BJP : బీజేపీ జాబితాలో 73 కొత్త ముఖాలు
ABN , First Publish Date - 2023-04-19T03:41:38+05:30 IST
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పెద్దలు సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. ఏకంగా 73 మంది కొత్త వారికి టికెట్లు కేటాయించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక పార్టీ జాతీయ ..
చక్రం తిప్పిన సంతోష్, ప్రహ్లాద్ జోషి
యడ్డి హవాకు గండి కొట్టే వ్యూహం
బెంగళూరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పెద్దలు సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. ఏకంగా 73 మంది కొత్త వారికి టికెట్లు కేటాయించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రహ్లాద్ జోషిల మాస్టర్ మైండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌తోపాటు పలువురు అసంతుష్ట నేతలు వీరినే టార్గెట్ చేస్తుండడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా లింగాయత్ ఓట్లతోనే మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తూ వచ్చారు. లింగాయత్‌ల ప్రాబల్యాన్ని బీజేపీలో క్రమేపీ తగ్గించేందుకు, పదే పదే యడియూరప్పపైనే ఆధారపడకుండా రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకే ఇలాంటి ఫార్ములా అవసరమని బీఎల్ సంతోష్ చేసిన సూచనకు పార్టీ అధిష్ఠానం సైతం ఆమోదముద్ర వేసిందని, ఈ క్రమంలోనే 73 మంది కొత్తవారికి టికెట్లు దక్కి ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నడ్డా రాక.. అసంతృప్తుల బుజ్జగింపు
కర్ణాటకలో ఇద్దరు ప్రముఖ లింగాయత్ నేతలు బీజేపీకి దూరం కావడంతో ఉలిక్కిపడ్డ పార్టీ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంగళవారం హుబ్బళ్లికి చేరుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. లింగాయత్ నేతలతో సమావేశమయ్యారు. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే లింగాయత్ నేత ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. ఇదిలా ఉండగా, తనకు టికెట్ రాకపోవడానికి బీఎల్ సంతోష్ కారణమని జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. హుబ్బళ్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎల్ సంతోష్ కారణంగానే బీజేపీ సర్వనాశనం అవుతోందని అన్నారు.
అధికారం కాంగ్రెస్‌దే: లోక్ పోల్
‘లోక్ పోల్‘ సంస్థ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన ముందస్తు సర్వేలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించనుందని తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ బాగా బలపడినట్లు తేలిందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాంగ్రె్‌సకు 128 నుంచి 131 స్థానాలు, బీజేపీకి 66 నుంచి 69 స్థానాలు, జేడీఎ్‌సకు 21 నుంచి 25 వరకు వస్తాయని తెలిపింది.