Share News

NASA: నాసా మరో సంచలనం.. ఆ 17 గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయా?

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:45 PM

మన భూమి తరహాలోనే ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? అనే రహస్యాన్ని కనుగొనడం కోసం కొన్ని స్పేస్ ఏజెన్సీలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. వాటిల్లో అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ కూడా ఒకటి. అంతరిక్ష ప్రయోగాల్లో...

NASA: నాసా మరో సంచలనం.. ఆ 17 గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయా?

Nasa Founds 17 Exoplanets: మన భూమి తరహాలోనే ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? అనే రహస్యాన్ని కనుగొనడం కోసం కొన్ని స్పేస్ ఏజెన్సీలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. వాటిల్లో అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ కూడా ఒకటి. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ఎన్నో సంచలనాలను నమోదు చేసిన ఈ నాసా.. గత కొన్నేళ్ల నుంచి ఇతర గ్రహాలపై జీవం కోసం శోధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ తాజాగా 17 కొత్త గ్రహాలను (ఎక్సోప్లానెట్స్) కనుగొంది. ఈ గ్రహాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నాయని.. బహుశా ఆ మంచు కింద లైఫ్ సపోర్ట్ మహాసముద్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే.. గ్రహాంతర వాసులు (ఏలియన్స్) ఉండొచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కానీ.. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు సాక్ష్యాలు మాత్రం లేవు.

మన భూగ్రహం ఎలాగైతే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోందో.. ఆ 17 గ్రహాలు కూడా ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని నాసా పేర్కొంది. ఆ గ్రహాల్లోని మహాసముద్రాల నీరు.. కొన్నిసార్లు మంచు పొర ద్వారా గీజర్ల రూపంలో ఉపరితలం నుండి బయటకు వస్తుందని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ గీజర్ కార్యాచరణ మొత్తాన్ని సైన్స్ బృందం లెక్కించిందని.. ఇలాంటి అంచనాలను రూపొందించడం ఇదే మొదటిసారి అని ఆ అంతరిక్ష సంస్థ చెప్పుకొచ్చింది. నాసా విభాగంలోని గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన డాక్టర్ లిన్నే క్విక్ నేతృత్వంలోని ఒక సైంటిస్ట్ బృందం ఈ 17 ఎక్సోప్లానెట్‌లను కనుగొన్నారు. ప్రస్తుతం ఈ బృందం.. ఆ గ్రహాల్లో జీవం ఉందా? లేదా? అనే విషయాన్ని కనుగొనడంపై అధ్యయనాలు జరుపుతున్నట్టు నాసా తన ప్రకటనలో స్పష్టం చేసింది.


‘హాబిటబుల్ జోన్’ (గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశం)కి బదులుగా.. ఈ కోల్డ్ ఎక్సోప్లానెట్‌లపై జీవాన్ని కనుగొనడానికి కృషి చేయాలనే దానిపై అధ్యయనం పూర్తి దృష్టి సారించింది. మంచుతో నిండిన ఈ గ్రహాల్లో మహాసముద్రాలు తప్పకుండా ఉండొచ్చని.. ఇవి తమ ఇంటర్నల్ హీటింగ్ మెకానిజంను ఉపయోగిస్తున్నాయని ఆ అధ్యయనంలో చెప్పబడింది. మన సౌర వ్యవస్థలో ఉన్న యూరోపా, ఇన్‌క్లాడస్ అనే చంద్రులపై కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉందని నిపుణులు చెప్తున్నారు. తమ విశ్లేషణ ప్రకారం.. ఈ 17 గ్రహాల్లో ఉన్న మహాసముద్రాల్లోని నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు.. తమ సూర్యుడి నుండి రేడియోధార్మిక మూలకాలు, టైడల్ శక్తుల నుండి సహాయం పొందవచ్చు డాక్టర్ లిన్నే క్విక్ చెప్పారు.

అయితే.. ఈ 17 గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? అనే విషయాన్ని మాత్రం ఈ అధ్యయనం వెల్లడించలేదు. కానీ.. ఆ గ్రహాల్లో నీటి ఉనిక ఉండటంతో, ఎక్కడో ఒక చోట వాటిపై జీవం ఉండొచ్చని సూచిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే.. ఆ జీవం ఇప్పటికీ బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల స్థితిలో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇంతకుముందు నాసా అధ్యక్షనం గ్రహాంతరవాసుల గురించి మరే ఇతర వివరాలు బయటపెట్టలేదు. కాబట్టి.. ఆ గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయా? లేవా? అని ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు.

Updated Date - Dec 17 , 2023 | 04:45 PM