North Korea : కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె వయసు పదేళ్లు... చేసే పనులు కెవ్వు కేక...

ABN , First Publish Date - 2023-03-10T15:24:07+05:30 IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్ జు ఆయే (Kim Ju-ae) జీవన శైలిని

North Korea : కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె వయసు పదేళ్లు... చేసే పనులు కెవ్వు కేక...
Kim Jong Un, Kim Ju Ae

న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్ జు ఆయే (Kim Ju-ae) జీవన శైలిని చూస్తే కళ్లు చెదురుతాయని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వెల్లడించింది. ఆమె పదేళ్ల వయసులోనే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోందని తెలిపింది. దేశ ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో ఆమె మాత్రం గుర్రపు స్వారీలు, స్కీయింగ్, ఈత వంటివాటితో ఆనందిస్తోందని పేర్కొంది.

దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆ దేశ చట్ట సభల సభ్యులకు, రాజకీయ నేతలకు ఈ వివరాలను తెలిపింది. ఉత్తర కొరియా రాజధాని నగరం ప్యాంగ్యాంగ్ (Pyongyang)లో తన నివాసంలోనే కిమ్ జు ఆయే చదువుకుంటోందని, ఖాళీ సమయాల్లో గుర్రపు స్వారీ, స్కీయింగ్, స్విమ్మింగ్ చేస్తోందని తెలిపింది. అధికారికంగా ఏర్పాటైన పాఠశాలకు ఆమె కనీసం ఒకసారి అయినా వెళ్లలేదని పేర్కొంది. తన కుమార్తె చాలా బాగా గుర్రపు స్వారీ చేస్తోందని కిమ్ జోంగ్ ఉన్ సంతోషిస్తున్నట్లు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

దేశ ప్రజలు కష్టాల కడగండ్లలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, కిమ్ జు ఆయే మాత్రం సకల సదుపాయాలతో గడుపుతోందని తెలిపింది. ఐక్య రాజ్య సమితి (United Nations), దక్షిణ కొరియా అధికారులు గత వారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర కొరియాలో ప్రజలకు కనీస అవసరాలకు తగినంత అయినా ఆహారం అందుబాటులో లేదు.

కిమ్ జు ఆయేకు ఓ అన్నయ్య (13) ఉన్నాడు. ఆమె తర్వాత మరో తోబుట్టువు జన్మించారు. అయితే ఆ తోబుట్టువు ఆమెకు చెల్లి? తమ్ముడు? అనే విషయం బయటపడలేదు.

గత ఏడాది నవంబరు నుంచి ఆమె తన తండ్రితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో కిమ్ వారసురాలు ఆమేనని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తండ్రి మరణానంతరం కిమ్ ఉత్తర కొరియా అధినేతగా మారారు. అప్పటికి ఆయన వయసు కేవలం ఎనిమిదేళ్లు. అందుకే పదేళ్ళ వయసులో ఉన్న కిమ్ జు ఆయే ఆయన వారసురాలు కాబోతోందనే ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. కిమ్ తండ్రి, తాత కూడా ఆ దేశాధినేతలే. చనిపోయే వరకు వారు ఆ పదవిలోనే ఉన్నారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ 11 సంవత్సరాల నుంచి ఉత్తర కొరియాను పరిపాలిస్తున్నారు.

కొందరి వాదన ప్రకారం, కిమ్ తమ్ముడు 2014 తర్వాత ఇటీవలే బహిరంగంగా కనిపించారు. ఆయన నాయకత్వ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు కిమ్ సతీమణి రి సోల్-జు, కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ మధ్య అధికారం కోసం పోరు జరుగుతోందని కొందరు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Indonesia : రాజధానిని మార్చుతున్న ఇండోనేషియా... కారణాలివే...

British Royal Family: బ్రిటిష్ రాజ వంశంలో కూడా ఇంత చీప్‌గా ఆలోచిస్తారా..!

Updated Date - 2023-03-10T15:24:07+05:30 IST