Tunnel Workers : మళ్లీ మన లోకంలోకి..!
ABN , First Publish Date - 2023-11-23T05:02:05+05:30 IST
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది గురువారం బయటకు వచ్చే అవకాశం ఉంది. చార్‌ధామ్ రోడ్
నేడు బయటి ప్రపంచంలోకి 41 మంది టన్నెల్ కూలీలు
ఉత్తరకాశీ, నవంబరు 22: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది గురువారం బయటకు వచ్చే అవకాశం ఉంది. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌లో కొంతభాగం ఈ నెల 12న తెల్లవారుజామున కూలిపోయింది. దీంతో 57 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. అప్పటినుంచి సహాయక చర్యలను చేపట్టారు. ఆరు అంగుళాల వ్యాసం గల పైప్‌లైన్‌తో మంగళవారం ఆహారం పంపారు. కాగా, డ్రిల్లింగ్ కోసం తెప్పించిన అమెరికన్ ఆగర్ యంత్రంతో బుధవారం సాయంత్రం నాటికి 45 మీటర్ల వరకు శిథిలాలు తొలగించారు. ఇంకా 12 మీటర్ల డ్రిల్లింగ్ రాత్రి వరకు పూర్తవనుంది. పైప్‌ల అసెబ్లింగ్ పూర్తవగానే శుభ వార్త వింటామని పీఎంవో మాజీ సలహాదారు భాస్కర్ కుల్బే ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఇనుప పైప్‌లను శిథిల్లాలోకి పంపుతున్నారు. బుధవారం రాత్రి నాటికి 39 మీటర్ల వరకు పంపారు. ఎన్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 21 మంది రెస్య్కూ సిబ్బంది ఆక్సిజన్ మాస్కులతో టన్నెల్‌లోకి వెళ్లారు. కాగా, డ్రిల్లింగ్‌లో 40-50 మీటర్ల మధ్య దూరమే అత్యంత కీలకమని జాతీయ రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. కూలీలు బయటకు వచ్చిన వెంటనే చికిత్స చేసేందుకు 15 మంది వైద్యులను సిల్క్యారా వద్ద ఉంచారు. అంబులెన్స్‌లు, హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్ ఘటన నేపథ్యంలో దేశంలో నిర్మాణంలో ఉన్న 29 సొరంగాలనూ తనిఖీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 79 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో నాణ్యతా ప్రమాణాలపై సేఫ్టీ ఆడిట్ చేపట్టనున్నారు.