Share News

Joe Biden: గాజా పాలనా బాధ్యతలు వారికే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-20T20:46:15+05:30 IST

ఇన్నాళ్లూ గాజా స్ట్రిప్‌లో హమాస్ పాలన ఉండేది. కానీ.. యుద్ధం మొదలైన తర్వాతి నుంచి హమాస్ కథ కంచికి చేరడంతో, గాజా పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. మొదట్లో.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని బట్టి చూస్తే...

Joe Biden: గాజా పాలనా బాధ్యతలు వారికే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Israel-Hamas War: ఇన్నాళ్లూ గాజా స్ట్రిప్‌లో హమాస్ పాలన ఉండేది. కానీ.. యుద్ధం మొదలైన తర్వాతి నుంచి హమాస్ కథ కంచికి చేరడంతో, గాజా పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. మొదట్లో.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని బట్టి చూస్తే, అదే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందేమోనని అంతా అనుకున్నారు. గతంలోనూ గాజాని పాలించిన చరిత్ర ఇజ్రాయెల్‌కి ఉంది కాబట్టి, ఈ యుద్ధం తర్వాత అది తిరిగి ఆ ప్రాంతాన్ని పాలించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. తమకు గాజాని పాలించే ఆసక్తి ఏమాత్రం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. మరి.. అలాంటప్పుడు గాజా పాలనా పగ్గాలు ఎవరికి దక్కుతాయి? అనేది మిస్టరీగా మారింది.


తాజాగా ఈ మిస్టరీకి తెరదించుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్‌బ్యాంక్‌ని పాలిస్తున్న పాలస్తీనా అథారిటీనే అంతిమంగా గాజా పగ్గాలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాము శాంతి కోసం తపిస్తున్నామని.. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ను ఒకే పాలన ఛత్రం కిందకు తీసుకురావాలని అన్నారు. అలా జరిగితే.. రెండు దేశాల మధ్య సమస్యకు పరిష్కారంపై ముందడుగు వేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. పాలస్తీనా అథారిటీని మరింత బలోపేతం చేయాలన్నారు. అయితే.. గాజా నుంచి పాలస్తీనా వాసుల్ని బలవంతంగా పంపించకూడదని సూచించారు. దురాక్రమణలు మళ్లీ ఉండకూడదని.. పరోక్షంగా ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించకూడదని తెలిపారు. గాజాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే.. బెంజిమన్ మాత్రం జో బైడెన్ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. యుద్ధం ముగించిన తర్వాత గాజాని పాలించే సామర్థ్యం పాలస్తీనా అథారిటీ లేదని ఆయన తేల్చి చెప్పారు. గతంలోనూ ఆయన భవిష్యత్తులో గాజాలో ఇజ్రాయెల్ మొత్తం సైనిక బాధ్యత నిర్వహిస్తుందని అన్నారు. దీనికితోడు.. గాజాని అభివృద్ధి పరిచే దిశగా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. చూస్తుంటే.. ఇజ్రాయెల్ నేరుగా కాకపోయినా, పరోక్షంగా అయినా గాజా పాలనా బాధ్యతల్ని చేపట్టేలా కనిపిస్తోంది. అంటే.. తన నేతృత్వంలో ఒక ప్రభుత్వం అక్కడ సృష్టించి, ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నుంచే నియంత్రించనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-11-20T20:46:16+05:30 IST