Share News

Joe Biden: అధ్యక్ష పదవి పోటీలో ట్రంప్ లేకపోతే, నేను కూడా ఉండకపోవచ్చు.. జో బైడెన్ షాకింగ్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-06T21:42:38+05:30 IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలున్న తరుణంలో.. ప్రతిపక్షంలో అభ్యర్థి రేసులో ఉన్న నేతలతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాగే.. నిధుల సేకరణలోనూ బిజీగా ఉన్నారు.

Joe Biden: అధ్యక్ష పదవి పోటీలో ట్రంప్ లేకపోతే, నేను కూడా ఉండకపోవచ్చు.. జో బైడెన్ షాకింగ్ వ్యాఖ్యలు

Joe Biden On Donald Trump: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలున్న తరుణంలో.. ప్రతిపక్షంలో అభ్యర్థి రేసులో ఉన్న నేతలతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాగే.. నిధుల సేకరణలోనూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. బోస్టన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాబోయే అధ్యక్ష పదవి పోటీలో ట్రంప్ లేకపోతే.. తాను కూడా పోటీ చేయకపోవచ్చని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీలో లేకపోతే.. నేను కూడా పోటీ చేస్తానో లేదో కచ్ఛితంగా తెలియదు. కానీ.. అమెరికా దేశం కోసం ఆయన్ను మాత్రం గెలవనివ్వం’’ అని జో బైడెన్ చెప్పుకొచ్చారు. అయితే.. తామిద్దరం అధ్యక్ష పదవి రేసులో ఉన్నామని వాళ్లిద్దరు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.


ఇదిలావుండగా.. జో బైడెన్‌కు అమెరికా ఓటర్లు మరో అవకాశం ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఇప్పటికే ఆయన వయసు 81 సంవత్సరాలు. దీంతో.. ఆయన అత్యంత వృద్ధి అధ్యక్షుడిగా నిలిచాడు. ఒకవేళ రెండోసారి కూడా ఛాన్స్ ఇస్తే.. సమర్థవంతంగా రాణించగలరా? సవాళ్లను ఎదుర్కోగలరా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై నెట్టింట్లో, రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. 77 ఏళ్ల ట్రంప్ పోటీలో ఉన్నప్పుడు, తానెందుకు పోటీ చేయకూడదని ఉద్దేశంతో జో బైడెన్ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఒకవేళ ట్రంప్ పోటీలో లేకపోతే తాను పోటీలో ఉండేవాడిని కాదేమో కానీ.. ప్రస్తుతానికి తాను ఎన్నికల రేసులో ఉన్నానని బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ట్రంప్‌ని ప్రజస్వామ్యానికి ముప్పుగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ కురువృద్ధుడికి అమెరికా ప్రజలు మరో అవకాశం ఇస్తారా? లేదా? అనేదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా అమెరికాలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఒకవేళ 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందితే.. అమెరికా నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. నియంతగా మారనని ప్రమాణం చేశాడు. కానీ.. ప్రమాణ స్వీకారం రోజు మాత్రం తాను నియంతగా ఉంటానని తేల్చి చెప్పారు. కాగా.. 2017 నుంచి 2021 మధ్య ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Updated Date - 2023-12-06T21:42:40+05:30 IST