Vladimir Putin: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాపై వ్లాదిమిర్ పుతిన్ ‘బాంబ్’.. ఆ వైఫల్యమే కారణం!
ABN , First Publish Date - 2023-10-11T18:15:19+05:30 IST
అమెరికా, రష్యా బద్ధ శత్రువులన్న సంగతి అందరికీ తెలుసు. ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఒకరినొకరు నిందించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు విడిచిపెట్టరు. ప్రతీ విషయంలోనూ..
అమెరికా, రష్యా బద్ధ శత్రువులన్న సంగతి అందరికీ తెలుసు. ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఒకరినొకరు నిందించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు విడిచిపెట్టరు. ప్రతీ విషయంలోనూ తమదే పైచేయి ఉండాలన్నదే ఈ రెండు దేశాల కోరిక. అందుకే.. ఒకరిపై మరొకరు విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటుంటాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంలో.. రష్యా, అమెరికా మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదం నెలకొంది. ఉక్రెయిన్‌కి అమెరికా మద్దతు ఇస్తుండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే.. అమెరికాపై విమర్శలు గుప్పించే అవకాశం దొరికినప్పుడల్లా వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఆ ఛాన్స్ మళ్లీ రావడంతో ఆయన ఆ అగ్రరాజ్యంపై నిప్పులు చెరిగారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలే కారణమని వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను అమెరికా విస్మరించిందని విమర్శించారు. ఈ యుద్ధానికి తెరదించేలా, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతి నెలకొనేలా తాము ఇరుపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సమస్యని పరిష్కరించేలా రష్యా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు ఇరాక్ ప్రధానమంత్రి మహ్మద్ షియా అల్-సుడానీని కలిసినప్పుడు కూడా.. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో అమెరికా విధానం వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ అని, తన అభిప్రాయంతో ప్రతిఒక్కరూ ఏకీభవిస్తారని అన్నారు.
మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పేందుకు గాను అంతర్జాతీయ ప్రయత్నాలపై గుత్తాధిపత్యం సాధించాలని అమెరికా ప్రయత్నించిందని పుతిన్ చెప్పారు. ఇరువైపులా రాజీ కుదర్చడంలో యునైటెడ్ స్టేట్స్ విఫలమైందని.. పాలస్తీనాకు ఆమోదయోగ్యమైన రాజీలను కుదర్చడంలో వాషింగ్టన్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనియన్ల ప్రయోజనాలను, స్వతంత్ర పాలస్తీనా రాజ్య ఆవశ్యకతను అమెరికా పూర్తిగా విస్మరించిందన్నారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లకు తూర్పు జెరూసలేం రాజధానిగా ఉండాలని పాలస్తీనియన్లు కోరుకుంటున్నారని.. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిందంతా పాలస్తీనా భూభాగమేనని చెప్పుకొచ్చారు. అటు.. క్రెమ్లిన్ (రష్యా) సైతం తాము పాలస్తీనా, ఇజ్రాయెల్‌తో టచ్‌లో ఉన్నామని.. వారి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇంతకుముందే ప్రకటించింది.