Chandrayaan-3: చంద్రయాన్-3 విజయంపై పాకిస్తాన్ షాకింగ్ రియాక్షన్.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ABN , First Publish Date - 2023-08-26T21:08:59+05:30 IST
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రశాంతంగా, సోదరుల్లా కలిసి ఉందామని భారత్ అభ్యర్థిస్తే.. పాక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటుంది...
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రశాంతంగా, సోదరుల్లా కలిసి ఉందామని భారత్ అభ్యర్థిస్తే.. పాక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటుంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంటుంది. మన దేశం ఎందులోనైనా విజయం సాధిస్తే చాలు.. వెంటనే విషం చిమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ.. చంద్రయాన్-3 విషయంలో మాత్రం పాక్ అలా చేయలేదు. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెస్‌పై పాక్ ప్రశంసలు కురిపిస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ ఈ ప్రాజెక్ట్ సాఫ్ట్ ల్యాండింగ్‌ని ప్రశంసించారు. ఇప్పుడు పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారి ముంతాజ్ జహ్రా బలోచ్ సైతం చంద్రయాన్ -3 చారిత్రక విజయంపై పొగడ్తల వర్షం కురిపించారు.
సాంకేతిక పరంగా భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇది నిజంగా ఒక గొప్ప విజయమని ముంతాజ్ పేర్కొన్నారు. ఈ విజయానికి ఇస్రో శాస్త్రవేత్తలు అర్హులని చెప్పిన ఆమె.. వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ కూటమిలో చేరేందుకు పాకిస్థాన్ అధికారికంగా అభ్యర్థన చేయలేదన్నారు. బ్రిక్స్‌లో జరిగిన తాజా పరిస్థితులను పాక్ పరిశీలిస్తోందని.. ఇందులో భాగస్వామ్యం అయ్యే విషయం గురించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బ్రిక్స్ విస్తరణలో పలు దేశాలను ఆహ్వానించడం తాము అంగీకరిస్తున్నామన్నా ముంతాజ్.. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకెళ్లడాన్ని స్వాగతిస్తామన్నారు. కాగా.. బ్రిక్స్ కూటమిలో ఇప్పటివరకు ఐదు దేశాలు (భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) ఉండగా.. కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యూఏఈ, సౌదీ అరేబియాలు ఈ కూటమిలో చేరనున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆ దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుంది.
ఇదిలావుండగా.. తొలుత చంద్రయాన్-3 విజయాన్ని పాకిస్తాన్ అధికారికంగా పట్టించుకోలేదు. కానీ.. బుధవారం మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై ఒక వార్తా పత్రిక మొదటి పేజీ కవరేజీ ఇచ్చింది. ‘ఇండియాస్ స్పేస్ క్వెస్ట్’ శీర్షికతో చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని చారిత్రాత్మకంగా పేర్కొంది. ధనిక దేశాలు ఎక్కువ ఖర్చుతో ఇలాంటి ఘనతలు నమోదు చేస్తే.. భారత్ మాత్రం తక్కువ బడ్జెట్‌లోనే చరిత్ర సృష్టించిందని అందులో తెలిపింది. ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అంకితభావంతో, నాణ్యతగా పని చేయడం వల్లే.. ఈ అంతరిక్ష కార్యక్రమం విజయవంతం అయ్యిందని ఆ పత్రిక తన కథనంలో చెప్పుకొచ్చింది. భారత్ సాధించిన ఈ విజయం నుంచి పాకిస్తాన్ ఎంతో నేర్చుకోవాలని చెప్పింది. నిజానికి.. భారత్ కంటే ముందే పాకిస్తాన్ స్పేస్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిందని, కానీ చెప్పుకోదగ్గ విజయాల్ని మాత్రం నమోదు చేయలేకపోయిందని ఆ పత్రిక వెల్లడించింది.