Pakistan Twist Blasts: పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో RAW ప్రమేయం.. పాక్ మంత్రి సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-10-02T17:27:46+05:30 IST

భారతదేశం విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చూడు మన దేశంపై పాక్ ఏడుస్తూనే ఉంటుంది. తన స్థానాన్ని, తన వైఫల్యాలను గ్రహించకుండా..

Pakistan Twist Blasts: పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో RAW ప్రమేయం.. పాక్ మంత్రి సంచలన ఆరోపణలు

భారతదేశం విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చూడు మన దేశంపై పాక్ ఏడుస్తూనే ఉంటుంది. తన స్థానాన్ని, తన వైఫల్యాలను గ్రహించకుండా.. భారత్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తుంటుంది. అసలు తనకు సంబంధం లేని కశ్మీర్ అంశాన్ని అవనసరంగా లేనెత్తి.. అభాసుపాలు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ దాయాది దేశం ఓ విచిత్రమైన ఆరోపణ చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఈ దేశం.. తన దేశంలో జరిగిన దాడుల్ని భారత్‌కి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. కెనడా ప్రధాని ట్రూడో బాటలోనే.. పాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత్ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేసింది.


సెప్టెంబర్ 29వ తేదీన పాక్‌లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. తొలుత బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలోని మసీదు సమీపంలో ఒక బాంబర్ పేలుడుకు పాల్పడ్డాడు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఊరేగింపు జరుగుతుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. కొన్ని గంటల తర్వాత ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని హంగూ నగరంలోని మసీదులో మరో పేలుడు జరిగింది. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 65 మంది మరణించారు. ఈ రెండు దాడులపై అక్కడి పోలీసులు విచారణ జరుపుతుండగా.. తాజాగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ రెండు దాడుల్లో భారతదేశానికి చెందిన ‘పరిశోధన & విశ్లేషణ విభాగం’ (రీసెర్చ్ అనాలసిస్ వింగ్ - RAW) ప్రమేయం ఉందంటూ బాంబ్ పేల్చాడు.

‘‘సివిల్, మిలిటరీ, ఇతర సంస్థలు సంయుక్తంగా మస్తుంగ్ ఆత్మాహుతి బాంబు దాడిలో ఇన్వాల్వ్ అయి ఉన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ రెండు దాడుల్లో RAW ప్రమేయం ఉంది’’ అంటూ సర్ఫరాజ్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇందుకు సంబంధించిన కచ్ఛితమైన సమాచారం గానీ, ఆధారాలు గానీ చూపించలేదు. ఎలాగైతే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేశాడో, అలాగే ఈ పాక్ మంత్రి సర్ఫరాజ్ తలాతోక లేని ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఆత్మాహుతి బాంబు దాడి చేసిన వ్యక్తి నుంచి డీఎన్‌ఏను విశ్లేషించడానికి పంపామని, దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులు ఇప్పటికే నివేదికను సమర్పించారని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-02T17:27:46+05:30 IST