దళిత మహిళను కొట్టి.. దుస్తులు విప్పి.. నోట్లో మూత్రం పోయించి
ABN , First Publish Date - 2023-09-26T01:42:52+05:30 IST
బిహార్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని..
అప్పునకు అదనపు వడ్డీ ఇవ్వలేదని ఘోరం.. బిహార్‌లో ఘటన
పట్నా, సెప్టెంబరు 25: బిహార్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని ఓ దళిత మహిళపై దాడిచేసి ఆమె దుస్తులు విప్పి నోట్లో మూత్రం పోయించి దారుణంగా హింసించాడు ఓ వ్యక్తి. పట్నా జిల్లా మోసిన్‌పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త స్థానికంగా పలుకుబడి కలిగిన ప్రమోద్‌సింగ్ అనే వ్యక్తి దగ్గర రూ. 1500లు అప్పు తీసుకున్నాడు. దానికైన వడ్డీతో సహా తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ కోసం ప్రమోద్‌సింగ్ డిమాండ్ చేశాడు. దానికి వారు అంగీకరించలేదు. దాంతో ఆ దంపతులపై కోపం పెంచుకున్న ప్రమోద్‌సింగ్ గతవారం సదరు మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. భయపడిన ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌సింగ్ అదేరోజు రాత్రి తన అనుచరులతో బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో దారుణంగా కొట్టించాడు. అంతటితో సరిపెట్టకుండా తన కొడుకు అన్షుసింగ్ చేత మహిళ నోట్లో మూత్రం పోయించాడు. తప్పించుకున్న ఆ మహిళ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితులు ప్రమోద్‌సింగ్ అతని కుమారుడు అన్షుసింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు