ఆడపిల్ల పుడితే 2 లక్షల పొదుపు బాండ్
ABN , First Publish Date - 2023-11-17T04:43:29+05:30 IST
రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. రాష్ట్ర ప్రజలపై హామీలు గుప్పించింది.
రాజస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. రాష్ట్ర ప్రజలపై హామీలు గుప్పించింది. ‘సంకల్ప్ పత్ర’ పేరిట పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం మేనిఫెస్టో విడుదల చేశారు. తమకు అధికారమిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.450 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆడపిల్ల పుడితే ఆ చిన్నారి పేరిట రూ.2 లక్షలు పొదుపు బాండ్ రూపంలో జమచేస్తామని, పీఎం మాతృ వందన్ కింద అందించే సహాయాన్ని రూ.5 వేల నుంచి రూ.8 వేలకు పెంచుతామని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి రూ.6,000 వేల చొప్పున అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.12,000 వేలకు పెంచుతామని, గోధుమలను క్వింటా రూ. 2,700ల చొప్పున కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈనెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.