విజేత సరే, రెండోస్థానం ఎవరిది?
ABN , First Publish Date - 2022-12-02T02:46:41+05:30 IST
ఏపార్టీ గెలుస్తుంది? అన్నదే ఏ ఎన్నికలలో అయినా అందరూ ఆసక్తికరంగా చర్చించుకునే విషయం. అయితే గుజరాత్ 15వ శాసనసభా ఎన్నికలు భిన్నమైనవి...
ఏపార్టీ గెలుస్తుంది? అన్నదే ఏ ఎన్నికలలో అయినా అందరూ ఆసక్తికరంగా చర్చించుకునే విషయం. అయితే గుజరాత్ 15వ శాసనసభా ఎన్నికలు భిన్నమైనవి (ఈ ఎన్నికల ప్రథమ దశ పోలింగ్ గురువారం నాడు పూర్తయింది), అంతేకాదు, అద్వితీయమైనవి. ఎందుకని? ప్రస్తుత అధికార పక్షమే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇంచు మించు ప్రతీ ఒక్కరూ విశ్వసిస్తున్నారు. అసలు పోటీ ద్వితీయ స్థానానికి మాత్రమే. ఈ అపూర్వ పోటీ భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య జరుగుతోంది. రెండో స్థానంలో, మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ ఆవిర్భవిస్తుందనేదే గుజరాత్ పల్లెలు, పట్టణాలు, నగరాలలో ఆబాలగోపాలం మాటా మంతీగా ఉన్నది మరి.
గుజరాత్ ఎన్నికల బరిలోకి ఆప్ నాటకీయంగా ప్రవేశించింది. రాష్ట్ర రాజకీయాలలోకి ఆ పార్టీ ఎంతో సందడితో వచ్చింది. సంచలనమూ సృష్టించింది. గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే గుజరాత్ ఎన్నికలు గత పాతిక సంవత్సరాలుగా ఒకే రీతిలో జరుగుతున్నాయి. వాటి ఫలితాలూ ఒకే విధంగా ఉంటున్నాయి. గుజరాత్ 11వ శాసనసభ (2002) నుంచి 14వ శాసనసభ వరకూ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీయే విజేతగా నిలిచింది. 8 నుంచి 10 శాతం ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ను వరుసగా ఓడిస్తూ వస్తోంది. ఈసారీ, అంత మెజారిటీ రాకపోయినా గుజరాత్లో బీజేపీ మళ్లీ జయపతాకను ఎగురవేయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అవును, 2022 అసెంబ్లీ ఎన్నికలలో సైతం బీజేపీయే విజయాన్ని స్వాయత్తం చేసుకునే స్థితిలో ఉన్నది. గుజరాత్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆరాట పడుతున్న ఆప్, అధికార ప్రతిపక్షాలుగా బీజేపీ– కాంగ్రెస్ల ప్రాబల్యాన్ని అంతమొందించగలదా? ఇదే, ఇప్పుడు గుజరాత్లో అందరూ చర్చించుకుంటున్న అంశం.
సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ పల్లె సీమలకు వెళ్లండి (గుజరాత్లో ఇవి సాపేక్షంగా వెనుకబడిన ప్రాంతాలు). ఎల్లెడలా కాషాయ జెండాలు మీకు దర్శనమిస్తాయి. అక్కడక్కడా కాంగ్రెస్ పార్టీ జెండాలు కూడా కనపడతాయి. అయితే మీకు ఎక్కడో ఒక చోట హఠాత్తుగా ‘చీపురు’ చిహ్నంతో ఉన్న జెండాలూ కనిపిస్తాయి. దేశ రాజకీయాలలో అరవింద్ కేజ్రీవాల్ (ఆప్ అధినేత) ప్రభవ ప్రాభవాలు అబ్బురం గొలుపుతాయి. ‘మిషన్ గుజరాత్’ ఆయన సాహసిక ఎత్తుగడ. అలాంటి రాజకీయ సాహసాలు కేజ్రీవాల్కు కొత్త కాదు. 2014లో వారణాసిలో నరేంద్ర మోదీతోనే ఆయన తలపడ్డారు. పరాజయం పాలయ్యారనేది మరో విషయం. ఆ వైఫల్యంలోనూ కేజ్రీవాల్ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. అయితే వారణాసిలో ఓటమి ఆయనను చాలా ఇబ్బందులకు లోనుచేసింది. ఎనిమిది సంవత్సరాల అనంతరం పంజాబ్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఆప్ మళ్లీ ఒక ప్రబల రాజకీయ శక్తిగా ప్రభవించింది. ఇప్పుడు గుజరాత్లో మార్పును కోరుకుంటున్న వారి మద్దతును సాధించుకోవడం ద్వారా తన జాతీయ ప్రస్థానంలో మరింత నిర్ణయాత్మకంగా పురోగమించాలని ఆప్ ఆరాటపడుతోంది.
పంజాబ్లో అధికారం కాంగ్రెస్, అకాలీదళ్ల మధ్య మారుతూ ఉండడం పరిపాటి. ఈ దృష్ట్యా గుజరాత్, పంజాబ్కు పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ బీజేపీ గత పాతికేళ్లుగా ఏ ఎన్నికలలోనూ పరాజయాన్ని చవిచూడలేదు. చివరకు మునిసిపల్ ఎన్నికలలో సైతం బీజేపీయే తిరుగులేని విజేత. గత పాతికేళ్లుగా గుజరాత్లో ఇదే కథ పునరావృతమవుతూ వస్తోంది. ఈ పశ్చిమ భారత రాష్ట్రం బీజేపీ హిందూత్వకు తొలి ప్రయోగశాల మాత్రమే కాదు. ఒక ‘హిందూ మినీ రాష్ట్ర్ాన్ని’ సృష్టించేందుకై రాజకీయాలు, మతం, పౌర సమాజాన్ని మిళితం చేసి బీజేపీ నిర్వ హించిన రాజకీయ ప్రయోగం సంపూర్ణంగా విజయవంత మైన నెలవు కూడా గుజరాతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ భూమి పుత్రుడు. ఆయన్ని ఒక నడయాడుతున్న దైవంగా ఆరాధించే గుజరాతీలు అసంఖ్యాకంగా ఉన్నారు.
అయినప్పటికీ ప్రతిపక్షాలను విస్మరించని రాష్ట్రంగా గుజరాత్ గౌరవ మన్ననలను పొందుతోంది. కాకపోతే కాంగ్రెస్ ఓట్ల వాటా ఇప్పటికీ ఇంచు మించు 40 శాతంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్కు ఓటర్ల మద్దతు పూర్తిగా అడుగంటిపోయింది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఓట్ల, సీట్ల బలం గణనీయంగా తగ్గిపోయింది. గుజరాత్లో కాంగ్రెస్ ఇంకా ఇలా క్షీణించిపోలేదు. 1985 అసెంబ్లీ ఎన్నికలలో గుజరాత్ శాసనసభలోని 182 సీట్లలో 149ని, 55 శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలుచుకున్నది. అయితే 1990 అసెంబ్లీ ఎన్నికలలో ఈ జాతీయ పార్టీ సీట్ల బలం 33కు, ఓట్ల బలం 30 శాతానికి పడిపోయింది. కారణమేమిటి? పార్టీ స్వయం కృతాపరాధాలే, సందేహం లేదు. స్వీయ వినాశక రాజకీయాలలో కాంగ్రెస్ను మించిన మరో రాజకీయ పక్షం ఏదైనా ఉన్నదా?
ఏమైతేనేం గుజరాత్లో కాంగ్రెస్ దశాబ్దాల క్రితమే అధికారాన్ని కోల్పోయింది. అయితే నాటి నుంచీ ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందుతోంది. రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్కు గల ఈ స్థానాన్ని సవాల్ చేయగల రాజకీయ పక్షమేదీ ఇంతవరకు ప్రభవించలేదు. ఈ నేపథ్యంలో ఆప్ ‘మిషన్ గుజరాత్’ అందరికీ ఆసక్తి కలిగిస్తోంది గుజరాత్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని సవాల్ చేయడంతో పాటు బీజేపీకి సహజ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థాయిని ఆప్ నిశితంగా ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకులు అయిన సూరత్ ముస్లింలను, డాంగ్స్ ఆదివాసీలను ఆకట్టుకునేందుకు ఆప్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో హిందూ ఓటర్ల సమస్యలు, మనోభావాలను విస్మరించడం లేదు.
ఆప్ వ్యూహం చిక్కులతో కూడుకున్నది. ఒక వైపు బీజేపీ కాషాయ రాజకీయాలను, అదే తరహా వ్యూహాలతో ఎదుర్కొంటున్నది. ఇందులో భాగంగా కరెన్సీ నోట్లపై లక్ష్మీ, వినాయకుడి బొమ్మలు ముద్రించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.. బిల్కిస్ బానో కేసు లాంటి వివాదాస్పద అంశాలపై ఉద్దేశపూర్వకంగా పూర్తి మౌనం వహిస్తోంది. వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా హిందూ అగ్రవర్ణాల ఓటర్లు దూరమవుతారని ఆప్ భయపడుతోంది. మరో వైపు బీజేపీపై భ్రమలు కోల్పోయిన ఓటర్లను, ముఖ్యంగా యువజనులను ఆకట్టుకునేందుకు వారికి నిరుద్యోగ భృతి మొదలైన హమీలు గుప్పిస్తోంది. ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ ఫలాలను అందుకోలేక పోయిన పేదలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామని ఆప్ హామీ ఇచ్చింది.
మరి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం అటుంచి కనీసం కాంగ్రెస్ నుంచి ప్రధాన ప్రతిపక్షం హోదా నయినా స్వాధీనం చేసుకోగలదా? 2017 అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ తరపున 29 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందరూ ఓడి పోయారు. పార్టీకి పోలయిన ఓట్లు 1 శాతం కంటే తక్కువే. ముఠాల కుమ్ములాటలు, నాయకత్వ వివాదాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పట్ల గుజరాత్ ఓటర్లలో ఇప్పటికీ గణనీయమైన సుహృద్భావం ఉన్నది. కాంగ్రెస్ ప్రజాబలం రాత్రికి రాత్రి మాయమైపోయేది ఎంత మాత్రం కాదు. 2017 ఎన్నికలలో గ్రామీణ గుజరాత్లో కాంగ్రెస్దే పై చేయిగా ఉన్నది. అయితే నగరాలు, పట్టణాలలో బీజేపీకి ఉన్న బలం వల్ల అంతిమంగా కాంగ్రెస్ పరాజిత అయింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లో ఆప్ కనిపిస్తున్నప్పటికీ, మధ్య, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో ఆ పార్టీ ఉనికి చాలా చాలా పరిమితమైనది మాత్రమే.
అయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేసేందుకు ఆప్ సంకల్పించుకుంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్లో ఇటువంటి సంకల్పం లోపించింది. బీజేపీతో తలపడేందుకు ఆ జాతీయ రాజకీయ పక్షం వెనుకాడుతోంది. 2017 నుంచి ఇరవై మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. పార్టీ కార్యకర్తల బలం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఉన్నవారు కూడా ఏ మాత్రం చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అధికారాన్ని కోల్పోయిన తరువాత కాంగ్రెస్కు నేతృత్వం వహించింది మాజీ బీజేపీ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా. దీన్ని బట్టి మోదీ యుగంలో పార్టీ శ్రేణుల నుంచే శక్తిమంతమైన నాయకులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ఎంతగా ఉపేక్షించిందో అర్థమవుతుంది. ఈ ఉపేక్షా భావం కాంగ్రెస్ను ఇప్పటికీ ప్రతికూలంగా వెంటాడుతోంది.
తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న బీజేపీ తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్కే ఎక్కువగా భయపడుతోంది. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని, ముస్లింలను బుజ్జగించే రాజకీయ పక్షమని ప్రచారం చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను బాగానే సాధించుకుంటున్నది. ఆప్ విషయం వేరు. దానికి సైద్ధాంతిక నిబద్ధతలు తక్కువ. రాజకీయ లబ్ధిని పొందడమే ముఖ్యం. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ గణనీయంగా ఓట్లు సాధించుకోవడం జరిగితే అది అనివార్యంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చడమే అవుతుంది. దీనివల్ల బీజేపీ స్వల్పకాలిక ప్రయోజనం పొందుతుంది. అయితే దీర్ఘకాలంలో గుజరాత్లోనూ, గుజరాత్ వెలుపలా రాజకీయ సమీకరణాలను మార్చివేస్తుంది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్‌్ట)