Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి దారి చూపిన ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
ABN , First Publish Date - 2023-10-02T22:42:43+05:30 IST
వైద్య శాస్త్రంలో విశేష సేవలు అందించడంతో పాటు కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమం చేసే మెసెంజర్ ఆర్‌ఎన్‌ఎ సాంకేతికతపై పని చేసినందుకు గాను.. కటాలిన్ కారికో, డ్రూ వెయిస్‌మాన్‌లకు..
వైద్య శాస్త్రంలో విశేష సేవలు అందించడంతో పాటు కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమం చేసే మెసెంజర్ ఆర్‌ఎన్‌ఎ సాంకేతికతపై పని చేసినందుకు గాను.. కటాలిన్ కారికో, డ్రూ వెయిస్‌మాన్‌లకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం దక్కింది. ఈ ఆధునిక కాలంలో మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారిన కొవిడ్-19ని ఎదుర్కోవడం కోసం వీళ్లిద్దరు చేసిన పరిశోధనలు రెండు రెట్లు దోహదపడ్డాయని జ్యూరీ పేర్కొంది.
ఇదిలావుండగా.. కాటలిన్ కరికో హంగేరీకి చెందగా, డ్రూ వెయిస్‌మన్ అమెరికాకు చెందినవారు. వీళ్లిద్దరు కలిసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే వీళ్లు తమ పరిశోధనల్లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు.. అవి ప్రతిచర్యను అడ్డుకొని, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని వాళ్లు కనుగొన్నారు. 2005లో ఈ పరిశోధనపై వాళ్లు ఒక పేపర్‌ని సైతం పబ్లిష్ చేశారు. అయితే.. అప్పట్లో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు.
అయితే.. కొవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఆ ఇద్దరి పరిశోధనలు కీలకపాత్ర పోషించాయి. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో రెండు mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్లు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాయని, ఎన్నో కోట్లమంది ప్రాణాలను కాపాడాయి. ఈ mRNA సాంకేతికతను ఉపయోగించే.. ఫైజర్/బయోఎన్‌టెక్, మోడర్నా వ్యాక్సిన్‌లను తయారు చేశారు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కొవిడ్ మీదే కాదు, ఇంకా మరెన్నో పరిశోధనలు జరిపారు.
ఇంతకీ ఏంటీ నోబెల్ పురస్కారం?
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించారు. ఆయన పేరు మీదే నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతిఏటా అందిస్తున్నారు. ఈ పురస్కారం గ్రహీతలకు గతేడాది దాకా 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లకు పెంచారు.