Pakistan Defence Minister: రాత్రి 8 గంటల తర్వాత దుకాణాలు మూసేస్తే జనాభా తగ్గుతుందట!
ABN , First Publish Date - 2023-01-05T20:09:39+05:30 IST
జనాభా పెరుగుదలకు సంబంధించి పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నైలా ఇనాయత్
ఇస్లామాబాద్: జనాభా పెరుగుదలకు సంబంధించి పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నైలా ఇనాయత్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతే, క్షణాల్లోనే వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాక్ మంత్రిని ఆడేసుకుంటున్నారు.
మంత్రి ఖావాజా అసిఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎక్కడైతే మార్కెట్లు రాత్రి 8 గంటలకే మూసేస్తారో అక్కడ జనాభా పెరుగుదల తక్కువగా ఉంటుంది’’ అంటూ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్.. ‘‘కొత్త పరిశోధన ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత పిల్లలు తయారుకారు. రాత్రి 8 గంటలకే దుకాణాలు మూసేసిన దేశాల్లో జనాభా పెరగడం లేదు: రక్షణ మంత్రి’’.. అని క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అద్భుత పరిశోధన అంటూ ఎద్దేవా చేస్తుంటే.. మరికొందరు అబ్బబ్బ.. ఏం లాజిక్ అని కామెంట్ చేస్తున్నారు. కొందరు నవ్వుతున్న ఎమోజీలు, మరొకొందరు ఏడుస్తున్న ఎమోజీలను పోస్టు చేస్తున్నారు.