Railway Employees:వేతన సవరణపై ప్రధాని మోదీకి రైల్వే ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే?
ABN , First Publish Date - 2023-11-01T21:08:27+05:30 IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు(Central Pay Commission) సవరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాసింది. 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వేతన సవరణ చేయలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు(Central Pay Commission) సవరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాసింది. 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వేతన సవరణ చేయలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 1, 2016 నుండి 7వ కేంద్ర వేతన సంఘం (CPC) సిఫార్సును అమలు చేసి, కనీస వేతనాన్ని రూ. 18వేలుగా నిర్ణయించారు. సవరించిన వేతన విధానం అమలులోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా వేతన సవరణ, 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదని ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య లేఖలో పేర్కొన్నారు. తమ డిమాండ్‌కు మద్దతుగా, ఫెడరేషన్ 7వ CPC సిఫార్సులలో ఒకదానిని ప్రధాని దృష్టికి తీసుకువచ్చింది.
సవరణకు 10 సంవత్సరాలపాటు ఎదురు చూడకుండా.. కాలానుగుణంగా మార్పులు చేస్తే ఉద్యోగులకు మంచి జరుగుతుందని ఆ సిఫార్సులో ఉంది. సిమ్లాలోని లేబర్ బ్యూరో క్రమం తప్పకుండా వస్తువుల ధరలను బట్టి వేతన సవరణ చేస్తుందని అదే విధానాన్ని ఆచరించవచ్చిని సూచించింది. ఫెడరేషన్ వివరాల ప్రకారం.., 2016తో పోల్చితే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. దీని వలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం, సవరించిన వేతనాన్ని సమానంగా అందించాలని అందులో ఉంది. "డా. అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం.. వివిధ వస్తువుల ధరల ఆధారంగా, జులై 1, 2023 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ.32,500 కంటే తక్కువ ఉండరాదు. అయితే ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.18,000 కి 46% డియర్‌నెస్ అలవెన్స్‌ని జోడించిన తర్వాత కూడా ఉద్యోగి కనీస వేతనం చాలా తక్కువ అని లేఖలో పేర్కొన్నారు. "కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణం, 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కనీస వేతన సవరణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. వేతన సవరణ జరిగితే లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు లబ్ధి జరగనుంది.