Pakistan : పాకిస్థాన్‌లో భారీ భూకంపం
ABN , First Publish Date - 2023-01-29T14:44:31+05:30 IST
పాకిస్థాన్‌ను శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. రాజధాని నగరం ఇస్లామాబాద్‌తోపాటు పంజాబ్ ప్రావిన్స్‌లోని
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ను శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. రాజధాని నగరం ఇస్లామాబాద్‌తోపాటు పంజాబ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ భూకంపం ధాటికి కదిలిపోయాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. 150 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ ప్రకటించింది. తజకిస్థాన్ సమీపంలో దీని కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం 1.24 గంటలకు సంభవించిన ఈ భూకంపం ప్రభావం రావల్పిండి, ముర్రీ, ఖైబర్ పక్తూన్‌ఖ్వాలలో కూడా కనిపించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం గురించి సమాచారం రాలేదని పాకిస్థాన్ మీడియా తెలిపింది. భూమి కంపిస్తున్నట్లు గుర్తించిన ప్రజలు భయాందోళనలతో, కల్మా-ఈ-తయ్యబ చదువుతూ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలిపింది. ఈ భూకంపం ప్రభావం ఇరాన్, భారత దేశం, ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 5న ఇస్లామాబాద్, లాహోర్, పంజాబ్, ఖైబర్ పక్తూన్‌ఖ్వాలలో 5.8 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే.