Share News

Joe Biden: ఇజ్రాయెల్, హమాస్ మధ్య డీల్‌పై జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-11-22T20:30:55+05:30 IST

అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వంతో 50 మంది బందీల విడుదలకు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీల్లో 50 మందిని రోజుకి 12 మంది చొప్పున..

Joe Biden: ఇజ్రాయెల్, హమాస్ మధ్య డీల్‌పై జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Israel-Hamas Deal: అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వంతో 50 మంది బందీల విడుదలకు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీల్లో 50 మందిని రోజుకి 12 మంది చొప్పున నాలుగు రోజుల పాటు విడుదల చేస్తే.. అటు ఇజ్రాయెల్ సైతం తమ చెరలో ఉన్న పలువురు పాలస్తీనా ఖైదీలని రిలీజ్ చేయనుంది. ఇలా ఈ రెండు వర్గాల మధ్య డీల్ కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని స్వాగతించిన ఆయన.. ఫైనల్‌గా బందీలుగా ఉన్న వాళ్లు తమ కుటుంబ సభ్యుల్ని కలవబోతున్నారన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.


‘‘అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై క్రూరమైన దాడి చేసిన హమాస్, కొందరు ఇజ్రాయిలీలను బందీలుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ బందీల విడుదల కోసం కుదిరిన ఒప్పందాన్ని నేను సాదరంగా స్వాగతిస్తున్నాను. ఈ ఒప్పందం అమలైతే.. ఇన్ని రోజుల పాటు అంతులేని వేదనని అనుభవించిన బందీలు, చివరికి తమ కుటుంబ సభ్యులతో కలుస్తారు. అందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని బైడెన్‌ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఈ ఒప్పంద కుదరడం వెనుక ప్రధాన పాత్ర పోషించిన ఖతార్ ప్రధాని, ఈజిప్టు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే.. ఈ ఒప్పందం అమలు కోసం నిబద్ధతని ప్రదర్శించారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా బైడెన్ అభినందించారు.

ఇదిలావుండగా.. మంగళవారం అర్ధరాత్రి వరకు సమావేశం జరగ్గా, ఇజ్రాయెల్‌ మంత్రివర్గం హమాస్‌తో ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇది కష్టమైనదే అయినప్పటికీ, సరైన నిర్ణయమేనని తన మంత్రులతో తెలిపారు. అయితే.. ఈ ఒప్పందం కుదిరినంత మాత్రాన యుద్ధం ముగిసిన కాదు. పరస్పర బందీలు, ఖైదీల అప్పగింతలు ముగిసేవరకు (4 రోజుల పాటు) మాత్రమే కాల్పుల విరమణని ఇజ్రాయెల్ పాటించనుంది. ఆ తర్వాత యథావిధిగా ఇజ్రాయెల్ నుంచి కాల్పులు కొనసాగే అవాకాశాలున్నాయి. అక్టోబర్ 7 నుంచి ప్రారంభమైన యుద్ధంలో తొలి సారి కాల్పుల విరమణ ఒప్పందం జరగడం గమనార్హం.

Updated Date - 2023-11-22T20:30:57+05:30 IST