Jodo Yatra: జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

ABN , First Publish Date - 2023-01-28T03:36:49+05:30 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రకు శుక్రవారం తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కశ్మీర్‌లోయకు ముఖద్వారమైన ఖాజీగుండ్‌ ప్రాంతంలో తీవ్రమైన భద్రతా లోపాలతో పాటు భారీ జనసమూహాన్ని నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Jodo Yatra: జోడో యాత్రకు  తాత్కాలిక బ్రేక్‌

కనిపించకుండాపోయిన పోలీసులు

కుప్పకూలిన భద్రతా ఏర్పాట్లు: రాహుల్‌

జనసమూహాన్ని నియంత్రించడంలో

యంత్రాంగం ఘోర వైఫల్యం: కాంగ్రెస్‌

Untitled-15.jpg

ఖాజీగుండ్‌, జనవరి 27: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రకు శుక్రవారం తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కశ్మీర్‌లోయకు ముఖద్వారమైన ఖాజీగుండ్‌ ప్రాంతంలో తీవ్రమైన భద్రతా లోపాలతో పాటు భారీ జనసమూహాన్ని నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీంతో తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించాల్సిన వచ్చిందని రాహుల్‌ సైతం వెల్లడించారు. ‘‘దురదృష్టవశాత్తు పోలీసుల భద్రతా ఏర్పాట్లు పూర్తిగా కుప్పకూలడంతో ఈరోజు నడకను రద్దు చేసుకోవాల్సి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. జనసమూహాన్ని అదుపు చేయాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. యాత్రకు భద్రత కల్పించడం జమ్ముకశ్మీర్‌ యంత్రాంగం బాధ్యత అని, యాత్రలో మిగిలిన రోజులకు తగిన భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్‌ చెప్పారు. బనిహాల్‌ టన్నెల్‌ దాటి ఖాజీకుండ్‌ చేరుకున్న రాహుల్‌... షెడ్యూల్‌ ప్రకారం దక్షిణ కశ్మీర్‌లోని వెస్సూ వైపు యాత్ర సాగించారు. కానీ అదే సమయంలో భద్రతా వలయాన్ని పర్యవేక్షించాల్సిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు మాయమైనట్లు కాంగ్రెస్‌ శ్రేణులు ఆరోపించాయి. వాస్తవానికి శుక్రవారం రాహుల్‌ 11 కిలోమీటర్లు నడవాలని షెడ్యూల్‌ నిర్ణయించగా కేవలం 500 మీటర్ల నడక మాత్రమే సాధ్యపడిందని తెలిపాయి.

2public.jpg

కాంగ్రెస్‌ నేతల మండిపాటు

రాహుల్‌ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో జమ్ముకశ్మీర్‌ అధికారులు విఫలమయ్యారని ఏఐసీసీ ఇన్‌చార్జి రజనీ పాటిల్‌ ఓ ట్వీట్‌లో మండిపడ్డారు. జోడో యాత్రలో భద్రతా లోపాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ‘‘డి-ఏరియా నుంచి భద్రతా సిబ్బందిని అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం వల్ల జోడో యాత్రలో తీవ్రమైన భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇలా చేయమని ఆదేశించింది ఎవరు?’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రశ్నించారు. భారత్‌ ఇప్పటికే ఇందిర, రాజీవ్‌ను కోల్పోయిందని, భద్రత అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ హితవు పలికారు.

భద్రతా లోపాలు లేవు: ఉన్నతాధికారులు

భారత్‌ జోడో యాత్రలో ఎలాంటి భద్రతా లోపం లేదని జమ్ముకశ్మీర్‌ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బనిహాల్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. జోడో యాత్రకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని అడిషనల్‌ డీజీపీ విజయ్‌కుమార్‌ చెప్పారు.

జోడో యాత్రలో ఒమర్‌ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా శుక్రవారం జోడో యాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన రాహుల్‌తో కలసి దాదాపు 3కిలోమీటర్లు నడిచారు. 7 డిగ్రీల చలి వాతావరణంలో సైతం ఇద్దరు నేతలు తెల్లటి టీషర్ట్‌లు ధరించారు. ఈ సందర్భంగా ఒమర్‌ మీడియాతో మాట్లాడుతూ, జోడో యాత్ర లక్ష్యం రాహుల్‌ ప్రతిష్ఠను పెంచడం కాదని, దేశ పరిస్థితిని మెరుగుపర్చడమేనని వ్యాఖ్యానించారు.

చైనాకు మోదీ భయపడుతున్నారా?

ప్రధాని మోదీ చైనాకు భయపడుతున్నారా అని కాంగ్రెస్‌ నిలదీసింది. ఇంత జరిగినా ఇంకా ఆ దేశాన్ని ప్రేమిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవాచేసింది. డీజీపీ-ఐజీపీల వార్షిక సదస్సులో చైనాపై సమర్పించిన నివేదిక మోదీ ప్రభుత్వ బలహీన వైఖరిని బహిర్గతం చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా శుక్రవారమిక్కడ అన్నారు. దీనిపై పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామని తెలిపారు. భారత భూమిని చైనా ఆక్రమించలేదని మోదీ క్లీన్‌చిట్‌ ఇచ్చారని.. కానీ పోలీసు సదస్సులో సమర్పించిన నివేదిక దానిని తుత్తునియలు చేసిందన్నారు. భారత భూభాగాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని అక్కడ మౌలిక వసతులు కల్పిస్తున్నా మోదీ సర్కారు ఖండిస్తుండడం చైనాకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. 65 పెట్రోలింగ్‌ పాయింట్లకు గాను 26 పాయింట్లను పోగొట్టుకున్నట్లు నివేదిక పేర్కొందని.. ఈ ప్రభుత్వం జాతీయ భద్రతపై రాజీపడింద న్నారు.

Updated Date - 2023-01-28T04:38:20+05:30 IST