Metro Pillar: పిల్లలను నర్సరీ స్కూల్‌లో దించేందుకు స్కూటీపై వెళుతుండగా మెట్రో పిల్లర్ మీద పడి..
ABN , First Publish Date - 2023-01-10T14:22:19+05:30 IST
కర్ణాటక (Karnataka) రాజధాని నగరం బెంగళూరులో (Bangalore) విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి రోడ్డు మీద స్కూటీపై..
బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని నగరం బెంగళూరులో (Bangalore) విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి (Metro Pillar Collapse) రోడ్డు మీద స్కూటీపై వెళుతున్న ఒక ఫ్యామిలీపై పడింది. ఈ ఘటనలో ఒక మహిళకు, వారి ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ, ఆమె రెండేళ్ల పసి పిల్లాడు చనిపోయారు. మరో చిన్నారి గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. చనిపోయిన ఆ వివాహిత పేరు తేజస్విని (28), బాబు పేరు విహాన్‌గా (2) తెలిసింది. బెంగళూరులోని నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
కల్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీఆర్ లే-అవుట్ వెళ్లే రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్వే పిల్లర్ మంగళవారం ఉదయం 10.30 సమయంలో కుప్పకూలింది. అయితే.. అదే సమయంలో తేజస్విని అనే వివాహిత తన ఇద్దరు పిల్లలను నర్సరీ స్కూల్‌లో దింపి రావడానికి స్కూటీపై వెళుతోంది. దురదృష్టవశాత్తూ ఆ పిల్లర్ వీరిపై పడింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో విషాదం నింపింది. తేజస్విని భర్త లోహిత్ కుమార్ బెంగళూరులోని టెక్ పార్క్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నగవర ప్రాంతంలో ఈ కుటుంబం నివాసం ఉండేది. ఇంత జరిగినా.. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.