Joe Biden: ట్రంప్ మగ్‌షాట్ ఫోటోపై జో బైడెన్ సెటైర్లు.. అవకాశాన్ని భలే వాడుకున్నారుగా!
ABN , First Publish Date - 2023-08-26T20:08:36+05:30 IST
రాజకీయాల్లో తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు గాను సరైన సమయం కోసం నేతలు వేచి చూస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలాంటి ఛాన్సే వచ్చింది. ట్రంప్ అరెస్ట్‌ని ఆయన తనకు...
రాజకీయాల్లో తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు గాను సరైన సమయం కోసం నేతలు వేచి చూస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలాంటి ఛాన్సే వచ్చింది. ట్రంప్ అరెస్ట్‌ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తొలుత ఆయన ట్రంప్ మగ్‌షాట్‌పై స్పందిస్తూ.. ట్రంప్ అందంగా ఉన్నారని, ఆయనో అద్భుతమైన వ్యక్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాహోలోని వ్యాయామ క్లాస్ నుంచి బయటకొచ్చే సమయంలో బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ట్రంప్ జైల్లో ఉన్నప్పుడు బైడెన్ నిధుల సేకరణకు సంబంధించిన ఈమెయిల్స్‌ని తన మద్దతుదారులకు పంపారు. తమ ప్రచారం మొదలుపెట్టేందుకు ఇంతకంటే మంచి రోజు రాదంటూ బైడెన్ తెలిపారు.
ఇదిలావుండగా.. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో డోనాల్డ్ ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలుకి వెళ్లి లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్‌షాట్ తీశారు. దీంతో.. ఫోటోతో పాటు పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడి మగ్‌షాట్ తీయడం కూడా ఇదే తొలిసారి. 6.3 అడుగుల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు.. అంటూ ట్రంప్ వివరాల్ని జైలు అధికారులు నమోదు చేశారు. అంతేకాదు.. ట్రంప్‌కు P01135809 అనే ఖైదీ నంబర్‌ను కూడా కేటాయించారు. దాదాపు 22 నిమిషాల సేపు జైల్లో గడిపిన ట్రంప్.. 2 లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అమెరికాకు ఇది చెడు దినమని పేర్కొన్నారు. అలాగే.. తన మగ్‌షాట్ ఫోటోను తన సొంత ‘ట్రూత్ సోషల్’తో పాటు ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇకపై తాను ఎన్నికల్లో జోక్యం.. ఎన్నటికీ లొంగను అంటూ క్యాప్షన్ పెట్టారు. మరోవైపు.. ట్రంప్ మగ్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.