Share News

Israel-Hamas War: గాజా పౌరులను రక్షించండి.. ఫోన్‌లో ఇజ్రాయెల్ ప్రధానికి బైడెన్ సూచన

ABN , First Publish Date - 2023-10-30T18:52:38+05:30 IST

తమ దేశంపై మెరుపుదాడులకు పాల్పడటం, దేశంలోకి చొరబడి తమ పౌరుల్ని అపహరించుకోవడంతో.. హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హమాస్‌ని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో.. గాజాపై విరుచుకుపడుతోంది.

Israel-Hamas War: గాజా పౌరులను రక్షించండి.. ఫోన్‌లో ఇజ్రాయెల్ ప్రధానికి బైడెన్ సూచన

తమ దేశంపై మెరుపుదాడులకు పాల్పడటం, దేశంలోకి చొరబడి తమ పౌరుల్ని అపహరించుకోవడంతో.. హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హమాస్‌ని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో.. గాజాపై విరుచుకుపడుతోంది. ఆహారం, విద్యుత్, నీళ్లు, ఇంధన సరఫరాలపై నిషేధం విధించి గాజాను దిగ్బంధనం చేయడమే కాదు.. వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో ఆ నగరంలో విధ్వంసం సృష్టిస్తోంది. ఒకప్పుడు అందమైన నగరంగా ఉన్న గాజా.. ఈ దాడుల కారణంగా చెత్తదిబ్బగా మారింది. ఈ దాడుల్లో వేలాదిమంది గాజా పౌరులు కూడా మరణించారు. కనీస సదుపాయాలు అందక కూడా అక్కడి సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో.. గాజా ప్రజలకు మానవతా సాయం అందేలా చూడాలని ప్రపంచ నేతలు పిలుపునిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కమంటూ బతుకీడుస్తున్న గాజా పౌరుల్ని రక్షించాలని నెతన్యాహుని సూచించారు. హమాస్‌ మిలిటెంట్లు, పౌరులకు మధ్య తేడాను గుర్తించి.. అమాయక ప్రజలను కాపాడాలన్నారు. ‘‘హమాస్ నుంచి తనని తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. కానీ.. పౌరుల ప్రాణాలను రక్షించే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఇజ్రాయెల్‌ వ్యవహరించాలి. హమాస్‌ మిలిటెంట్లు, పౌరులకు మధ్య తేడాను గుర్తించి.. గాజాలోని సామాన్య పౌరుల్ని రక్షించాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు బైడెన్, బెంజిమన్ మధ్య ఫోన్ సంభాషణ సాగినట్టు వైట్ హౌస్ తెలిపింది.

ఇదే సమయంలో.. ఈజిప్టు అధ్యక్షుడి అబ్దెల్ ఫతా అల్-సీసీతోనూ జో బైడెన్ మాట్లాడినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇప్పటినుంచి గాజాకు అందుతోన్న మానవతా సాయాన్ని పెంచేందుకు ఆ ఇద్దరు నేతలు కట్టుబడి ఉన్నారని తెలిపింది. ఇదిలావుండగా.. తొలుత హమాస్ చేసిన దాడిలో ఇజ్రాయెల్‌లో 1400 మందికి పైగా సామాన్య ప్రజలు మృతి చెందారు. అందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో గాజాలో 8వేల మందికి పైగా మృతి చెందినట్లు హమాస్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆ మృతుల్లో అత్యధికులు చిన్నారులు, మహిళలే ఉన్నారని పేర్కొంది. మరోవైపు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పాలస్తీనా భూభాగంలో అత్యవసర మానవతా మద్దతు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అక్కడి పౌరులకు నిత్యవసర సరుకులు అందేలా కలిసి పని చేసేందుకు అంగీకరించారు.

Updated Date - 2023-10-30T18:52:38+05:30 IST