన్ఫర్మేషన్ అనే వర్గీకరణలో ఆయన ఉన్నారు. ఇది హయ్యెస్ట్ క్లాసిఫికేషన్. విస్తృతమైన తనిఖీలు చేసి, ఆయనను ఈ ఉద్యోగంలో నియమించారు.
ఇవి కూడా చదవండి :
Bhuma Akhilapriya: స్టిక్కర్లను ఇళ్లకు కాదు..వాళ్ల ముఖాలకు బాగుంటుంది..