Ryanair airlines : టిక్కెట్ అడిగారని పసిబిడ్డను విమానాశ్రయంలో వదిలేసిన జంట
ABN , First Publish Date - 2023-02-02T19:25:53+05:30 IST
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఓ జంట అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. తమ పసిబిడ్డకు టిక్కెట్ తీసుకోకుండా
టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) : ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఓ జంట అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. తమ పసిబిడ్డకు టిక్కెట్ తీసుకోకుండా, ఆలస్యంగా విమానాశ్రయానికి వచ్చిన ఆ దంపతులు విమానాశ్రయం చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఆ బిడ్డను వదిలేసి, వారిద్దరూ విమానం ఎక్కిపోబోయారు. దీనిని గమనించిన విమానాశ్రయం సిబ్బంది వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు వారిని గుర్తించి, ఆ బిడ్డను తిరిగి వారికి అప్పగించారు.
ఈ దంపతులు రియాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఉన్న బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరు ఇక్కడి నుంచి బెల్జియంలోని బ్రసెల్స్ వెళ్ళవలసి ఉంది. ఈ విమానం చెక్-ఇన్ క్లోజ్ అయిన తర్వాత వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికి ఆ బిడ్డ కోసం టిక్కెట్‌ను కొనలేదు. దీంతో ఆ గేటు దగ్గరే ఆ బిడ్డను వదిలేసి, దంపతులిద్దరూ సెక్యూరిటీ చెకింగ్ కోసం పరుగు పరుగున వెళ్లారు. ఆ తర్వాత బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ బిడ్డను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఈ దంపతులిద్దరినీ పట్టుకుని, విమానం ఎక్కకుండా ఆపి, ఆ బిడ్డను వారికి అప్పగించారు.
టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటపుడు బాలల కోసం టిక్కెట్ తీసుకోవచ్చు. బిడ్డను పెద్దలు తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటే, 27 డాలర్లు వసూలు చేస్తారు. ప్రత్యేకంగా సీటు కావాలంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.