Northern Gaza : ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..
ABN , First Publish Date - 2023-10-15T03:44:20+05:30 IST
ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దక్షిణ ప్రాంతాల వైపు
ఉత్తర గాజాను వీడిన 4 లక్షల మంది పాలస్తీనీయులు..
భూతల యుద్ధానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ సైన్యం
కొనసాగుతున్న భారతీయుల తరలింపు
జెరూసలేం, రియాద్, అక్టోబరు 14: ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దక్షిణ ప్రాంతాల వైపు తరలిపోతున్నారు. 24 గంటల్లో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించటంతో.. శుక్ర, శనివారాల్లో దాదాపు నాలుగు లక్షల మంది పౌరులు నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు, గాజా సమీపంలో మోహరించిన తమ దేశ సైనిక బలగాల్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం సందర్శించారు. తదుపరి దశకు మీరు సిద్ధమే కదా అని సైనికులను ఆయన ప్రశ్నించారు. వారు సిద్ధమేనని చెప్పారు. గాజాలో భూతల యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. గాజాలో ‘సురక్షిత ప్రాంతాలను’ ఏర్పాటు చేసి, అక్కడికి పౌరులను తరలించే అంశాన్ని కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోంది. దీనిపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గల్ఫ్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చించారు. కాగా, ఈ నెల ఏడున తమ దేశంపై జరిగిన దాడులకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రవాదులు మెరాద్ అబూ మెరాద్, అలీ ఖ్వాదీలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల గాజాలో 1300కుపైగా భవానాలు నేలమట్టమయ్యాయని, 55 వేల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఓసీహెచ్‌ఏ వెల్లడించింది. ఇప్పటి వరకూ 2,215 మంది పాలస్తీనీయులు మరణించారని, 8,714 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు 235 మంది భారత్‌కు బయల్దేరగా, శనివారం మరో విమానంలో 197 మంది బయల్దేరారని విదేశాంగమంత్రి జైశంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
హిజబుల్లా దిగితే భూకంపమే: ఇరాన్
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపకపోతే పశ్చిమాసియా అంతటా హింసాకాండ విస్తరిస్తుందని ఇరాన్ విదేశాంగమంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లాహీన్ హెచ్చరించారు. లెబనాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి మిలిటెంట్ గ్రూపు హిజబుల్లా నేతలను కలుసుకున్నారు. హిజబుల్లా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్‌లో భూంకంపమేనని హెచ్చరించారు. దాదాపు లక్షన్నర రాకెట్లు, క్షిపణులను కలిగి ఉన్న హిజబుల్లాతో తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. తాము పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని, సరైన సమయంలో యుద్ధంలోకి దిగుతామని హిజబుల్లా ఉప అధిపతి నాయిమ్ ఖాసిమ్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని ఉద్ఘాటిస్తూనే, తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.
పశ్చిమాసియా వ్యాప్తంగా నిరసనలు
గాజా మీద ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పశ్చిమాసియా వ్యాప్తంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా జోర్డాన్, బహ్రెయిన్‌లలో ప్రజలు భారీఎత్తున ఆందోళనలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ దాడిని మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరంగా అభివర్ణిస్తూ, తక్షణం ఆపాలని ఐరాసలో పాలస్తీనా ప్రతినిధి ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్‌సకు విజ్ఞప్తి చేశారు.
చిన్నారులను లాలించిన ఉగ్రవాదులు
ఏకే 47 తుపాకులు భుజాన వేసుకున్న హమాస్ ఉగ్రవాదులు చిన్నారులను లాలిస్తూ బుజ్జగించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న చిన్న పిల్లలను భుజాన వేసుకొని కొందరు లాలిస్తుండగా, ఓ వ్యక్తి ఒక పాప షూ లేసు కడుతుండటం ఈ వీడియోలో కనిపించింది. మరో మిలిటెంట్ ఓ చిన్నారికి తాగటానికి నీళ్లిస్తూ.. బిస్మిల్లా అని చెప్పాలని సూచించాడు. ఆ చిన్నారి కూడా బిస్మిల్లా అని నీళ్లు తాగింది.
18 వరకు విమానాలు బంద్‌న్యూఢిల్లీ, అక్టోబరు 14 : ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న పోరు నేపథ్యంలో ప్రకటించిన విమాన సర్వీసుల రద్దును ఎయిరిండియా పొడిగించింది. అక్టోబరు 18 వరకు ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరం టెల్ అవీవ్‌కు తమ విమానాల రాకపోకలు ఉండవని శనివారం ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు బుధ, శుక్రవారాలు మినహా వారానికి ఐదు ఎయిరిండియా విమానాలు ఉన్నాయి. యుద్ధ నేపథ్యంలో ఈ సర్వీసులను తొలుత అక్టోబరు 14 వరకు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్నే ఇప్పుడు పొడిగించారు. అయితే, షెడ్యూల్ సర్వీసులు తాత్కాలికంగా ఉండవని, అవసరమైతే ఇజ్రాయెల్‌కు చార్టెర్ విమాన సర్వీసులు నడుపుతామని ఎయిరిండియా పేర్కొంది.