Share News

China Population: చైనాలో తగ్గుతున్న జననాల రేటు.. షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-10-31T18:06:49+05:30 IST

గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోగా, వృద్ధాప్య రేటు విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి గానీ, పిల్లల్ని కనడానికి గానీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. .

China Population: చైనాలో తగ్గుతున్న జననాల రేటు.. షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే?

గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోగా, వృద్ధాప్య రేటు విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి గానీ, పిల్లల్ని కనడానికి గానీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే.. అక్కడ సంతానోత్పత్తి రేటు అత్యల్ప స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం జననాల రేటు పెంచేందుకు ఎన్నో పథకాల్ని తీసుకొచ్చింది. పెళ్ళిళ్లు, సంతానోత్పత్తిపై యువతలో ఆసక్తి పెరిగేలా.. ఎన్నో బంపరాఫర్లను ప్రకటిస్తోంది. అయినా సరే.. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఈ తరుణంలో.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన కీలక వ్యాఖ్యలు అక్కడ చర్చనీయాంశంగా మారాయి.


ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘మహిళల ఎదుగుదలను కేవలం వారి కార్యాలయంలోని పనితీరును బట్టి అంచనా వేయకూడదు. కుటుంబ సామరస్యం, సామాజిక సామరస్యం, దేశాభివృద్ధిని బట్టి అంచనా వేయాలి. వారి పాత్ర దేశ పురోగతిలో ఎంతో కీలకమైనది’’ అని పేర్కొన్నారు. నేటి యువత పెళ్లి, పిల్లలను కనే దిశగా ఆలోచనలను బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. వివాహం, శిశుజననం పెంపొందించడం కోసం కొత్త ఒరవడిని నెలకొల్పాలని అన్నారు. ఈ విధంగా జిన్‌పిన్ చేసిన వ్యాఖ్యలు చైనాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్వయంగా దేశాధ్యక్షుడే పరోక్షంగా శిశుజననాల రేటుపై ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఈ వ్యవహారంపై అక్కడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. చైల్డ్ కేర్ ఖర్చులు పెరిగిపోవడం, వృత్తిపరమైన ఇబ్బందులు, లింగ వివక్ష, వివాహం చేసుకోకూడదనే ఆలోచనలు వంటి అంశాలు.. చాలా మంది చైనీస్ యువతులను పిల్లలను కనకుండా నిరోధించాయని అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారిగా గతేడాది చైనా జనాభా తగ్గడం గమనార్హం. ఈ సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలపై నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ అంశంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఈ ఏడాది మే నెలలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంతానోత్పత్తి రేటులో స్థిరత్వం తీసుకురావడానికి అన్ని విధాలుగా ఆ దేశం ప్రయత్నిస్తోంది.

Updated Date - 2023-10-31T18:06:49+05:30 IST