India vs Pakistan: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్తాన్.. చట్టవిరుద్ధ చర్యలు తీసుకుంటోందట!

ABN , First Publish Date - 2023-09-20T17:55:28+05:30 IST

దాయాది దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. ఏదో విషయంలో భారత్‌ను నిందించడమే పనిగా పాక్ పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి...

India vs Pakistan: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్తాన్.. చట్టవిరుద్ధ చర్యలు తీసుకుంటోందట!

దాయాది దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. ఏదో విషయంలో భారత్‌ను నిందించడమే పనిగా పాక్ పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ భారత్‌పై విషం చిమ్మారు. భారత్ పట్ల తమ దేశం సానుకూల చర్యలు తీసుకుంటుంటే.. భారత్ నుంచి మాత్రం ప్రతీసారి ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో కూడా చట్టవిరుద్ధ చర్యలు తీసుకుంటోందంటూ వ్యాఖ్యానించారు.

న్యూయార్క్‌లో జరిగిన ఆసియా సొసైటీ సదస్సులో జిలానీ మాట్లాడుతూ.. భారత్‌తో శాంతియుత, సహకార పొరుగు సంబంధాలను పాకిస్తాన్ కోరుకుంటోందని అన్నారు. భారత సిక్కు కమ్యూనిటీకి వీసా రహిత ప్రయాణానికి కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడంతో పాటు అనేక సానుకూల కార్యక్రమాలనను చేపట్టిందని తెలిపారు. కానీ.. భారత్ నుంచే ప్రతికూల స్పందన వస్తోందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో చట్ట వ్యతిరేక చర్యలకు భారత్ పాల్పడుతోందని.. భారత భద్రతా దళాల చేతుల్లో అమాయక కశ్మీరులపై ‘మానవ హక్కుల ఉల్లంఘన’ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయని పేర్కొన్నారు.


ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్‌కు అత్యధిక వాటా ఉందని.. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంతో పాక్‌కి నేరుగా సంబంధం ఉందని జిలానీ స్పష్టం చేశారు. తాము అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్‌కు సహకరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దాదాపు 40 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులకు తమ దేశంలో ఆతిథ్యం ఇస్తున్నామని.. వీళ్లు దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమ దేశంలోనే ఉన్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ శరణార్థులు తిరిగి తమ దేశానికి వెళ్లి.. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలని.. ఆఫ్ఘాన్ అధికారులతో పాటు అంతర్జాతీయ దేశాలు కూడా కోరుకుంటున్నాయని జిలానీ చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. పాకిస్తాన్‌లో జాతీయ అసెంబ్లీ రద్దయ్యాక అన్వర్ ఉల్ హక్ కాకర్ ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆగస్టు 14వ తేదీన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కూడా భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. ముస్లిములను భారత్ వేధింపులకు గురి చేస్తోందంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయితే.. పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై జరిగిన హింసపై ఆయన మౌనం పాటించారు.

Updated Date - 2023-09-20T17:55:28+05:30 IST