Share News

Vladimir Putin: ఆలు లేదు చూలు లేదు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్‌పై రష్యా క్లారిటీ

ABN , First Publish Date - 2023-10-24T18:32:43+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. ఆయన ఆరోగ్యంగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన కొన్నాళ్ల తర్వాత పుతిన్ అనారోగ్యానికి...

Vladimir Putin: ఆలు లేదు చూలు లేదు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్‌పై రష్యా క్లారిటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. ఆయన ఆరోగ్యంగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన కొన్నాళ్ల తర్వాత పుతిన్ అనారోగ్యానికి గురయ్యారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు, తన పోలికలు కలిగి ఉన్న డూప్‌తో పరిస్థితిని మెయింటెయిన్ చేశారంటూ పుకార్లు షికారు చేశాయి.


ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తలే చక్కర్లు కొట్టాయి. ఆదివారం రాత్రి పుతిన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయన పడకగదిలో నేలపై పడి ఉండటాన్ని ఆయన భద్రతా అధికారి గుర్తించారని వార్తలొచ్చాయి. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధ్యక్ష భవని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. వ్లాదిమిర్ పుతిన్ చాలా ఆరోగ్యంగా, బలంగా ఉన్నారని.. ఆయన అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్రెమ్లిక్ పేర్కొంది. అలాగే.. పుతిన్ ‘బాడీ డబుల్స్’ (డూప్)ను ఉపయోగిస్తారన్న వార్తల్ని కూడా ఖండించింది. తొలుత ఈ బాడీ డబుల్ వార్త చూసి ఫక్కున నవ్వేసిన క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్.. ఇది అతిపెద్ద అబద్ధమని కొట్టిపారేశారు.

2020లోనూ రష్యా అధ్యక్షుడు బాడీ డబుల్స్‌ని వినియోగిస్తున్నారని పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని స్వయంగా పుతిన్ ఖండించారు. తనకు డూప్ ఏమాత్రం అవసరం లేదని, తనపై వస్తున్న ఈ పుకార్లు అవాస్తవం అని తెలిపారు. ఇక 2022లో పుతిన్ ఏకంగా క్యాన్సర్ బారిన పడ్డారని, ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారని కొన్ని నివేదికలు సూచించాయి. బహిరంగ ప్రదర్శనలలో పుతిన్ కాస్త అస్థిరంగా, ఉబ్బినట్టుగా కనిపించడంతో.. ఈ పుకార్లు షికారు చేశాయి. అయితే.. అవన్నీ అసత్య ప్రచారాలంటూ క్రెమ్లిన్ ఖండించింది.

Updated Date - 2023-10-24T18:32:43+05:30 IST